Begin typing your search above and press return to search.

'శేఖర్'కి అనూప్ సాంగ్ హైలైట్ కానుందా?!

By:  Tupaki Desk   |   6 Jan 2022 8:30 AM GMT
శేఖర్కి అనూప్ సాంగ్ హైలైట్ కానుందా?!
X
అనూప్ రూబెన్స్ ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అయింది. యంగ్ స్టార్ హీరోల సినిమాలతో బిజీగానే ఉంటూ వస్తున్నాడు. సీనియర్ స్టార్ హీరోలలో నాగార్జున ఆయనకు ఎక్కువగా ప్రోత్సహిస్తుంటారు. ఈ సారి ఆయన మరో సీనియర్ స్టార్ హీరో అయిన రాజశేఖర్ తో సినిమా చేస్తున్నాడు. 'శేఖర్' సినిమాకి ఆయనే సంగీత దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. 'బొట్టూ బెట్టి .. కాటుకెట్టి వచ్చిందమ్మా సిన్నది' అంటూ ఈ పాట జానపద బాణీలో నడుస్తోంది. విజయ్ ప్రకాశ్ - రేవంత్ తో కలిసి ఈ పాటను అనూప్ ఆలపించాడు.

ఇంతవరకూ అనూప్ రూబెన్స్ చేసిన ట్యూన్ కి ఇది భిన్నంగా .. కొత్తగా అనిపిస్తోంది .. వినిపిస్తోంది. అనూప్ ఎక్కువగా యూత్ మనసులకు పట్టేసే రొమాంటిక్ ఫీల్ ఉన్న పాటలను చేశాడు. పాట ఏదైనా .. సందర్భాన్ని .. నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బాణీలు కట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. లవర్స్ హృదయం బాగా తెలిసిన సంగీత దర్శకుడిగా ఆయన గురించి చెప్పుకుంటారు. '30 రోజులలో ప్రేమించడం ఎలా?' అనే సినిమాలోని 'నీలి నీలి ఆకాశం' పాటను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ పాట కోసం సినిమాకి వచ్చిన వారు ఎక్కువ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అంతలా ఆ పాట యూత్ ను ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు 'శేఖర్' సినిమా కోసం అనూప్ చేసిన 'లవ్ గంటే మోగిందంట' పాట కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ ఏడాది హిట్ సాంగ్స్ లో ఫస్టు జాయిన్ అయ్యే పాట ఇదేననే అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఈ పాట ఆ రేంజ్ లో దున్నేస్తుందా లేదా అనేది రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. కెరియర్ పరంగా చూసుకుంటే రాజశేఖర్ కి హీరోగా ఇది 91వ సినిమా. ఈ సినిమాకి జీవిత దర్శకత్వం చేస్తున్నారు.

అనూప్ రూబెన్స్ విషయానికి వస్తే చూడటానికి ఆయన చాలా సింపుల్ గా కనిపిస్తుంటాడు. తన సినిమాలకి సంబంధించిన ఈవెంట్స్ లో తప్ప మరెక్కడా ఆయన కనిపించడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో లైవ్ లో సాంగ్స్ ప్లే చేయవలసి ఉంటేనే ఆయన వస్తాడు. ఇక తాను చేసిన పాటలు ఎంతటి హిట్ అయినా వాటి గురించి వరుస ఇంటర్వ్యూల్లో చెప్పే ప్రయత్నం చేయడు. నాలుగు గోడల మధ్య తన పనిని తపస్సులా చేయడానికే ఆయన ఇష్టపడతాడు తప్ప, మీడియా నుంచి ఎక్కువ ఫోకస్ ను కోరుకోడు. తాను కాకుండా తన పాటతో మాట్లాడించడమే ఆయనకి ఇషమేమో!