Begin typing your search above and press return to search.

రెండు వేరు కదా త్రివిక్రమ్ గారు ?

By:  Tupaki Desk   |   18 Jun 2019 11:09 AM IST
రెండు వేరు కదా త్రివిక్రమ్ గారు ?
X
సినిమాలకు రాజకీయాలకు నేరుగా సంబంధం లేదు కానీ అంతర్గతంగా ప్రభావం ఉంటుందని గతంలోనూ వర్తమానంలోనూ రుజువవుతూనే ఉంది. వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీకి బాబుని టార్గెట్ చేయడం వల్లే ఎక్కువ మైలేజ్ వచ్చిన మాట వాస్తవం. ఎన్టీఆర్ మహానాయకుడులో వాస్తవాలు చూపలేదన్న టాక్ రిజల్ట్ నెగటివ్ గా రావడంలో కీలక పాత్ర పోషించింది. ఇది తెరకు సంబంధించిన వ్యవహారాలు. కానీ బయట కూడా రెండింటికి ముడిపెట్టడం అనేది మాత్రం కొంత రిస్క్ అనిపించే వ్యవహారం.

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న మూవీలో నుంచి పృథ్విని తప్పించారన్న టాక్ ఫిలిం నగర్ లో హాట్ హాట్ గా సాగుతోంది. వైసిపి తరఫున చాలా యాక్టివ్ గా ప్రచారంలో పాల్గొన్న పృథ్వి జగన్ గెలుపు కోసం దేవుడికి తలనీలాలు ఇచ్చి మరీ తన అభిమానం చాటుకున్నాడు. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు చిరు మీద కొన్ని కామెంట్స్ చేశాడు

వీటిని పరిగణనలోకి తీసుకున్న బన్నీ త్రివిక్రమ్ లు పృథ్వికి ఆఫర్ చేసిన కీలకమైన పాత్రను వేరే వాళ్లకు ఇచ్చేసి తనను పంపించేశారని దాని సారాంశం. రాజకీయ పార్టీల పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ సినిమాకు మాత్రం అవి వర్తించవన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రజారాజ్యం స్థాపించినప్పుడు అపోజిషన్ లో ఉన్న బాలయ్యకు చిరుకు మధ్య సంబంధాలు చెడిపోలేదు.

పవన్ అంటే ప్రాణమని చెప్పే అలీ పాలిటిక్స్ వచ్చేటప్పటికి తన బాటను స్పష్టంగా ఎంచుకున్నాడు. ఇది కొంత మనస్పర్ధలకు దారి తీసిన మాట వాస్తవమే కానీ ఇదంతా తాత్కాలికమే అని చెప్పొచ్చు. అలాంటిది రాజకీయ ప్రచారంలో భాగంగా పృథ్వి అన్న మాటలను పట్టుకుని సినిమా నుంచి తప్పించడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అయినా త్రివిక్రమ్ ఈ కోణంలో ఆలోచించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందులో చిరు ప్రమేయం ఉండేందుకు ఛాన్స్ లేదు. పవన్ ప్రోద్బలం అసలే ఉండదు. కాబట్టి సినిమాలో విలువలు బోదించే త్రివిక్రమ్ ఇలా ఓ ఆర్టిస్టును తప్పించడం అంటే ఆలోచించాల్సిన విషయమే