Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో కెరీర్‌ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందా..?

By:  Tupaki Desk   |   10 April 2022 12:30 AM GMT
అక్కినేని హీరో కెరీర్‌ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందా..?
X
అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోగా 'అఖిల్' సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు అఖిల్. తొలి చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయినప్పటీ.. నిరాశ చెందకుండా సాలిడ్ సక్సెస్ కోసం తీవ్రంగా కష్టపడ్డారు. ఈ క్రమంలో గతేడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. అదే జోరును కొనసాగించేందుకు ఇప్పుడు ''ఏజెంట్‌'' రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

యూత్ కింగ్ అక్కినేని అఖిల్‌ హీరోగా స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ''ఏజెంట్‌''. స్పై థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అఖిల్ ఓ గూఢచారిగా కనిపించనున్నారు. ఇప్పటి వరకు లవర్‌ బాయ్‌ గా కనిపించిన యంగ్ హీరో.. తొలిసారిగా యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనువిందు చేయనున్నారు.

స్పై పాత్రకి తగినట్లుగా అఖిల్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు అంచనాలు పెంచేశాయి. డిఫరెంట్ హెయిర్ స్టైల్ - సిక్స్‌ ప్యాక్‌ బాడీతో అక్కినేని హీరో ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ షాక్ అయ్యారు. ''ఏజెంట్'' మూవీ అఖిల్ కెరీర్‌ ని నెక్స్ట్ లెవెల్‌ కు తీసుకెళ్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.

స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన సినిమాల్లో స్టోరీతో పాటుగా హీరో క్యారెక్టరైజేషన్ మరియు స్టైలింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. ఇప్పుడు ''ఏజెంట్'' సినిమాలో అఖిల్ ను సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారు. 'కిక్' మాదిరిగా ఈ సినిమా పూర్తిగా అఖిల్ క్యారెక్టర్ మరియు యాటిట్యూడ్‌ పై రూపొందించబడిందని ఇన్సైడ్ టాక్.

ఇది వరల్డ్ క్లాస్ రేంజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని నిర్మాత చెబుతున్నారు. అఖిల్ యాక్షన్ & సురేందర్ స్టైల్ కలబోసి ప్రపంచ స్థాయి స్పై సినిమాలతో సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 'ఏజెంట్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారని సమాచారం.

అఖిల్ కటౌట్ - స్క్రీన్ ప్రెజెన్స్ కి సరైన బొమ్మ పడితే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు 'ఏజెంట్' అలాంటి సినిమాయే అవుతుందని ధీమాగా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు. సురేందర్ రెడ్డి - వంశీ కలిసి గతంలో ఆర డజను చిత్రాలకు వర్క్ చేశారు.

హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు.

AK ఎంటర్టైన్మెంట్స్ మరియు సరెండర్2సినిమా బ్యానర్స్ పై సుంకర రామబ్రహ్మం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర - పతి దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరువుకుతోన్న ''ఏజెంట్'' చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయనున్నారు.