Begin typing your search above and press return to search.

రానా క్రేజ్ ని భీమ్లా మేకర్స్ ఎందుకు యూజ్ చేసుకోవడంలేదు..?

By:  Tupaki Desk   |   19 Feb 2022 3:15 AM GMT
రానా క్రేజ్ ని భీమ్లా మేకర్స్ ఎందుకు యూజ్ చేసుకోవడంలేదు..?
X
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయింది. ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా హిందీలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే హిందీ మార్కెట్ లో ఈ మూవీ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

పవర్ స్టార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ బాలీవుడ్ మార్కెట్ లో మంచి వసూళ్ళు రాబట్టాలంటే.. భారీ ప్రమోషన్లు చేయాల్సి ఉంటుంది. బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలకు నార్త్ లో క్రేజ్ ఉంటుంది కాబట్టి.. ప్రమోషన్లు లేకపోయినా 'పుష్ప' అక్కడ కలెక్షన్స్ సాధించింది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా కాదు.

ఇంతకముందు పవన్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయగా.. అక్కడ కూడా ప్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత మరో చిత్రాన్ని డబ్బింగ్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 'భీమ్లా నాయక్' సినిమాతో మరోసారి బాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటే ఉత్తరాదిలో రానా దగ్గుబాటికి మంచి క్రేజ్ ఉంది. పదకొండేళ్ల క్రితమే 'ధమ్ మారో ధమ్' అని స్ట్రెయిట్ హిందీ సినిమా చేశారు రానా. అప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా బాలీవుడ్ లో నటిస్తూనే ఉన్నారు. 'బాహుబలి' సినిమాల తర్వాత భల్లాల దేవుడు నేషనల్ వైడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడు ''భీమ్లా నాయక్'' సినిమాకు హిందీ మార్కెట్ లో రానా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాకపోతే మేకర్స్ మాత్రం హ్యాండ్సమ్ హంక్ ని మూవీ ప్రచారంలో పెద్దగా యూస్ చేసుకోవడం లేదనిపిస్తోంది. తెలుగులో ఇంతవరకు ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సినిమాగానే ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

'అయ్యప్పనుమ్ కొశీయుమ్' అనే బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ రీమేక్ అయినప్పటికీ.. పవన్ సోలో చిత్రంగానే జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్స్ దగ్గర నుంచి సెన్సార్ కంప్లీట్ అయిందని తెలిపే చిత్రాల వరకూ.. మేకర్స్ అదే ఫాలో అవుతున్నారు. ఇది తెలుగులో భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుందేమో కానీ.. హిందీలో వర్కవుట్ కాకపోవచ్చు.

ఈ విషయంలో మాత్రం రానా క్రేజ్ బాలీవుడ్ లో బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. తెలుగు ప్రమోషనల్ కంటెంట్ లో డేనియల్ శేఖర్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా.. హిందీలో సరిగ్గా వాడుకుంటే బాహుబలి నటుడి వల్లే అక్కడి జనాల దృష్టి ఈ సినిమాపై పడుతుంది. పవన్ కళ్యాణ్ ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటారనేది చెప్పలేం.

ఈ నేపథ్యంలో భీమ్లా మేకర్స్ రానా ను నార్త్ ప్రమోషన్స్ లో భాగం చేసే దిశగా ఆలోచన చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ 'భీమ్లా నాయక్' సినిమా హిందీలో ప్రభావం చూపితే.. పవన్ కళ్యాణ్ రాబోయే పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' చిత్రానికి కూడా ప్లస్ అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.

'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.