Begin typing your search above and press return to search.

రేపు సీఎంను సినీ పెద్దలు కలుస్తారా లేదా..?

By:  Tupaki Desk   |   9 Feb 2022 7:13 AM GMT
రేపు సీఎంను సినీ పెద్దలు కలుస్తారా లేదా..?
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గురువారం (ఫిబ్రవరి 10) టాలీవుడ్ సినిమా ప్రముఖులు సమావేశం కానున్నారు. గత నెలలో లంచ్ భేటీలో జగన్ ని కలిసిన చిరంజీవి.. ఇండస్ట్రీ సమస్యలను వివరించానని తెలిపారు. ఈ అంశాలను సినీ పెద్దలతో చర్చించి మరోసారి సీఎంని కలుస్తానని మీడియా ముందు చెప్పారు. ఈ క్రమంలో రేపు సీఎంతో భేటీ కాబోతున్నారు. అయితే జగన్ కు విన్నవించిన అంశాలపై చర్చించారా లేదా? ఈ విషయంపై ఏకాభిప్రాయం వచ్చిందా లేదా? అసలు చిరు వెంట ఎవరెవరు వెళ్తున్నారు? అనేది చర్చనీయంగా మారింది.

ప్రస్తుతం మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తల ప్రకారం చిరంజీవితో పాటుగా అక్కినేని నాగార్జున‌ - ఆర్.నారాయణ మూర్తి - రాజమౌళి - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'ఆచార్య' 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' సినిమా నిర్మాతలతో సహా కొంతమంది స్టార్ హీరోలు కలిసి సీఎంతో సమావేశానికి హాజరు కాబోతున్నట్లు తెలుసుస్తోంది. అయితే టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్స్ అయిన దగ్గుబాటి సురేష్ బాబు - అల్లు అరవింద్ - దిల్ రాజు వంటి సినీ పెద్దలు రేపు జరగబోయే మీటింగ్ లో పాల్గొంటారా లేదా? అనే చర్చ జరుగుతోంది.

జగన్ తో భేటీకి ముందు సినీ ప్రముఖులతో చిరంజీవి సమావేశం అవ్వాలని భావించారు. కానీ ఇంతవరకు ఈ భేటీ జరిగినట్లు సమాచారం లేదు. కొందరు కీలక సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ వాయిదా పడిందని వార్తలు వస్తుంటే.. మరోవైపు దీనిపై ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం రాలేదని.. పలువురు సినీ పెద్దలు సానుకూలంగా లేకపోవడంతో భేటీ జరగలేదని టాక్ వినిపిస్తోంది.

సినీ ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి ఫిలిం ఛాంబర్ - కౌన్సిల్ తదితర ఆర్గనైజేషన్స్ కృషి చేస్తూ ఉంటాయి. చిరంజీవి - నాగార్జున లతో పాటుగా సురేష్ బాబు - అల్లు అరవింద్ - దిల్ రాజు - సి. కళ్యాణ్ వంటి సినీ పెద్దలు కూడా ముందుండి నడిపిస్తుంటారు. ఏపీలో పరిశ్రమకున్న ప్రాబ్లమ్స్ మీద ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వంతో భేటీ అయ్యారు. దిల్ రాజు రెండుసార్లు.. సురేష్ బాబు - అల్లు అరవింద్ ఒక్కోసారి ఏపీకి వెళ్లి వచ్చారు.

అయినప్పటికీ సినిమా టికెట్ల వ్యవహారం గతేడాది ఏప్రిల్ నుంచి కొనసాగుతూనే ఉంది. ఏపీ సర్కారు నిర్ణయించిన రేట్లతో సినిమాలు ప్రదర్శిస్తే థియేటర్లు క్లోజ్ చేసుకోవాల్సిందేనని సురేష్ బాబు కామెంట్ చేసారు. పలువురు హీరోలు నిర్మాతలు సైతం ప్రభుత్వ జీవోపై అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ముఖ్యమంత్రితో సమావేశానికి సినీ పెద్దలు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఏదేమైనా గత 10 నెలలుగా ఇండస్ట్రీలో నానుతున్న సినిమా టికెట్ రేట్ల ఇష్యూ ఈసారి సమావేశంతో ఓ కొలిక్కి రావాలని అందరూ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల విడుదలలు ఉన్నాయి. ఆలోపు ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి అనుకూలంగా సరికొత్త జీవో వస్తుందని ఆశిస్తున్నారు. సినిమా టికెట్ ధరలు నియంత్రించడంతో పాటు, బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరిస్తూ ఏపీ ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేయ‌డంతో ఈ స‌మ‌స్య మొద‌లైంది. రేపు జరగబోయే సమావేశంలో వీటితో పాటుగా ఇతర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే సినిమా టికెట్ల ధరలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి ఈ నివేదికను అందజేశారు. సినిమా టికెట్ల వ్యవహారంపై సీఎం జగన్‌ గురువారం స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి రేపు ఏమి జరుగుతుందో చూడాలి.