Begin typing your search above and press return to search.

అల్లుడితో అమ్మాయిగారి దశ తిరిగేనా?

By:  Tupaki Desk   |   5 Jan 2021 8:00 AM IST
అల్లుడితో అమ్మాయిగారి దశ తిరిగేనా?
X
మత్తెక్కించే కళ్లతో .. మంత్రం వేసే చూపులతో ఇట్టే ఆకట్టుకునే రూపం అనూ ఇమ్మాన్యుయేల్ సొంతం. తొలి సినిమా 'మజ్ను'తోనే కుర్రాళ్లకు కుదురులేకుండా .. కునుకుపట్టకుండా చేసేసింది. నానీ జోడీగా పరిచయం కావడం వలన, ఇక ఈ చిన్నది పెద్ద స్టార్ అవుతుందనే అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆమె అడుగులు పవన్ సినిమా వరకూ వెళ్లాయి. 'అజ్ఞాతవాసి' సినిమాతో ఆమె కెరియర్ జోరందుకుంటుందని చెప్పుకున్నారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె ఆశలు ఆవిరయ్యాయి .. ఆమె కలలు కళ్ల నుంచి రాలిపోయాయి.


అరే .. అమ్మాయి చూస్తే అందాల గనిలా ఉంది .. సక్సెస్ లేకపోతే మళ్లీ కనిపించదేమోనని కుర్రాళ్లంతా కంగారు పడ్డారు. వాళ్లు అందించిన క్రేజ్ కారణంగానేమో, 'నా పేరు సూర్య' సినిమాలో అవకాశం వచ్చింది. బన్నీ జోడీకట్టే ఛాన్స్ రావడమంటే మాటలు కాదు. అందుకు ఎన్నో లెక్కలు ఉంటాయి .. వాటిని దాటుకుని ఆమె ఆ ఛాన్స్ సంపాదించుకుంది. దురదృష్టం కొద్దీ ఆ సినిమా కూడా సక్సెస్ కి ముఖం చూపించలేకపోయింది. ఇలా అయితే ఎలా అబ్బా? అని అంతా అనుకుంటున్న సమయంలోనే, చైతూ సరసన 'శైలజా రెడ్డి అల్లుడు' చేసింది. సక్సెస్ ఫార్మూలాకి చెందిన కథ కావడంతో ఆమె అభిమానులంతా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. అది కాస్తా థియేటర్లకి దూరమైపోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.


ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సుందరిని వెతుక్కుంటూ 'అల్లుడు అదుర్స్' .. 'మహా సముద్రం' సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 'అల్లుడు అదుర్స్' విషయానికే వస్తే, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాను రూపొందించాడు. 'సంక్రాంతి' కానుకగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో ఈ అమ్మాయి పాత్ర చాలా కొత్తగా ఉంటుందనీ, యూత్ కి .. మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనీ, అనూ దశ తిరగడం ఖాయమని చెప్పుకుంటున్నారు. అందానికీ .. అభినయానికి, అర్థం .. పరమార్థం దక్కేది సక్సెస్ తోనే కదా!