Begin typing your search above and press return to search.

ఓటీటీలు ఆ సినిమాలకు వరంగా మారనున్నాయా...?

By:  Tupaki Desk   |   17 Jun 2020 4:00 PM IST
ఓటీటీలు ఆ సినిమాలకు వరంగా మారనున్నాయా...?
X
సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చర్చల దశలోనే ఆగిపోతుంటాయి. మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా నిలిచిపోతాయి. ఇంకొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదలకు నోచుకోక అలా మిగిలిపోతాయి. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో.. అసలు రిలీజ్ అవుతాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఆ సినిమాల విడుదలపై చాలా జీవితాలు ఆధారపడి ఉంటాయి. నటీనటులు టెక్నీషియన్స్ డైరెక్టర్ ఇలా అందరూ ఎన్నో ఆశలతో ఆ సినిమా పూర్తి చేసి ఉంటారు. ఇక ప్రొడ్యూసర్ వ్యయప్రయాసల గురించి చెప్పక్కర్లేదు. అయితే ఆ సినిమా ఆగిపోవడం వలన వీరందరి కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అలా విడుదలకు నోచుకోని సినిమాలకు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలు వరంగా మారుతున్నాయట. డిజిటల్ వరల్డ్ లో ఓటీటీలు ఎంటర్ అయినప్పటి నుండి అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం వీటి వైపే చూస్తున్నారు. కరోనా మహమ్మారి వలన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా ఓ రేంజ్ లో ఉంది. ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచన వస్తే ఓటీటీలు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. అందరూ ఈ ఓటీటీలలో వచ్చే సినిమాలు, వెబ్ కంటెంట్ చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ దాకా ఏమి వెళ్తాములే.. ఇంట్లోనే కూర్చొని హోమ్ స్క్రీన్ లో ఫ్యామిలీతో సినిమా చూసేయొచ్చు అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇలా రిలీజ్ కి నోచుకోని సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఓటీటీలతో ఒక రేట్ ఫైనలైజ్ చేసుకొని ఇలా అయినా అంతో ఇంతో నష్టాల నుండి బయటపడొచ్చని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలో అప్పుడెప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమైన సత్యదేవ్ '47 డేస్'.. నవీన్ చంద్ర 'భానుమతీ రామకృష్ణ' లాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ''ఆరడుగుల బులెట్'' సినిమా కూడా ఓటీటీలో రావాలని చూస్తోందట. మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన ''ఆరడుగుల బులెట్'' సినిమాని తాండ్ర రమేష్ నిర్మించారు. 2017లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని అనేక వాయిదాల తర్వాత 2017 జూలై 16న విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. వాల్ పోస్టర్స్ కూడా అంటించారు. అయితే ఏమైందో తెలియదు కానీ బొమ్మ స్క్రీన్ మీద పడలేదు. ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా ఈ సినిమా గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని ఈ సినిమా బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఈ సినిమాలే కాకుండా మూలానపడిన చాలా సినిమాలు ఓటీటీల వైపు చూస్తున్నాయట. ఏదేమైనా ఆ సినిమాలు బయటకి వస్తే వర్క్ చేసిన వారికి అంతో ఇంతో మేలు కూడా జరిగే ఛాన్స్ ఉందని సినీ జనాలు అభిప్రాయ పడుతున్నారు.