Begin typing your search above and press return to search.

బుల్లితెర హోస్టింగ్ కి వెంకీ నో చెప్ప‌డానికి కార‌ణం?

By:  Tupaki Desk   |   23 Aug 2021 8:00 AM IST
బుల్లితెర హోస్టింగ్ కి వెంకీ నో చెప్ప‌డానికి కార‌ణం?
X
మెగాస్టార్ చిరంజీవి.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. కింగ్ నాగార్జున‌.. వీరంతా బుల్లితెర హోస్ట్ లుగా ఓ వెలుగు వెలిగారు. టీవీ తెర‌పై క్రేజీ షోల‌కు హోస్టింగ్ చేసి అద‌ర‌గొట్టారు. బ్ర‌హ్మానందం.. అలీ .. సాయికుమార్.. త‌మ‌న్నా.. స‌మంత .. వీరంతా టీవీ హోస్టింగులు చేసిన వారే.

అయితే వీళ్లంద‌రి కంటే ముందు విక్ట‌రీ వెంక‌టేష్ కి బుల్లితెర హోస్టింగ్ చేయ‌మ‌ని ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఆయ‌న అంగీక‌రించ‌లేదు ఎందుక‌నో! వెంకీ నిజానికి హీరోగా ఎప్పుడూ బిజీగానే ఉన్నారు. కేవ‌లం కంటెంట్ ని న‌మ్మి సినిమాలు చేయ‌డం ఆయ‌న శైలి. న‌చ్చ‌ని క‌థ‌ల‌కు ఒకే చెప్ప‌రు. స్క్రిప్ట్ లో కొత్తద‌నం త‌ప్ప‌నిస‌రి. అలా లేన‌ప్పుడు.. విల‌క్ష‌ణ‌మైన‌ క‌థ‌లు ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్ల‌న‌ప్పుడు మాత్ర‌మే వెంకీ గ్యాప్ తీసుకుంటారు. ఇటీవ‌లే మ‌ళ్లీ `నార‌ప్ప‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారు. ముస‌లాయ‌న గెట‌ప్ లో వెంక‌టేష్ న‌ట‌న‌కు క్రిటిక్స్ ప్ర‌శంస‌లు కురిసాయి. సినిమా కోసం ఎంత‌గానో శ్ర‌మించార‌ని ఆ పాత్ర‌ను బ‌ట్టే తెలుస్తోంది. ప్ర‌స్తుతం `దృశ్య-2` రిలీజ్ కి రావాల్సి ఉంది. అలాగే మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు వెంక‌టేష్ చేతిలో ఉన్నాయి. అయితే ఓ సినిమా చేస్తే వ‌చ్చే పారితోషికాన్ని మించి అద‌న‌పు పారితోషికం ఆయ‌న‌కు బుల్లి తెర ఆఫ‌ర్ చేసింద‌ట‌.

వెంక‌టేష్ ని ఎలాగైనా రియాలిటీ షోలు...గేమ్ షోల వైపు తీసుకురావాల‌ని బుల్లి తెర యాజ‌మాన్యాలు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నా ఫ‌లించ‌డం లేదని తెలిసింది. ముందుగా మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు సీజ‌న్ -2కి సంబంధించి హోస్ట్ గా వెంకీనే తీసుకోవాల‌నుకున్నారు. కానీ ఆయ‌న సున్నితంగా ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించారు. అటుపై బిగ్ బాస్ లో ఏదైనా సీజ‌న్ కి హోస్ట్ గా తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు గ‌ట్టిగానే ప్లాన్ చేసారు. కానీ అది వ‌ర్కౌట్ కాలేదు. ఆ అవ‌కాశాన్నికూడా వెంకీ తృణ‌ప్రాయంగా వ‌దులుకున్నారు. ఇటీవ‌లే తెలుగు వెర్ష‌న్ `మాస్ట‌ర్ చెఫ్` హోస్ట్ బాధ్య‌త‌ల్నికూడా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ ముందుగా ఆయ‌న‌కే అప్ప‌చెప్పాల‌ని చూసింద‌న్న విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

కానీ ఆయ‌న అది కూడా వ‌ద్ద‌నుకున్నారుట‌. దీంతో ఆ ఛాన్స్ త‌మ‌న్నాకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. మ‌రి వెంక‌టేష్ ఈ బుల్లి తెర షోల‌ను ఎందుకు వ‌ద్ద‌నుకుంటున్నారు? వెండి తెర‌కు ఉన్న గుర్తింపు బుల్లి తెర‌కు ఉండ‌ద‌న్న కోణంలో వెన‌క‌డుగు వేస్తున్నారా? లేక పారితోషికం న‌చ్చ‌క రిజెక్ట్ చేస్తున్నారా? అంత‌కు మించి కార‌ణాలు ఏమైనా ఉన్నాయా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇటీవ‌లి కాలంలో వెంకీ ఆధ్యాత్మిక చింత‌న‌తో సినిమాల ప‌రంగా కూడా హ‌డావుడి ప‌డ‌టం లేద‌న్న‌ది తెలిసిందే. దానివ‌ల్ల కూడా ఆయన హ‌డావుడి కార్య‌క్ర‌మాల‌కు నో చెబుతున్నారేమో!