Begin typing your search above and press return to search.

గోల్డెన్ ఛాన్సులు దక్కించుకున్న ప్లాప్ డైరెక్టర్స్ మళ్ళీ హిట్ కొడతారా..?

By:  Tupaki Desk   |   23 Dec 2020 7:09 PM IST
గోల్డెన్ ఛాన్సులు దక్కించుకున్న ప్లాప్ డైరెక్టర్స్ మళ్ళీ హిట్ కొడతారా..?
X
ఒక సినిమా ఫలితం అనేది నటీనటుల కంటే దర్శకుడిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న వారు కూడా ఒక్క ప్లాప్ తో క్రిందికి పడిపోయినవారు చాలా మందే ఉన్నారు. అందులోనూ రోజుకొక కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న నేపథ్యంలో అలాంటి దర్శకులకి మళ్ళీ అవకాశాలు రావడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇంతకముందు డిజాస్టర్స్ ఇచ్చిన కొంతమంది దర్శకులు ఇటీవల మళ్ళీ మంచి అవకాశాలు దక్కించుకున్నారు. అలాంటి డైరెక్టర్స్ అందరూ తమని తాము నిరూపించుకోవడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. అలాంటి దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం!

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వి.వి. వినాయ‌క్ 'దిల్' 'ఆది' 'ఠాగూర్' 'బన్నీ' 'లక్ష్మి' 'కృష్ణ' 'అదుర్స్' 'ఖైదీ నెం.150' వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే 'ఇంటెలిజెంట్' సినిమా ప్లాప్ అవడంతో వినాయక్ మరో సినిమా చేయలేదు. అయితే 'ఛత్రపతి' సినిమాని హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ కొట్టేసాడు వినాయక్. బాలీవుడ్ లో డెబ్యూ ఇస్తున్న ఈ మాస్ డైరెక్టర్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి సాలిడ్ క‌మ్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.

టాలీవుడ్ లో ప్లాప్ డైరెక్టర్ గా ముద్రపడిపోయిన మెహర్ రమేష్.. 'షాడో' సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఏడేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'వేదలమ్' సినిమాని చిరుతో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు మెహర్. ఈ రీమేక్ తో ఎలాగైనా హిట్ డైరెక్టర్ అనిపించుకోవాలని కసితో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈ గోల్డెన్ ఛాన్స్ తో మెహర్ రమేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

'బొమ్మరిల్లు' 'పరుగు' సినిమాల సక్సెస్ తో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన భాస్కర్.. ఏడేళ్ల క్రితం వచ్చిన 'ఒంగోలు గిత్త' సినిమా ప్లాప్ తర్వాత ఇండస్ట్రీలో కనిపించలేదు. ఆ తర్వాత తమిళ్ లో కొన్ని సినిమాలు చేసినా బొమ్మరిల్లు భాస్కర్ ని గుర్తించలేదు. అయితే ఇప్పుడు అక్కినేని అఖిల్ హీరోగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న భాస్కర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన శ్రీను వైట్ల.. 'ఆనందం' 'వెంకీ' 'ఢీ' 'దుబాయ్ శీను' 'కింగ్' 'దూకుడు' 'బాద్ షా' వంటి హిట్ సినిమాలు తీసాడు. అయితే 'ఆగడు' సినిమాతో సహా మరో రెండు చిత్రాలు ప్లాప్ అవడంతో డీలా పడిపోయాడు. ఇప్పుడు శ్రీను వైట్ల కమ్ బ్యాక్ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు. మంచు విష్ణుతో 'డీ' కి సీక్వెల్ గా 'డి అండ్‌ డి - డబుల్‌ డోస్‌' అనే సినిమా చేస్తున్నాడు. తన రేంజ్ కి తగ్గ స‌క్సెస్ అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న వైట్ల శ్రీను కి ఎలాంటి సక్సెస్ వస్తుందో చూడాలి.

'కొత్త బంగారు లోకం' 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' చిత్రాలతో టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల.. 'బ్రహ్మోత్సవం' సినిమాతో డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. దీంతో నాలుగేళ్లు ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' అనే రీమేక్ సినిమా చేసే అవకాశం దక్కించుకుని అందరినీ అవాక్కయ్యేలా చేసాడు. ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. మరి ఈ డైరెక్టర్ కి నారప్ప ఎలాంటి ఫలితాన్ని అందిస్తాడో చూడాలి.