Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ అభ్యర్థికి సమంత మద్దతు.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   10 April 2019 11:40 AM IST
ఆ టీడీపీ అభ్యర్థికి సమంత మద్దతు.. ఎందుకంటే?
X
రాజకీయరంగానికి.. సినిమా రంగానికి మధ్యనున్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నా.. మంచి సంబంధాలున్నా.. వాటిని రాజకీయంలోకి కన్వర్ట్ చేసే విషయంలో చాలామంది ప్రముఖులు ఇష్టపడటం లేదు.

మీరంటే నాకు అభిమానమే. కానీ.. ఇప్పుడున్న రాజకీయం వేరు. వ్యక్తిగతంగా నా మద్దతు మీకు ఉంటుందంటూ చెప్పే ప్రముఖులు బోలెడంత మంది ఉన్నారు. అలాంటి ఇబ్బందిని అధిగమిస్తూ.. బాహాటంగా మద్దతు ప్రకటించటం ద్వారా వచ్చి పడే తలనొప్పులకు సిద్ధమై బయటకు రావటం చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సాహసానికే సిద్ధమయ్యారు ప్రముఖసినీ నటి.. అక్కినేని వారింటి కోడలు సమంత.

తాజాగా విడుదల చేసిన ఆడియో టేపులో ఆమె టీడీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. ప్రజలకు సేవ చేసే మంచి గుణం ఉన్న రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ను గెలిపించాలని సమంత కోరుతున్నారు. తాను వ్యక్తిగతంగా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

సత్యప్రసాద్ సోదరి మంజుల తనకు మంచి స్నేహితురాలని.. రేపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన సత్యప్రసాద్ కు ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరుతున్నారు. ఇప్పుడున్న రాజకీయంలో ప్రముఖులు తమ మద్దతును బాహాటంగా వెల్లడించటానికి ఇష్టపడని వేళలో.. సమంత ఆడియో టేపు ద్వారా మెసేజ్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మరి.. సమంత మాటలు అనగాని విజయం మీద ఎంత ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.