Begin typing your search above and press return to search.

నాగ‌శౌర్య న‌మ్మ‌కాన్ని అరుణాచ‌లం నిల‌బెడ‌తాడా?

By:  Tupaki Desk   |   3 Nov 2022 8:30 AM GMT
నాగ‌శౌర్య న‌మ్మ‌కాన్ని అరుణాచ‌లం నిల‌బెడ‌తాడా?
X
'క్రికెట్ గాళ్స్ అండ్ బీర్‌' సినిమాతో ముగ్గురు హీరోల్లో ఒక హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు నాగ‌శౌర్య‌. ఆ త‌రువాత 'చంద‌మామ క‌థ‌లు', ఊహ‌లు గుస‌గుస‌లాడే వంటి సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే హీరోగా మాత్రం మంచి గుర్తింపుని తెచ్చుకోవ‌డానికి నాగ‌శౌర్య‌కు పెద్ద ప్ర‌యోగామే చేయాల్సి వ‌చ్చింది. హీరోగా నిల‌బ‌డాలంటే త‌నిని తానే నిల‌బెట్టుకోవాలని భావించిన నాగ‌శౌర్య సొంతం గా బ్యాన‌ర్ ని ప్రారంభించి 11 సినిమాల త‌రువాత 12న మూవీతో సూప‌ర్ హిట్ ని ద‌క్కించుకోవాల్సి వ‌చ్చింది.

అదే 'ఛ‌లో'. స్వీయ నిర్మాణంలో రిస్క్ చేసి నాగ‌శౌర్య చేసిన ఈ మూవీ అత‌ని కెరీర్ లో వ‌సూళ్ల ప‌రంగా, హిట్ టాక్ ప‌రంగా ప్ర‌త్యేకంగా నిలిచింది. హీరోగా కూడా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అయితే ఆ హిట్ ని నిల‌బెట్టుకోవ‌డం కోసం నాగ‌శౌర్య వేసిన త‌ప్ప‌ట‌గులు అత‌న్ని ఫ్లాప్ ల వైపు ప‌రుగులు తీసేలా చేశాయి. ఇప్ప‌టికీ చేస్తున్నాయి. 'ఛ‌లో' మూవీతో రొమాంటిక్ హిట్ ని ద‌క్కించుకుని హీరోగా నిల‌బ‌డ్డాన‌ని భావించాడు. కానీ అది ఎంతో సేపు నిల‌బ‌డ‌లేదు. ఆ త‌రువాత ఎనిమిది సినిమాలు నాగ‌శౌర్య‌కు చేదు అనుభ‌వాన్నే మిగిల్చాయి.

రీసెంట్ గా న‌టించిన 'కృష్ణ వ్రింద విహారి' పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకున్నా నాగ‌శౌర్య ఆశించిన విజ‌యాన్ని మాత్రం అందించ‌లేక‌పోయింది. సొంత బ్యాన‌ర్ లో చేసిన ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నా అప్ప‌టికే నాని న‌టించిన 'అంటే సుంద‌రానికి' సినిమా పోలీక‌లు వుండ‌టంతో ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య ఫ‌లానా అబ్బాయి - ఫ‌లానా అమ్మాయి, నారీ నారీ న‌డుమ మురారీ, పోలీస్ వారి హెచ్చ‌రిక వంటి మూడు విభిన్న‌మైన సినిమాల్లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూడు ప్రాజెక్ట్ లు షూటింగ్ ద‌శ‌లో వున్నాయి.

ఇదిలా వుంటే తాజాగా నాగ‌శౌర్య కొత్త ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. అరుణాచ‌లంతో కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇది నాగ‌శౌర్య న‌టిస్తున్న 24వ మూవీ. గురువారం ఈ సినిమాని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. వైష్ణ‌వి ఫిలింస్ బ్యాన‌ర్ పై చింత‌ల‌పూడి, విజ‌య్ కుమార్ చింత‌ల‌పూడి, డా. అశోక్ కుమార్ చింత‌ల‌పూడి నిర్మిస్తున్నారు. వినోదం, ఫ్యామిలీ ఎమోష‌న్స్ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు. గ‌త కొంత కాలంగా ఈలాంటి స్క్రిప్ట్ కోస‌మే నాగ‌శౌర్య ఎదురుచూస్తున్నార‌ట‌. త‌న‌కు ఇది క‌రెక్ట్ స్క్రిప్ట్ అని తెలుస్తోంది.

ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌. సినిమాలో నాగ‌శౌర్య స‌రికొత్త మేకోవ‌ర్ లో క‌నిపించ‌నున్నాడ‌ని, ఇందు కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో పేరున్న న‌టీన‌టులు న‌టిస్తార‌ని, క్రేజీ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేయ‌నున్నార‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఇందులో న‌టించే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌. మ‌రి ఈ మూవీతో ప‌రిచ‌యం అవుతున్న అరుణాచ‌లం అయినా నాగ‌శౌర్య‌ని మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టించేనా అన్న‌ది వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.