Begin typing your search above and press return to search.

క్వీన్ తో వేగ‌లేకే నిత్యా మాట మార్చిందా?

By:  Tupaki Desk   |   5 Nov 2019 10:08 AM GMT
క్వీన్ తో వేగ‌లేకే నిత్యా మాట మార్చిందా?
X
పురుచ్చిత‌లైవి.. ది గ్రేట్ ఐర‌న్ లేడీ జ‌య‌ల‌లిత 2016 డిసెంబ‌ర్ 5న మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆమె మృతి ప‌ట్ల ఎంతో మంది అనుమానాల్ని వ్య‌క్తం చేశారు. అయితే ఆమె జీవిత క‌థ ఆధారంగా త‌మిళం-తెలుగు- హిందీ భాష‌ల్లో మూడు బ‌యోపిక్ లు తెర‌పైకి వ‌స్తున్నాయి. అందులో ఒక‌టి వెబ్ సిరీస్‌. ర‌మ్య‌కృష్ణ జ‌య‌ల‌లిత పాత్ర‌లో న‌టిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. కాగా రెండు సినిమాలు నిర్మాణ ద‌శ‌లో వున్నాయి.

ఒక‌టి నిత్యామీనన్ న‌టిస్తున్న `ది ఐర‌న్ లేడీ`. మ‌రొటి కంగ‌న ర‌నౌత్ న‌టిస్తున్న `త‌లైవి`. నిత్యా న‌టిస్తున్న‌ `ది ఐర‌న్ లేడీ` చిత్రానికి ప్రియ‌ద‌ర్శిని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు-త‌మిళ‌- హిందీ భాష‌ల్లో రానున్న `త‌లైవి`ని ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా కోసం కంగ‌న భ‌ర‌త‌నాట్యం కూడా నేర్చుకుంటోంది. ప్ర‌త్యేకంగా జ‌య‌ల‌లిత మేనరిజ‌మ్స్.. న‌డిచే తీరు.. హావ భావాల్ని అధ్య‌య‌నంచేస్తున్న కంగ‌న అమ్మ పాత్రని ఓ ఛాలెంజింగ్‌గా తీసుకుని క‌ఠోరంగానే శ్ర‌మిస్తోంది. తాజాగా మ‌నాలి(హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్)లోని సొంత భ‌వంతిలో భ‌ర‌త‌నాట్యం ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది కంగ‌న‌.

ఇదిలా వుంటే జ‌య‌ల‌లిత‌పై నిర్మాణంలో వున్న పోటీ బ‌యోపిక్ ల‌పై ఇటీవ‌ల‌ నిత్యామీన‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. నాకు ఎవ‌రూ పోటీ కాబోరు! అనే అర్థంలో నిత్యా చేసిన వ్యాఖ్య వేడెక్కించింది. అయితే ఇంత‌లోనే నిత్యా మాట మార్చడం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ పాత్ర విష‌యంలో నేను ఎవ‌రితోనూ పోటీప‌డ‌టం లేద‌ని.. ఈ సినిమాని ఈ స‌మ‌యంలోనే పూర్తి చేయాల‌నే నియ‌మ‌నిబంధ‌న‌లేవీ నేను.. ద‌ర్శ‌కురాలు ప్రియ‌ద‌ర్శిని పెట్టుకోలేద‌ని నిత్యా తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. కంగ‌న‌తో పోటీనా ఆ మాట నేను అనలేదే అని అంటోంది. అయితే క్వీన్ నోటి దురుసుకు భ‌య‌ప‌డే ఇలా నిత్యా మాట మార్చిందా? అంటూ గుస‌గుసలు మొద‌లైపోయాయి.