Begin typing your search above and press return to search.

జక్కన్న దృష్టంతా ఇప్పుడు దానిపైనే..!

By:  Tupaki Desk   |   30 Aug 2021 11:00 PM IST
జక్కన్న దృష్టంతా ఇప్పుడు దానిపైనే..!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యావత్ సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే ఈ ఎదురు చూపులు ఇంకొన్నాళ్లు తప్పవని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. RRR చిత్రాన్ని అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చెబుతూ వచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా వాయిదా వేయబడుతుందని అర్థం అవుతోంది.

ఈ నేపథ్యంలో రాజమౌళి అండ్ టీమ్ 'ఆర్ ఆర్ ఆర్' కోసం తదుపరి విడుదల తేదీని లాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం RRR చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 2022 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దీని కోసం జనవరి 7వ తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ట్రిపుల్ ప్రభావం మిగతా సినిమాల విడుదల తేదీలపై పడే అవకాశం ఉంది.

వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న 'భీమ్లా నాయక్' - 13న 'సర్కారు వారి పాట' - 14న 'రాధే శ్యామ్' సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలు ఇప్పుడు జనవరి 7న 'ఆర్ ఆర్ ఆర్' రాకను స్వాగతిస్తాయో లేదో చూడాలి. అప్పుడు2కుదరకపోతే 2022 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి త్వరలోనే ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి. కొంత ప్యాచ్ వర్క్ మినహా ఇప్పటికే RRR చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.

ఇదిలా ఉండగా రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌ లో దర్శనమిచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో కు గెస్ట్ గా దర్శకధీరుడు వెళ్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇందులో రాజమౌళి డ్రెస్సింగ్ అక్కడి సెటప్ అంతా చూసి.. RRR ప్యాచ్ వర్క్ షూటింగ్ లేదా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం అక్కడకు వచ్చి ఉండవచ్చని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం రూపొందుతోంది. ఇందులో రామరాజు గా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. బాలీవుడ్ భామ ఆలియా భట్ సీత పాత్రలో నటిస్తుండగా.. హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. అజయ్ దేవగన్ - శ్రియ - సముద్రఖని వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి స్టోరీ అందించారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాసారు. జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కళ్ళు చెదిరే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.