Begin typing your search above and press return to search.

ఓటీటీ మార్కెట్ లో ఫ‌స్ట్ ప్లేస్ ఆక్ర‌మించింది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   30 July 2022 4:30 AM GMT
ఓటీటీ మార్కెట్ లో ఫ‌స్ట్ ప్లేస్ ఆక్ర‌మించింది ఎవ‌రు?
X
భార‌తీయ ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంలో ఓటీటీ మార్కెట్ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. క‌రోనా పుణ్య‌మా అని ఈ రంగం నూత‌న జ‌వ‌స‌త్వాలని కూడ‌క‌ట్టుకుంది. గ‌తంలో ఓటీటీ ప‌రిశ్ర‌మ ఫారిన్ కంట్రీల‌తో పోలిస్తే మ‌న దేశంలో అంత‌గా విస్త‌రించ‌డం క‌ష్టం అని ప‌లువురు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశారు. కానీ ప‌రిస్థితి క‌రోనా కార‌ణంగా ఒక్క‌సారిగా మారిపోయి ఓటీటీ ప‌రిశ్ర‌మ‌కు అనుకూలంగా మారింది. భార‌త్ లో ఓటీటీ ప‌రిశ్ర‌మ‌లు భారీ స్థాయిలో పుంజు కోవాలంటే నాలుగైదేళ్లు ప‌డుతుంద‌ని భావించారు.

కానీ క‌రోనా కార‌ణంగా అది రెండేళ్ల కాలంలోనే రికార్డు స్తాయికి చేరేలా చేసింది. థియేట‌ర్లు బంద్ కావ‌డం.. బ‌య‌టికి వెళ్ల‌లేని ప‌రిస్థితులు త‌లెత్త‌డంతో జ‌నం పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ఓటీటీల‌కు మెల్ల‌మెల్ల‌గా అల‌వాటు ప‌డ‌టం మొద‌లు పెట్టారు. దీంతో ఓటీటీలు త‌మ మార్కెట్ ని క్ర‌మ క్ర‌మంగా పెంచుకుంటూ వ‌చ్చాయి. 2020లో 3 బిలియ‌న్ ల ప‌రిధికి వీటి ఆద‌యం చేర‌నున్న‌ట్టుగా తాజా గ‌ణంకాలు చెబుతున్నాయి.

తాజా నివేదిక‌ల ప్ర‌కారం 2027 నాటికి దాదాపుగా 7 బిలియ‌న్ ల‌కు ఈ మార్కెట్ లాభాలు పెరిగే అవ‌కాశం వుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దేశంలో వున్న ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఏ స్థానాల్లో వున్నాయి. గ‌తంతో పోలిస్తే ఏ స్థాయిలో వినియోగ‌దారులను క‌లిగి వున్నాయి. ఇంత‌కీ దేశ వ్యాప్తంగా ఓటీటీల‌కు అడిక్ట్ అయిన వారి సంఖ్య ఎంత‌? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. దేశంలో వెలుగులోకి వ‌చ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్ ఇండియా, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలీవ్‌, జీ5, వూట్‌, ఆల్ట్ బాలాజీ, బిగ్ ఫ్లిక్స్‌, ఉల్లూ యాప్‌, స‌న్ నెక్స్ట్ వంటి వి వున్నాయి.

వీటిలో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ అగ్ర స్థానంలో నిలిచింది. దేశీయంగా ఓటీటీ వియోగ‌దారులు 45 కోట్ల కంటే ఎక్కువే వుండ‌గా ఇందులో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ 14 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగ‌దారుల‌ని క‌లిగి ప్ర‌ధమ స్థానంలో నిలిచింది. ఇక 6 కోట్ల మంది వినియోగ‌దారుల‌తో అమెజాన్ ప్రైమ్ రెండ‌వ స్థానంలో నిలిచింది. ఇక నెట్ ఫ్లిక్స్ 4 కోట్ల తో మూడ‌వ స్థానాన్ని ద‌క్కించుకుంది. 3.7 కోట్ల వినియోగ దారుల‌తో జీ5, 2.5 కోట్ల మంది స‌బ్స్‌స్క్రైబ‌ర్ల‌తో సోనీ లీవ్ నిలిచాయి.

ఇక ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ 1.7 కోట్ల మంది వినియోగ‌దారుల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింది. అమెజాన్ 99 ల‌క్ష‌ల మందితో రెండ‌వ స్థానంలో నిల‌వ‌గా, 48 ల‌క్ష‌ల‌తో జీ5, 42 ల‌క్ష‌ల వినియోగ‌దారుల‌తో ఆహా త‌రువాతి స్థానాల్లో నిలిచాయి. ఇక్క‌డో ఆశ్చ‌ర్య‌క‌ర‌బైన విష‌యం ఏంటంటే వ‌ర‌ల్డ్  వైడ్ గా నంబ‌ర్ వ‌న్ స్థానంలో వున్న నెట్ ఫ్లిక్స్ ఇండియాలో మాత్రం 40 ల‌క్ష‌ల వినియోగ‌దారుల‌తో ఫిఫ్త్ ప్లేస్ తో స‌రిపెట్టుకుంటోంది.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఇండియాలో ఫ‌స్ట్ ప్లేస్ లో నిల‌వ‌డానికి గల కార‌ణం ఐపీఎల్ మ్యాచ్ ల ప్ర‌త్య‌క్ష‌ స్ట్రీమింగ్ ని సొంతం చేసుకోవ‌డం. దీని కార‌ణంగానే డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కు రికార్డు స్థాయి వినియోగ‌దారులు యాడ‌య్యారు. అయితే తాజాగా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హ‌క్కుల్ని వ‌యాకామ్ డిజిట‌ల్   20,500 కోట్ల‌కు సొంతం చేసుకుంది. దీని కార‌ణంగా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ని కోట్ల‌ల్లో వినియోగ‌దారులు వీడే ప్ర‌మాదం వుందని, 15 నుంచి 20 మిలియ‌న్ ల మంది డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వీడ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మ‌రి ఈ ఉప‌ద్ర‌వం నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో.. ఎలా త‌న నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని నిల‌బెట్టుకుందో వేచి చూడాల్సిందే.