Begin typing your search above and press return to search.

మహేష్ తన తండ్రి పేరు మీద కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేస్తారా..?

By:  Tupaki Desk   |   17 Nov 2022 5:56 AM GMT
మహేష్ తన తండ్రి పేరు మీద కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేస్తారా..?
X
లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ దహన సంస్కారాలు జరిగాయి. నటశేఖరుడిని చివరిసారి చూసేందుకు సినీ ప్రముఖులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కన్నీటి పర్యంతమవుతూ ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు.

కృష్ణ కుమారుడు హీరో మహేష్ బాబు తండ్రికి తల కొరివి పెట్టి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అయితే దిగ్గజ నటుడికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడంపై సూపర్ స్టార్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చిరస్థాయిగా నిలిచిపోయేలా స్మారక చిహ్నం నిర్మించే విధంగా ప్రైవేట్ స్థలంలో దహన సంస్కారాలు చేయాలని మహేష్ ఎందుకు ఆలోచించలేదని అంటున్నారు.

సాధారణంగా, లెజండరీ వ్యక్తులు చనిపోయినప్పుడు, వారి అంత్యక్రియలు వారి ప్రైవేట్ స్థలంలో నిర్వహించి.. ఒక స్మారక చిహ్నంగా నిర్మిస్తుంటారు. ఇటీవల కృష్ణంరాజు అంత్యక్రియలను ఆయన ఫామ్ హౌస్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు మరణించినప్పుడు ప్రభుత్వ స్థలంలో దహన సంస్కారాలు చేసి, ఎన్టీఆర్ ఘాట్ ని ఏర్పాటు చేసారు.

అలానే అక్కినేని నాగేశ్వరరావు దహన సంస్కారాలను అన్నపూర్ణ స్టూడియోస్‌ లోనే నిర్వహించారు. శోభన్ బాబు - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు కూడా వారి వారి ప్రైవేట్ భూముల్లోనే జరిగాయి. కృష్ణ సతీమణి విజయ నిర్మల కోసం స్మారక మందిరం కట్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కృష్ణ అంత్యక్రియలను కూడా పద్మాలయా స్టూడియోస్ లో నిర్వహించి ఉంటే బాగుండేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

నటశేఖరుడికి ఏదైనా ప్రైవేట్ స్థలంలో అంతిమ సంస్కారాలు చేసి స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తే గొప్పగా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. మహేష్ బాబు ఆ విధంగా ఆలోచించకుండా.. సాధారణ శ్మశానవాటికలో ఎందుకు దహనం చేసారని ఆలోచిస్తున్నారు. అయితే మహేష్ నిర్ణయం మేరకే ఇలా చేసారని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి ఈ ఏడాది జనవరిలో మరణించిన మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అంత్యక్రియలు మహాప్రస్థానంలోనే జరిగాయి. అలానే ఇటీవల ఆయన తల్లి ఇందిరా దేవి దహన సంస్కారాలు కూడా అక్కడే జరిగాయి. ఇప్పుడు కృష్ణ అంత్యక్రియలు కూడా అక్కడే జరగాలనేది ఆయన కోరిక అయ్యుండొచ్చని.. అందులో మహేష్ ని తప్పుబట్టడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు.

తండ్రికి ఏం చేయాలి.. ఎక్కడ అంతిమ సంస్కారాలు చేయాలనేది కొడుక్కి చెప్పే హక్కు ఎవరికీ లేదు. తన తండ్రి అంటే అమితమైన ప్రేమ కలిగి ఉన్న మహేష్ బాబు.. కృష్ణ అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఉండొచ్చు. కాబట్టి దాన్ని గౌరవించి, సూపర్ స్టార్ దహన సంస్కారాల మీద కూడా ఇలాంటివి పుట్టించడం తగదు.

అయితే కృష్ణ కోసం స్మారక చిహ్నం కాకుండా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని మహేష్ బాబు ఆలోచన చేస్తున్నారని టాక్ నడుస్తోంది. కృష్ణ సినిమాలకు సంబంధించిన విశేశాలు మరియు అవార్డులను ఆ మెమోరియల్ లో ఉంచాలని అనుకుంటున్నారట. పద్మాలయా స్టూడియోస్ వద్ద కృష్ణ మెమోరియల్ ను ఏర్పాటు చెయ్యొచ్చని అంటున్నారు.

ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ లెజండరీ నటుడికి కూడా ఇలాంటి మెమోరియల్ లేదు. ఇప్పుడు కృష్ణ కోసం కుటుంబ సభ్యులు స్మారక మందిరం ఏర్పాటు చేసి అభిమానుల సందర్శనార్థం ఉంచితే మంచి ఆలోచనే అవుతుంది.

ఏదేమైనా కృష్ణ ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణంచుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్‌ కు వీడ్కోలు పలుకుతున్నారు. లెజండరీ నటుడు మరణించినా.. వారి సినిమాలతో, జ్ఞాపకాలతో, అయన చేసిన సేవలతో ఎప్పటికీ చిరస్మరణీయులుగానే మిగిలిపోతారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.