Begin typing your search above and press return to search.

ఓటీటీ ప‌రిశ్ర‌మ‌కు ఆసియా కీల‌కంగా మార‌నుందా?

By:  Tupaki Desk   |   26 July 2022 7:30 AM GMT
ఓటీటీ ప‌రిశ్ర‌మ‌కు ఆసియా కీల‌కంగా మార‌నుందా?
X
క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఒక్క‌సారిగా భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసింది. ప్ర‌చం ఏమైపోతుందో అనే భ‌యాన్ని ప్ర‌తీ ఒక్క‌రిలోనూ క‌లిగించింది. కోట్ల మంది ప్రాణాల‌ని గాల్లో క‌లిపేసింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌కు మాత్రం భార‌త్ తో నూత‌న జ‌వ‌స‌త్వాల‌ని అందించింది. కొద్ది మందికి మాత్ర‌మే ప‌రిచ‌యం వున్న ఓటీటీ సంస్కృతిని సెల్ ఫోన్, నెట్ వాడుతున్న ప్ర‌తీ ఒక్క‌రికి చేరువయ్యేలా చేసింది. గ‌త కొంత కాలంగా త‌మ కార్య‌క‌లాపాల‌ని విస్తృతం చేయాల‌ని స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ కంపనీల‌కు ప‌బ్లిసిటీ ఖ‌ర్చు లేకుండానే క‌రోనా ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌ని ప్ర‌తీ ఒక్క‌రికి చేరువ‌య్యేలా చేసింది.

క‌రోనాకు ముందు నుంచే ప్ర‌ముఖ‌ ఓటీటీ ప్లాట్ ఫామ్ లు నెట్ ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, హాట్ స్టార్, జీ5, సోనీ లీవ్‌, ఆహా, ఆల్ట్ బాలాజీ, వూట్‌, ఎమ్ ఎక్స్ ప్లేయ‌ర్‌, జీయో సినిమా, స‌న్ నెక్స్ట్‌, స్టేజ్ వంటివి వున్నాయి. అయితే కోవిడ్ త‌రువాతే ఇవి వున్నాయ‌ని రూర‌ల్ స్థాయిలో తెలిసింది. క‌రోనా కార‌ణంగా రెండేళ్ల పాటు థియేట‌ర్లు వెళ్లే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వినోదం కోసం అంతా ఓటీటీల‌లో వెత‌క‌డం మొద‌లు పెట్టారు. ఇంటి ప‌ట్టునే వుంటూ కాల‌క్షేపం కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు అల‌వాడుప‌డిన జ‌నం ఇప్ప‌డు దానికే ఎడిక్ట్ అయిపోయి థియేట‌ర్ల‌కు రావ‌డం మానేశారు.

ప్ర‌తి సినిమా రెండు మూడు వారాలు త‌రువాత ఓటీటీలో ప్ర‌త్య‌క్ష్యం అవుతున్న నేప‌థ్యంలో థియేటర్ల‌కు వెళ్ల‌డానికి స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఆస‌క్తిని చూపించ‌డం లేదు. అర్బ‌న్ ఏరియాల నుంచి రూర‌ల్ ఏరియాల వ‌ర‌కు స‌గ‌టు ప్రేక్ష‌కుడి తీరు మార‌డంతో ఓటీటీలు మునుపెన్న‌డూ లేని విధంగా రికార్డు స్థాయిలో పుంజుకోవ‌డ‌మే కాకుండా భారీ ఆదాయాన్ని ద‌క్కించుకుంటూ రికార్డు సృష్టిస్తున్నాయి. రానున్న ఐదేళ్ల‌లో ఓటీటీల ఆదాయం రికార్డు స్థాయికి చేర‌నుంద‌ని ఓ సంస్థ గ‌ణాంకాల‌తో తాజాగా మీడియా పార్ట్న‌ర్స్ ఏషియా ఓ నివేదిక‌ని విడుద‌ల చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ ల తాజా గ‌ణాంకాలు సినీ దిగ్గ‌జాల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టించేవిలా వున్నాయి. కంప్లీట్ గా థియేట‌ర్ వ్య‌వస్థ‌ని చావు దెబ్బ‌తీసేలా వున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఓటీటీల‌కు సాధార‌ణ జ‌నం ఎడిక్ట్ అయిపోవ‌డంతో ప్ర‌ధానంగా ఏషియా మార్కెట్‌ను ఓటీటీ దిగ్గ‌జాలు కీల‌కంగా ఎంచుకున్నాయ‌ట‌. ఇక్క‌డే సినిమాల‌ను, వెబ్ సిరీస్ ల‌ని అమితంగా చూసే ఆడియ‌న్స్ వుండ‌టంతో ప్ర‌ధానంగా ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌నే వారు ప్ర‌ధాన టార్గెట్ గా చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. తాజా గ‌ణాంకాల ప్ర‌కారం భార‌త ఓటీటీ స్ట్రీమింగ్ వీడియో మార్కెట్ 3 మిలియ‌న్ డాల‌ర్ల‌ (సుమారు రూ. 24,000 కోట్ల‌)కు చేర‌కుంటుంద‌ని చెబుతున్నారు.

2027 క‌ల్లా ఇది రెట్టింప‌వుతుంద‌ని ఏకంగా 7 మిలియ‌న్ డాల‌ర్ల (సుమారు రూ. 56.000 కోట్ల‌)కు చేరొచ్చ‌ని మీడియా పార్ట్న‌ర్స్ ఏషియా ఓ నివేదిక‌లో పేర్కొంది. ఇదిలా వుంటే ప్రాంతీయంగా ఏర్పడిన ఓటీటీ కంప‌నీలు మంచి కంటెంట్ తో అంత‌ర్జాతీయ ఓటీటీల‌కు బిగ్ ఛాలెంజ్ గా నిలుస్తున్నాయి. పోటీలో త‌మ స‌త్తాని చాటుతూ మేము కూడా ఎందులో త‌గ్గ‌మ‌ని నిరూపిస్తున్నాయి. త్వ‌ర‌లో ఈ రంగంలోకి మ‌రిన్ని టెలికాం కంప‌నీలు కూడా దిగనున్నాయ‌ని, ఈ ప‌రిణామం కీల‌కంగా మార‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆసియా ప‌సిఫిక్ ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ ప‌రిశ్ర‌మ ఆదాయం 2022కు గానూ 16 శాతం వృద్దితో 49.2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరొచ్చ‌ని అంచ‌నా. ఇందులో ఎస్ వీ ఓడీ (స‌బ్స్‌స్క్రీప్ష‌న్ వీడియో ఆన్ డిమాండ్) వాటా 50 శాతం, యూజీసీ (యూజ‌ర్ జ‌న‌రేటెడ్), ఏవీఓడీ (అడ్వ‌ర్టైజింగ్ వీడియో ఆన్ డిమాండ్) వాటా 37 శాతం చొప్పున ఉండొచ్చ‌ని తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇందులో 8 శాతం స‌మ్మిళిత వృద్ధిరేటు (సీఏజీఆర్‌)తో 2027 క‌ల్లా ఈ ప‌రిశ్ర‌మ 72.7 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరొచ్చ‌ని చెబుతున్నారు. అప్పుడు కూడా ఎస్ వీ ఓడీ : ఏవీఓడీ నిష్ప‌త్తి స్థిరంగా వుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక చైనాను మిన‌హాయించి ఆసియా ప‌సిఫిక్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ వీడియో ప‌రిశ్ర‌మ 2022లో 24 శాతం మేర వృద్ధి చెంది 25.6 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయాన్ని న‌మోదు చేయ‌వ‌చ్చ‌ని అంచ‌నా. 2027 క‌ల్లా ఇది 11 శాతం సీఏజీఆర్ తో 42.8 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరే అవాకాశం వుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో దేశీయ ఓటీటీలు మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జీ, సోనీ విలీన‌మై స‌రికొత్త టీవి, ఆన్‌లైన్ వీడియో వ్యాపారాన్ని ప్రారంభించ‌నున్నాయ‌ట‌. రిల‌య‌న్స్ మ‌ద్ద‌తు వున్న వ‌యాకామ్ 18 కు చెందిన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ త‌న ఐపీఎల్ క్రికెట్‌, స్థానికి వినోదంతో ఓవీఓడీ రంగంలో ప్ర‌ముఖ సంస్థ‌గా మారే అవ‌కాశం వుంద‌ట‌. జీయో మొబైల్‌, కనెక్టెడ్ టీవీల ద్వారాఎక్కువ వాట‌ని పొందే అవ‌కాశం వుంద‌ని మార్కెట్ వ‌ర్గాల అంచ‌నా.

ఇదిలా వుంటే ప్ర‌స్తుతం ఓటీటీ రంగంలో మాత్రం ఐదింటిదే హ‌వా న‌డుస్తోంది. నెట్ ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌, ఎమ్ ఎన్ సీ డిజిట‌ల్‌, వీఐయూలు ఈ ఏడాది ప్రీమియం వీడియో ఆదాయంలో 75 శాతం వాటాని పొందాయ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. మొత్తం ఆసియా పసిఫిక్‌ ఆన్ లైన్ వీడియోలో 20 ఆన్ లైన్ వీడియో ప్లాట్ ఫార‌మ్ ల‌దే 67 శాతం వాటా వుండొచ్చ‌ని అంచ‌నా. చైనాను మిన‌హాయించి ఆసియా ప‌సిఫిక్ యూట్యూబ్ కు ఏవీఓడీలో 42 శాతం వాటా వుంది. చైనాను మినహాయించి ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ కు 33%, అమెజాన్ ప్రైమ్ కు 12% , డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కు 11% చొప్పున ఏవీఓడీ వాటా న‌మోద‌య్యింది. తాజా నివేదిక‌ల ప్ర‌కారం అంత‌ర్జాతీయ ఆన్ లైన్ వీడియో పరిశ్ర‌మ‌లో భ‌విష్య‌త్తులో ఆసియా ప‌సిఫిక్ ప్రాంతం కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని స్ప‌ష్టం కావ‌డం గ‌మ‌నార్హం.