Begin typing your search above and press return to search.

సమంత అన్ని అడ్డంకులను అధిగమించి అక్కడ సక్సెస్ అయ్యేనా..?

By:  Tupaki Desk   |   26 May 2021 5:30 PM GMT
సమంత అన్ని అడ్డంకులను అధిగమించి అక్కడ సక్సెస్ అయ్యేనా..?
X
సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ''ది ఫ్యామిలీ మ్యాన్ 2'' వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇది సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్' కు కొనసాగింపుగా రూపొందింది. ఫస్ట్ సీజన్ లో నటించిన మనోజ్ బాజ్ పాయ్ - ప్రియమణి ఇందులో కూడా కంటిన్యూ అయ్యారు. దర్శకద్వయం రాజ్ & డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న సీజన్-2 ఎట్టకేలకు జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే భారీ అంచనాల మధ్య వస్తున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా లేదా అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.

ఎందుకంటే ఇప్పటివరకు భారతీయ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. భారీ అంచనాల నడుమ వచ్చిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అలానే వెబ్ సిరీస్ ల సీక్వెల్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీనికి ‘ఆశ్రమ్ 2’ ‘మీర్జాపూర్-2’ వంటి సిరీస్ లను ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా వచ్చిన సీజన్-2 ప్రేక్షకులను నిరాశ పరిచింది. అలానే అమెజాన్ ప్రైమ్ లో సెన్సెషన్ క్రియేట్ చేసిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ కు సీక్వెల్ గా వచ్చిన సీజన్-2 అంచనాలను అందుకోలేకపోయింది. మరి ఇప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్’ సీక్వెల్ ఈ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

ఇటీవల విడుదలైన 'ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఇప్పటికే 48 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సీజన్ 2 బిగ్ హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే అదే సమయంలో ఈ వెబ్ సిరీస్ పై పెద్ద ఎత్తున వివాదాలు వస్తున్నాయి. ఈ ట్రైలర్ తమిళుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ ఈ సిరీస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు చూపించారని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.