Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న `రామాయ‌ణం 3డి` ప్లాన్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   4 May 2020 9:30 AM IST
జ‌క్క‌న్న `రామాయ‌ణం 3డి` ప్లాన్ చేస్తున్నారా?
X
ద‌క్షిణాది ఉత్త‌రాది అనే తేడా లేకుండా అన్నిచోట్లా వీరాభిమానుల్ని సంపాదించారు ఎస్.ఎస్.రాజ‌మౌళి. దేశ విదేశాల్లో ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేకించి ఫాలోయింగ్ ఉంది. బాహుబ‌లి ఫ్రాంఛైజీ తెచ్చిన గౌర‌వ‌మిది. రాజ‌మౌళి తెర‌కెక్కించే భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ సినిమాల‌కు ప్ర‌త్యేకించి క్రేజు ఏర్ప‌డింది. ఆ క్ర‌మంలోనే ఆయ‌న తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్ కి పాన్ ఇండియా లెవ‌ల్లో ఫాలోయింగ్ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. లాక్ డౌన్ ముగిస్తే త‌దుప‌రి చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉండ‌గా జక్క‌న్న రిలీజ్ తేదీ మార్పు పైనా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ లాక్ డౌన్ వేళ దూరదర్శన్ లో రామనంద్ సాగర్ తెర‌కెక్కించిన ఇతిహాసం `రామాయణం` రిపీటెడ్ గా టెలీకాస్ట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. పునప్రసారంలోనూ ఏకంగా ఏడున్న‌ర కోట్ల (77 మిలియన్ లు) మంది వీక్షించడం సంచ‌ల‌న‌మైంది. బుల్లితెర‌పై రామాయ‌ణం సీరియ‌ల్ సరికొత్త ప్రపంచ రికార్డును నెల‌కొల్పింది. అప్ప‌టి నుండి అనేక మంది ఉత్తర భారత అభిమానులు సోషల్ మీడియాలో ``# రాజమౌళి మేక్ రామాయణ్‌`` అనే హ్యాష్ ‌ట్యాగ్ ‌ను ప్రముఖంగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ ధోరణి ఉత్తర భారత సినీ ప్రేమికులలో రాజమౌళికి ఉన్న ఫాలోయింగ్ ని అర్థ‌మ‌య్యేలా చెబుతోంద‌ని ఇదివ‌ర‌కూ వెల్ల‌డించాం.

రాజమౌళి తన ఉత్తర భారత అభిమానుల అభ్యర్ధనను మ‌న్నించి పురాణేతిహాసం `రామాయణం`పై సినిమా ప్లాన్ చేస్తున్నారా? అంటూ సోష‌ల్ మీడియాలో మ‌రో ఆస‌క్తిక‌ర డిబేట్ మొద‌లైంది. రాజమౌళి కలల ప్రాజెక్ట్ `మహాభారతం 3డి`పై చాలా కాలంగా చ‌ర్చ సాగుతూనే ఉంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ దానికి సంబంధించిన రూపురేఖ‌లేవీ క‌నిపించ‌లేదు. మ‌రోవైపు ఉత్త‌రాది ఆడియెన్ జ‌క్క‌న్న‌నే `రామాయణం` తెర‌కెక్కించాల‌ని ఎందుక‌ని కోరుకుంటున్నారు? `గ‌జిని` హిందీ రీమేక్ తో సంచ‌ల‌నం సృష్టించిన అల్లు అర‌వింద్ నే ఎందుకు కోర‌డం లేదు? ఆయ‌న ఇదివ‌ర‌కే దాదాపు రూ.1000 కోట్ల బ‌డ్జెట్ తో `రామాయ‌ణం 3డి`ని సిరీస్ గా తెర‌కెక్కిస్తాన‌ని ప్ర‌క‌టించారు క‌దా? కేర‌ళ ప్ర‌భుత్వంతోనూ దీనికి సంబంధించిన ఒక ఒప్పందం చేసుకున్నారు. మ‌రి బాస్ అల్లు అర‌వింద్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ లో రామాయ‌ణం కావాల‌ని అనుకుంటున్నారా? అన్న చ‌ర్చా సాగుతోంది. ఇక‌పోతే అర‌వింద్ రామాయ‌ణం 3డి కోసం ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడిని బ‌రిలో దించుతున్నార‌న్న ప్ర‌చారం సాగింది. అన్న‌ట్టు `రామాయ‌ణం 3డి` తీసేదెవ‌రు? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్ల‌తో సినిమాల‌కు కాలం చెల్లింద‌ని విశ్లేషిస్తున్నారు. పైగా జ‌నాల చూపు ఓటీటీ- డిజిట‌ల్ వైపు మ‌ళ్లడంతో స‌న్నివేశం ఎలా మార‌నుందోన‌న్న క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.