Begin typing your search above and press return to search.

బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకు చిరంజీవి ఎందుకు రాలేదంటే..?

By:  Tupaki Desk   |   25 Jan 2022 8:47 AM GMT
బాలయ్య అన్ స్టాపబుల్ షోకు చిరంజీవి ఎందుకు రాలేదంటే..?
X
నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్టుగా వ్యవహరించిన 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షో సూపర్ సక్సెస్ అయిందనే సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సారధ్యంలో నడుస్తున్న 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో వ్యూవర్ షిప్ లో దూసుకుపోతోంది. ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్ సాధించిన టాక్ షోగా.. ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) రేటింగ్స్‌ లో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. సక్సెస్ ఫుల్ గా సాగిన అన్ స్టాపబుల్ సీజన్-1 మరో ఎపిసోడ్ తో ముగియనుంది. అగ్ర కథానాయకుడు మహేష్ బాబు పాల్గొన్న ఫినాలే ఎపిసోడ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రసారం కానుంది.

అయితే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మెగా హీరోలను కాదని నందమూరి బాలయ్యతో 'అన్ స్టాపబుల్' షో చేయడానికి కారణం ఏంటని సినీ అభిమానులు మొదటి నుంచీ ప్రశ్నిస్తున్నారు. అలానే బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా భావించే మెగాస్టార్ చిరంజీవి - నటసింహం బాలకృష్ణ కలిసి సందడి చేస్తారా లేదా? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఇప్పుడు చిరు పాల్గొనకుండానే మొదటి సీజన్ ముగిసింది. దీంతో బాలయ్య షోకు చిరంజీవి గెస్టుగా ఎందుకు హాజరు కాలేదు? 'ఆహా' టీం వీరిద్దరిని ఒకచోట కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేయలేదా? వంటి ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'అన్ స్టాపబుల్' షో క్రియేటివ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి వీటన్నింటికీ సమాధానం చెప్పారు.

బీవీఎస్ రవి మాట్లాడుతూ.. "అన్ స్టాపబుల్ అంటే ఓ రెండు గంటలు షోకి వచ్చి వెళ్లిపోవడం కాదు. అందులోనూ ఇద్దరు స్టార్లు ఎదురెదురుగా కూర్చుని షో చేస్తున్నారంటే అందుకు ప్రిపరేషన్ ఉండాలి. బాలయ్య - చిరంజీవి లతో షో అంటే దానికి ఇంకా చాలా ప్రిపరేషన్ కావాలి. అదంతా మేం స్టార్ట్ చేశాం కూడా. చిరంజీవి గారి ఎంట్రీ కంటే ముందు నుంచే బాలయ్య ఉన్నారు. చిరంజీవితో పోలిస్తే వయసులో బాలయ్య చిన్నవాడు.. సీనియారిటీలో పెద్దవాడు. ఈ మ్యూజిక్ ను రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా జరిగింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రెండో సీజన్ లో ఆ మ్యాజిక్ ఎంత బావుంటుందో చూస్తారు'' అని అన్నారు.

"చిరంజీవి గారిని ఆల్రెడీ అడిగాం. ఈ సీజన్ కు కుదరలేదు. నెక్ట్స్ సీజన్ కు తప్పకుండా వస్తారు. ఆయన బాలయ్య టాక్ షోకు ఇప్పటివరకు రాకపోవడానికి రాజకీయ, సామాజిక కోణాల్లో కారణాలేం లేవు. గాడ్ ఫాదర్ - భోళాశంకర్ - దర్శకుడు బాబీ సినిమా - ఆచార్య డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా మరోవైపు రాజకీయ చదరంగం నడుస్తోంది. ఇంత బిజీగా ఉండడం వల్లనే ఆయన రాలేకపోయారు. ఈసారి తప్పకుండా వస్తారు" అని బీవీఎస్ రవి తెలిపారు.

'అన్‌ స్టాప‌బుల్' చిరంజీవిని కాద‌ని బాల‌య్య‌తో టాక్ షో చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివరిస్తూ... అల్లు అరవింద్ అంటే ఓ కంపౌండ్‌ కు మాత్రమే సొంతమైన వ్యక్తి కాదని.. ఆయన అందరికీ కావలసిన వ్యక్తి అని.. అందరితోనూ బాగుంటారు.. అన్ని పనులు తానే స్వయంగా చూసుకుంటూ ఉంటారని చెప్పుకొచ్చాడు రవి. ఇండస్ట్రీలో ఉన్న అన్ని కుటుంబాలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని.. అక్కినేని కుటుంబంతో కూడా సినిమాలు తెరకెక్కించిన విషయాన్ని గుర్తు చేశారు. నందమూరి ఫ్యామిలీతో అల్లు అరవింద్ కుటుంబానికి 40 ఏళ్లుగా అనుబంధం ఉందని అన్నారు.

బాలయ్య హోస్ట్ గా చేస్తారనే ఆలోచనే విభిన్నంగా ఉంటుందని అల్లు అరవింద్‌ అనుకున్నారని.. వెంటనే బాల‌య్య‌కు చెప్పడం.. ఆయన కూడా ఒప్పుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయని చెప్పారు బీవీఎస్ రవి. చిరంజీవికి ఈ షో మొదలవ్వక ముందే అన్ని విషయాలు తెలుసని.. షో సక్సెస్ అవ్వాలని చిరంజీవి తమను విష్ చేశారని తెలిపారు.