Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ను ఆర్ఆర్ఆర్ దెబ్బ తీస్తుందా?

By:  Tupaki Desk   |   21 March 2022 4:30 AM GMT
టాలీవుడ్ ను ఆర్ఆర్ఆర్ దెబ్బ తీస్తుందా?
X
మీ నెల సంపాదన రూ.25వేలు అనుకుందాం. అందులో వినోదానికి వెచ్చించే మొత్తం ఐదు శాతమే ఉంటుంది. వినోదం కింద ఒక్క సినిమానే కాదు.. మరికొన్ని అంశాలు కూడా ఉంటాయి. అంటే.. సగటు జీవి వినోదం కోసం వెచ్చించే మొత్తం ఐదు శాతం అనుకుంటే రూ.1250 అవుతుంది. అందులో 50 శాతం సినిమాలకు ఖర్చు చేస్తాడనుకుందాం. అంటే.. రూ.625. మల్టీఫ్లెక్సులు మొదలు మామూలు థియేటర్ల వరకు సరాసరిన సగటు టికెట్ రూ.150 వేసుకుంటే.. నాలుగు టికెట్లు వచ్చేస్తాయి. అంటే.. చిన్న కుటుంబం నెలకు ఒక సినిమా ఖాయంగా చూడొచ్చు. లేదంటే.. రెండింటి వరకు ఇబ్బంది లేకుండా చూసే వీలుంటుంది.

అలాంటిది ఒక సినిమా టికెట్ సరాసరి రూ.350 అయితే.. లెక్కలు ఎలా మారతాయి? అన్నదిప్పుడు ప్రశ్న. టాలీవుడ్ తో పాటు యావత్ దేశంలోని అన్ని వుడ్డులు రాజమౌళి చేసే మేజిక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబాలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. శిల్పాన్ని చెక్కినట్లుగా తన సినిమాను చెక్కే రాజమౌళి.. ఫక్తు వాణిజ్యవేత్తగా పలువురు అభివర్ణిస్తుంటారు. తన సినిమా కోసం ఎంతలా శ్రమిస్తాడో.. దానికి పెట్టిన ప్రతి పైసాకు రూపాయి తిరిగి వచ్చేలా ఆయన ప్రణాళికలు ఉంటాయి.

సినిమా కోసం ఎంత కష్టపడతారో.. అందులో సగం కంటే ఎక్కువ తన సినిమా ప్రమోషన్ కోసం ఆయన శ్రమిస్తారు. తన సినిమాను మార్కెటింగ్ చేసుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయం బాహుబలితోనే అర్థం కాగా.. తాజా ఆర్ఆర్ఆర్ తో కన్ఫర్మ్ అయిపోయింది. జగన్ లాంటి ముఖ్యమంత్రిని సైతం ప్రభావితం చేసుకొని తన సినిమా టికెట్ల ధరల్ని పెంచుకోవటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పటికే గూబలు అదిరేలా టికెట్ల ధరల్ని పెంచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ రీతిలో ప్రభావితం చేశారో కానీ.. సగటు ప్రేక్షకుడి గురించి ఆలోచించకుండానే ధరల పెరుగుదలకు జక్కన్న అడగటం.. దానికి కేసీఆర్ సర్కారు ఓకే చేసేయటం చాలామందిని విస్మయానికి గురి చేసింది.

నిజమే.. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం నిర్మాత భారీగా ఖర్చు చేశారు. దాన్ని రికవరీ చేసుకోవటం కోసం ప్రేక్షకుల నుంచి రాబట్టుకోవటం తప్పేం కాదు. కానీ.. సమస్యంతా ముక్కుపిండి వసూలు చేయటం మీదనే. ఎంత సినిమా మీద క్రేజ్ ఉంటే మాత్రం.. దాన్ని అసరాగా చేసుకొని టికెట్ల ధరల్ని భారీగా పెంచేయటం ఎంతవరకు సబబు? అన్నది మరో ప్రశ్న. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ టికెట్ల ధరల్ని చూసిన తెలుగు సినిమా నిర్మాతలు విస్మయానికి గురవుతున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధరల్ని భారీగా పెంచేయటం వల్ల.. క్రేజ్ ఉన్న ఈ సినిమా కోసం ఖర్చు చేసే ప్రేక్షకులు..తమ జేబు బడ్జెట్ ను సర్దుబాటు చేసుకోవటానికి.. చాలా సినిమాల్ని స్కిప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అదే జరిగితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదలయ్యే చాలా సినిమాలకు సరైన ఓపెన్సింగ్ ఉండవన్న అంచనా వ్యక్తమవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంతో బాగుందన్న మాట విన్న తర్వాతే తప్పించి.. మిగిలిన సినిమాలు చూసేందుకు థియేటర్లకు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయని.. ఓటీటీలో వస్తుంది కదా? అని ఊరుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుందంటున్నారు.

అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత థియేట్రికల్ వసూళ్ల మీద భారీ ప్రభావం పడుతుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. ఆర్ఆర్ఆర్ వసూళ్ల వర్షం ఆ సినిమా దర్శకనిర్మాతకు లాభం చేకూర్చవచ్చు. అదే సమయంలో టాలీవుడ్ కు మాత్రం శాపమే అవుతుందంటున్నారు. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ కోసం భారీగా ఖర్చు చేసిన సగటు ప్రేక్షకులు తమ బడ్జెట్ ను సర్దుబాటు చేసుకోవటానికి.. మిగిలిన సినిమాల మీద తమ పొదుపును చూపించే అవకాశం ఉంది. అది.. టాలీవుడ్ కు శాపమే అవుతుంది