Begin typing your search above and press return to search.

పుష్ప కోసం అలాంటి కసరత్తు చేస్తున్న రష్మిక

By:  Tupaki Desk   |   17 April 2020 11:30 PM GMT
పుష్ప కోసం అలాంటి కసరత్తు చేస్తున్న రష్మిక
X
అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప' పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈమధ్య అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడతారని తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా ఇప్పటికే చిత్తూరు యాసపై పట్టు సాధించేందుకు బన్నీ కసరత్తు చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక పాత్ర కూడా చిత్తూరు యాసలోనే మాట్లాడుతుందట.

రష్మిక దాదాపుగా తన సినిమాలన్నింటికీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. అలాగే ఈ సినిమాకు కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటోందట. అయితే కన్నడ అమ్మాయి ఇలా చిత్తూరు యాసలో మాట్లాడడం కష్టం కాబట్టి ఇప్పటి నుంచే చిత్తూరు యాసపై పట్టు సాధించేందుకు ఇంటిపట్టున ఉండి సాధన చేస్తోందట. అంతేకాకుండా నటన మెరుగుపరుచుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోందట. సాధారణమైన సిటీ గర్ల్ పాత్రలు చేయడం రష్మికకు కొట్టిన పిండే. కానీ ఈ పాత్ర అలా కాదు.. పల్లెటూరి అమ్మాయిలా.. కరెక్టుగా చెప్పాలంటే 'రంగస్థలం'లో సమంత పాత్ర తరహాలో ఉంటుంది. పైగా చిత్తూరు యాసలో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే చిత్తూరు యాస నేర్చుకోవడంతో పాటు నటనను మెరుగుపరుచుకునేందుకు సమంత నటించిన 'రంగస్థలం'.. ఇతర సినిమాలను అదే పనిగా చూస్తోందట. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో మాసు పాత్రలను.. వారి హావభావాలను కూడా నిశితంగా పరిశీలిస్తోందట. 'పుష్ప' షూటింగ్ ప్రారంభమయ్యే లోపు ఆ పాత్రకు తగ్గట్టు రెడీ అవ్వాలి అనే పట్టుదలతో ఉందట.

అయితే ఈ సినిమాలో రష్మిక పాత్రకు డబ్బింగ్ చెప్పుకునే విషయంలో ఫైనల్ కాల్ మాత్రం సుకుమార్ అదేనని అంటున్నారు. చిత్తూరు యాస సహజంగా ఉన్నట్లు అనిపిస్తే రష్మిక ఓన్ డబ్బింగుకి సరే అంటారని.. లేకపోతే వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పిస్తారు అని అంటున్నారు. మరి రష్మిక చిత్తూరు యాసపై పట్టు సాధించగలుగుతుందా.. సమంతా మెప్పించినట్టు పల్లెటూరి అమ్మాయి పాత్రలో ప్రేక్షకులను మెప్పించగలుగుతుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా రష్మికకు ఇది ఛాలెంజింగ్ పాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.