Begin typing your search above and press return to search.

సంచలన ప్రెస్ మీట్ వెన్యూ కృష్ణ ఇంటికి ఎందుకు మారింది?

By:  Tupaki Desk   |   26 Jun 2021 11:00 AM IST
సంచలన ప్రెస్ మీట్ వెన్యూ కృష్ణ ఇంటికి ఎందుకు మారింది?
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకాశ్ రాజ్ ప్రకటించటం.. మూడు నాలుగు రోజులకే తన టీంను ప్రకటించటమే కాదు.. శుక్రవారం ఫిలిం చాంబర్లో తన టీంలోని ముఖ్యులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వారి ప్రెస్ మీట్ కు కౌంటర్ ఇచ్చేందుకు ఈ రోజు (శనివారం) ఫిలించాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టనున్నట్లుగా జీవితా రాజశేఖర్ మీడియాకు సమాచారాన్ని ఇచ్చారు. అనూహ్యంగా వెన్యూను ఫిలింనగర్ లోని ఫిలిం చాంబర్ నుంచి సూపర్ స్టార్ కృష్ణ నివాసానికి మార్చటం హాట్ టాపిక్ గా మారింది.

వెన్యూ ఎందుకు మార్చారు? బరిలో ఉంటానని ప్రకటించిన మంచు విష్ణు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు? పోటీ చేస్తానని ప్రకటించిన జీవిత.. ఈసారి కృష్ణ నివాసంలో నరేశ్ తో కలిసి ప్రెస్ మీట్ షేర్ చేసుకోవటం వెనుక ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విష్ణు.. జీవితలకు సంబంధించిన కాంబో ఏదో ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు వీరిద్దరు అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. తాజా ప్రెస్ మీట్ లో అంతకు మించిన కొత్త విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పటివరకు ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఇష్యూలోనూ సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యక్షంగా కలుగజేసుకున్నది లేదు. అందుకు భిన్నంగా ఆయనే నేరుగా రంగంలోకి దిగిన సంకేతాల్ని తాజా ప్రెస్ మీట్ వెన్యూ మార్చటంతో అర్థమవుతుందని చెబుతున్నారు. మొత్తంగా కొత్త సమీకరణాలకు తెర తీసేలా తాజా ప్రెస్ మీట్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రకాశ్ రాజ్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మెగా బ్రదర్ నాగబాబు.. తాజా టీంకు మెగాస్టార్ మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన నేపథ్యంలో.. వారి వైరి టీంగా తెర మీదకు వచ్చిన జీవితకు కృష్ణ మద్దతు నేరుగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి.