Begin typing your search above and press return to search.

వీళ్లంతా టాలీవుడ్ కి చెందినవారు కాదా...?

By:  Tupaki Desk   |   2 May 2020 11:30 PM GMT
వీళ్లంతా టాలీవుడ్ కి చెందినవారు కాదా...?
X
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ విధించిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. సినిమా షూటింగులు ఆగిపోయాయి. థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతబడిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి లేక జీవనం సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా రోజువారీ కూలీలుగా పనిచేసే సినీ కార్మికుల దుస్థితి మరీ దారుణంగా తయారైందని చెప్పవచ్చు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వీరిది. అలాంటిది కొన్ని రోజుల పాటు ఉపాధి దొరకదని తెలిసి వారు నానా అవస్థలు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.

కరోనా కష్టానికి సినీ కార్మికులను ఆదుకోడానికి టాలీవుడ్ ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ ఛారిటీకి సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ ఎన్ఈ. శంకర్, ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, సి. కళ్యాణ్ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఛారిటీ యొక్క పనితీరు దర్శకుడు మెహర్ రమేష్ చూసుకుంటున్నాడు. ఈ ఛారిటీ ద్వారా సుమారు రెండువేల రెండొందలు విలువ చేసే బియ్యం మరియు 18 రకాల నిత్యావసర సరుకులను ప్రతి కుటుంబానికి నెలవారీగా అందిస్తున్నారు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో హీరోయిన్ల నుండి నిర్మాతల వరకు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు.

కానీ కొందరు సెలబ్రెటీలు మాత్రం సాయం చేయడానికి ముందుకు రాలేదు. విరాళాలు ఇచ్చే స్తోమత లేని వారిని పక్కన పెడితే స్తోమత ఉండి కూడా కరోనా కష్టకాలంలో సహాయం చేయడానికి చేతులు రానివారిని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సీసీసీ తో సంబంధం లేకుండా ఎవరికి వారు సెపరేట్ గా ఛారిటీలు ఏర్పాటు చేసుకొని సహాయం చేస్తున్నారు. దీనికి వారిని అభినందిస్తున్నప్పటికీ ఇండస్ట్రీ పెద్దలు ఏర్పాటు చేసిన ఛారిటీని వదిలేసి వారు వేరే ఛారిటీలు పెట్టడం ఎందుకని.. అదేదో సీసీసీ నుండే సహాయం చేస్తే సరిపోతుందిగా అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్నవారందరూ సీసీసీకి సాయం చేస్తుంటే కొంతమందికి చేతులు రావడం లేదు.. అంటే వీరు ఇండస్ట్రీకి చెందిన వారుగా భావించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సాయం చేసే స్తోమత ఉండి చేయడం లేదంటే వీరు ఇండస్ట్రీకి చెందిన వారుగా అనుకోవడం లేదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాంటి వారిని పక్కన పెడితే ఏదొక విధంగా సాయం చేయడానికి ముందుకొచ్చిన వారిని మనం తప్పకుండా అభినందించి తీరాలి.