Begin typing your search above and press return to search.

అగ్నిప‌థ్ పై రీల్ మేజ‌ర్లు స్పందించ‌రేం?

By:  Tupaki Desk   |   18 Jun 2022 1:30 PM GMT
అగ్నిప‌థ్ పై రీల్ మేజ‌ర్లు స్పందించ‌రేం?
X
కేంద్రం తీసుకొచ్చిన 'అగ్న‌ప‌థ్' పై దేశం ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. నాలుగేళ్ల స్వర్వీస్ కి ఆర్మీ అభ్య‌ర్ధులు స‌సేమీరా అన‌డంతో దేశం ఒక్క‌సారిగా అగ్ని గుండంగా మారింది. అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని అభ్య‌ర్ధులంతా దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌కి దిగారు. అందులోనూ తెలంగాణ రాష్ర్టం సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ ద‌గ్ధం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

కేంద్రం ఒక‌ట‌నుకుంటే..మ‌రొక‌టి జ‌రిగింది. అగ్నిప‌థ్ పై అనుకూలం కంటే వ్య‌తిరేక‌తే వీయ‌డంతోనే స‌న్నివేశం అంత దారుణ‌మైన స్థితిలోకి జారుకుంది. ఈ ఫ‌థ‌కంపై నిపుణులంతా ఎవ‌రి అభిప్రాయాల్ని వాళ్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. మెజార్టీ వ‌ర్గం సైన్యానికి దేశ యువ‌త‌ని దూరం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుంద‌ని అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తు న్నారు.

సామాన్య పౌరుడి ద‌గ్గ‌ర నుంచి నిపుణుల విశ్లేష‌ణ వ‌ర‌కూ ఒకే విధ‌మైన అభిప్రాయం వ్య‌క్త‌మువుతుంది. ప్ర‌భుత్వానికి అనుకూలంగా కొంత మంది అభిప్రాయాలు తెరపైకి వ‌స్తున్న‌ప్ప‌టికీ..వాళ్లంతా పార్టీ అననూయ‌లుగా మారారు అన్న విమ‌ర్శ వినిపిస్తుంది. ఇత‌ర దేశాల త‌రహా డిఫెన్స్ ఫోర్సెస్ సైతం అగ్నిప‌థ్ పై విమ‌ర్శ‌లే గుప్పిస్తున్నాయి.

భార‌త్ ప‌రిస్థితుల్ని విదేశాల‌తో పోల్చుకుంటూ ఆ దేశాల త‌రహాలో భార‌త్ ని వృద్ధిలోకి తీసుకురావాల‌నుకున్న ఆలోచ‌న‌లో రాజ‌కీయం ఉందా? అన్న‌ది మ‌రో వాద‌నగా తెర‌పైకి వ‌స్తుంది. ఇప్పుడిదే దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఇలా ఎవ‌రికి తోచిన అభిప్రాయాలు వాళ్లు పంచుకుంటున్నా రీల్ మేజ‌ర్లు మాత్రం స్పందిచ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మంటూ మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కిస్తున్నాయి.

దేశానికి సేవ‌లందించే క్ర‌మంలో ఎంతో మంది అమ‌రుల‌య్యారు. వాళ్ల జీవిత క‌థ‌ల్ని తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించిన సంద‌ర్భాలున్నాయి. బాలీవుడ్..టాలీవుడ్....కోలీవుడ్..మాలీవుడ్ అంటూ భాష‌తో సంబంధం లేకుండా స్ఫూర్తి ని నింపే ప్ర‌తీ సైనికుడి క‌థ‌ని వెండి తెర‌పైకి తీసుకొచ్చే ప్రయ‌త్నాలు ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతూనే ఉన్నాయి.

ఇటీవ‌లే ముంబై తాజ్ హోటల్ ఉగ్ర దాడుల్లో అమ‌రుడైన సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవిత క‌థ‌ని 'మేజ‌ర్' టైటిల్ తో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు బాలీవుడ్ లో దేశ భ‌క్తి నేప‌థ్యంతో కూడిన సినిమాలు తెర‌పైకి వచ్చాయి. ఆర్మీ..ఎయిర్ ఫో ర్స్..నేవీ రంగాల్లో రాణించిన ఎంతో మంది క‌థ‌ల్ని తెర‌పైకి ఆవిష్క‌రించారు.

వాళ్ల క‌థ‌లపై ఎంతో స్ట‌డీ ..రీసెర్చ్ చేసి వాటికి అద్భుత‌మైన‌ దృశ్య‌రూపం ఇచ్చారు. వాటిలో మంచి..చెడుల్ని సైతం డిస్క‌స్ చేసారు. సినిమా చివ‌ర్లో యువ‌త సైన్యంలో చేరాల‌ని స్ఫూర్తిని సైతం రగిలించే ఉప‌న్యాసాలు అందించారు. మేజ‌ర్ రిలీజ్ అనంత‌రం అడ‌వి శేష్ సైన్యంలో చేరాల‌నుకుంటున్న యువ‌త‌ని మేజ‌ర్ టీమ్ త‌రుపున ప్రోత్సాహిస్తామ‌ని చెప్పారు.

అయితే అప్పుడ‌లా ఉప‌న్యాసాలు ఇచ్చిన రీల్ మేజ‌ర్లు ఎవ‌రూ ఇప్పుడు అగ్నిప‌థ్ పై స్పందిచ‌క‌పోవ‌డం శోచ‌నీయం అంటూ యువ‌త ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంది. కేంద్రం తీసుకొస్తున్న కొత్త ప‌థ‌కంపై త‌మ అభిప్రాయం అనుకూలంగానో..ప్ర‌తికూలంగానో చెప్ప‌డంలో త‌ప్పేముందని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి రీల్ మేజ‌ర్లు..హ‌వాల్దార్లు..సుబేదార్లు ఇప్ప‌టికైనా అగ్నిప‌థ్ పై స్పందిస్తారామో చూద్దాం.