Begin typing your search above and press return to search.

పుష్ప స్పెష‌ల్ నంబ‌ర్ ఆల‌పించిన గాయ‌ని ఎవ‌రు?

By:  Tupaki Desk   |   11 Dec 2021 10:01 AM IST
పుష్ప స్పెష‌ల్ నంబ‌ర్ ఆల‌పించిన గాయ‌ని ఎవ‌రు?
X
అందాల క‌థానాయిక సమంత రూత్ ప్రభు స్పెష‌ల్ నంబ‌ర్ ఇప్పుడు గూగుల్ లో ట్రెండింగ్ గా మారిన సంగ‌తి తెలిసిందే. పుష్ప చిత్రం నుంచి ఊ అంటావా.. ! అంటూ సాగే ఈ పాట‌లో సామ్ అంద‌చందాలు కుర్ర‌కారును మ‌త్తెక్కించ‌నున్నాయని అర్థ‌మ‌వుతోంది. దానికి మించి ఈ పాట‌ను ఆల‌పించిన వాయిస్ లో పెప్ స్పైసీ నెస్ గురించి యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది.

ఇంత‌కీ ఈ పాట‌ను ఆల‌పించిన‌ది ఎవ‌రు? అంటే... ఇంద్రావ‌తి చౌహాన్. యంగ్ డైన‌మిక్ లేడీ సింగర్ పేరు ఒక్క‌సారిగా మార్మోగుతోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ భామ‌కు అవ‌కాశం క‌ల్పించారు. చంద్ర‌బోస్ ఈ పాట‌కు సాహిత్యం అందించారు.

ఐటెమ్ నంబర్ లో బ‌న్నీతో క‌లిసి స‌మంత స్టెప్పులేయనుండ‌డం మ‌రో పెద్ద విజువ‌ల్ ట్రీట్ కానుంద‌ని యూత్ భావిస్తోంది. ఈ జంట మొదటిసారి ఇలా కనిపించడం చాలా హైప్ ని క్రియేట్ చేస్తోంది. హిందీ- కన్నడ- తమిళం- మలయాళం- తెలుగు భాషల్లో విడుదలైన ఈ పాట‌కు గొప్ప స్పంద‌న ద‌క్కింది. అయితే ఈ స్పెష‌ల్ పాట పాడిన సింగర్ గురించి యూత్ ఎక్కువ‌గా తెలుసుకోవాల‌నుకుంటోంది.

ఊ అంటావా మావా.. ఉహు అంటావా .. అంటూ హ‌స్కీ వాయిస్ తో కిక్కెక్కించిన చౌహాన్ ఫోక్ సింగర్ గా ఇప్ప‌టికే సుప‌రిచితం. ఇంత‌కీ ఎవ‌రీ సింగ‌ర్ అంటే? సినీ నేపథ్య గాయని మంగ్లీ కి చెల్లెలు అని తెలిసింది. ఇప్ప‌టికే ఇంద్రావ‌తి చౌహాన్ కూడా జాన‌ప‌ద పాట‌ల‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇంత‌కుముందు జార్జిరెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాటను కూడా ఆల‌పించారు.

కోటి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన బోల్ బేబి బోల్ షోలోనూ గాయ‌నిగా కొన‌సాగింది. ఇప్పుడు గంట‌ల్లోనే మిలియ‌న్ వ్యూస్ అందుకున్న ఐటం సాంగ్ ని పాడి జ‌నంలోకి మ‌రింతగా దూసుకొచ్చింది. త‌న‌దైన యూనిక్ హ‌స్కీ వాయిస్ తో మునుముందు ఈ వ‌ర్థ‌మాన గాయ‌ని మ‌రింత‌గా మ్యాజిక్ చేయ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.