Begin typing your search above and press return to search.

అండ్ ద క్రిస్మస్ వీకెండ్ విన్నర్ ఈజ్..

By:  Tupaki Desk   |   26 Dec 2018 1:30 AM GMT
అండ్ ద క్రిస్మస్ వీకెండ్ విన్నర్ ఈజ్..
X
ఈసారి క్రిస్మస్ వీకెండ్లో భారతీయ సినీ ప్రేక్షకుల్ని వినోదంలో ముంచెత్తడానికి చాలా సినిమాలే వచ్చాయి. తెలుగు.. తమిళం.. కన్నడ.. హిందీ ఇలా అన్ని భాషల్లోనూ క్రేజీ సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో చాలా సినిమాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అన్ని సినిమాలూ అంచనాల్ని అందుకోలేకపోయాయి. హిందీలో షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ నటించిన ‘జీరో’ భారీ అంచనాల మధ్య రిలీజైతే.. తెలుగులో ‘పడి పడి లేచె మనసు’.. ‘అంతరిక్షం’ లాంటి ఆసక్తికర చిత్రాలు రేసులో నిలిచాయి. తమిళంలో ‘మారి-2’.. ‘సీతాకత్తి’.. ‘అడంగామరు’.. ‘కనా’ లాంటి క్రేజీ సినిమాలు బరిలో దిగాయి. ఇక కన్నడలో ‘కేజీఎఫ్’ చాలా హైప్ మధ్య విడుదలైంది. ఈ చిత్రం తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లోనూ విడుదల కావడం విశేషం.

ఐతే మొత్తం క్రిస్మస్ సినిమాలన్నింటిలో విజేత ఏది అంటే మాత్రం.. ‘కేజీఎఫ్’ అనే చెప్పాలి. ఈ చిత్రం కేవలం కన్నడలోనే కాదు.. మిగతా భాషల్లోనూ అదరగొడుతోంది. శాండిల్ వుడ్లో అక్కడి సినిమాల వసూళ్ల రికార్డులన్నింటినీ ఈ చిత్రం తిరగరాస్తోంది. వీకెండ్ తర్వాత కూడా హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ‘కేజీఎఫ్’ రికార్డుల్ని ఇప్పుడిప్పుడే ఎవరూ అందుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ స్థాయిలో దూసుకెళ్తోందీ చిత్రం. ఐతే కన్నడలో ఈ చిత్రం అలా ఆడటంలో ఆశ్చర్యం లేదు. కానీ తెలుగులో కన్నడ డబ్బింగ్ చిత్రం రిలీజ్ కావడమే కష్టం అంటే.. ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ తో దూసుకెళ్తోంది.

ఇప్పుడు ‘పడి పడి..’.. ‘అంతరిక్షం’ చిత్రాల కంటే దీనికే ఎక్కువ వసూళ్లు వస్తుండటం షాకింగే. హిందీలో సైతం ఈ చిత్రం ఆధిపత్యం చలాయిస్తోంది. ‘జీరో’ వసూళ్లు అంతకంతకూ పడిపోతుంటే.. ‘కేజీఎఫ్’ అంచనాల్ని మించి వసూళ్లు రాబడుతోంది. హిందీలో ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. తమిళంలో పోటీ మరీ ఎక్కువగా ఉండటం వల్ల వసూళ్లు ఓ మోస్తరుగానే ఉన్నాయి. మొత్తంగా చూస్తే క్రిస్మస్ వీకెండ్ విన్నర్ ‘కేజీఎఫ్’ అనే చెప్పాలి.