Begin typing your search above and press return to search.

#భార‌తీయుడు 2.. కాజల్ స్థానంలో ఎవ‌రు?

By:  Tupaki Desk   |   10 Nov 2021 8:41 AM GMT
#భార‌తీయుడు 2.. కాజల్ స్థానంలో ఎవ‌రు?
X
లైకా సంస్థ‌తో ద‌ర్శ‌కుడు శంక‌ర్ వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తీవ్ర‌మైన కృషి చేసిన సంగ‌తి తెలిసిందే. అది ఫ‌లించినా ఫ‌లించ‌క‌పోయినా.. తాజాగా కోర్టు తీర్పుతో ఈ సినిమాని వెంట‌నే ప్రారంభించే స‌న్నివేశం ఎదురైంది. అదే క్ర‌మంలో క‌మల్.. శంక‌ర్ అన్నిటికీ సిద్ధంగా ఉన్న‌ట్టేనా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మోస్ట్ అవైటెడ్ `ఇండియన్ 2` ప్రారంభమైనప్పటి నుండి అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ సినిమా ఆరంభం నుంచి రకరకాల కష్టాల్లో కూరుకుపోయింది. మ‌ధ్య‌లో దర్శకనిర్మాత‌ల మధ్య న్యాయ వివాదాల కారణంగా ఆగిపోయింది. సెట్లో క్రేన్ యాక్సిడెంట్ లో మ‌ర‌ణాలు క‌ల్లోలానికి కార‌ణ‌మ‌య్యాయి. ఆ తర్వాత కోర్టు గొడ‌వ‌లు తెలిసిందే. ఎట్ట‌కేల‌కు తిరిగి వివాదాల్ని ప‌రిష్క‌రించుకుని సెట్స్ కి వెళ్లే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ సంవత్సరం డిసెంబర్ లో శంకర్ షూట్ ను తిరిగి ప్రారంభిస్తారనేది తాజా సమాచారం. అయితే టీమ్ కు ఊహించ‌ని స‌మ‌స్య ఎదుర‌వుతోంది.

`భార‌తీయుడు 2` వివాదాల్లో న‌లుగుతున్న స‌మ‌యంలోనే ఈ లాక్ డౌన్ ని స‌ద్వినియోగం చేసుకుని కాజ‌ల్ త‌న ప్రియుడు గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కాజ‌ల్ గ‌ర్భ‌వ‌తి. తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. కాజల్ గర్భవతి కాబ‌ట్టి త‌న‌ స్థానంలో మరొక క‌థానాయిక‌ను ఎంపిక చేయ‌నున్నారా? అంటూ చ‌ర్చ సాగుతోంది. అయితే దీనిపై చిత్ర‌బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కాజల్ ర‌క‌ర‌కాల వేష‌ధార‌ణ‌ల‌తో క‌నిపించాల్సి ఉంటుంది. అందులో యువ‌తిగా అలాగే వృద్ధ గెట‌ప్ ని ధ‌రించాల్సి ఉంటుంది.

ఈ క్రేజీ చిత్రంలో కాజల్ తో పాటు సిద్ధార్థ్- రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియా భవానీ శంకర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భార‌తీయుడు 2 అదే పేరుతో 1996లో వచ్చిన చిత్రానికి సీక్వెల్. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.