Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ 5' కు హోస్ట్ ఎవరు..??

By:  Tupaki Desk   |   7 July 2021 3:30 PM GMT
బిగ్ బాస్ 5 కు హోస్ట్ ఎవరు..??
X
తెలుగు బుల్లితెర పై ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న 'బిగ్‌ బాస్‌' రియాలిటీ షో.. ఇప్పుడు ఐదో సీజన్‌ లోకి అడుగుపెట్టబోతుంది. 'స్టార్ మా' వాళ్ళు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారని తెలుస్తోంది. నాలుగు సీజన్లు సక్సెస్ అవడానికి బిగ్ బాస్ నిర్వాహకులతో పాటుగా షోని ఆసక్తికరంగా నడిపించిన హోస్టులు కూడా కారణమని చెప్పవచ్చు. ఫస్ట్ సీజన్‌ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తనదైన శైలిలో ఎంటర్టైన్ చేసి 'బిగ్ బాస్‌' ను తెలుగు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగలిగాడు.

'బిగ్ బాస్ 2' తెలుగుకు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించి ఈ రియాలిటీ షో ని ముందుకు తీసుకెళ్లారు. మూడో సీజన్ కి 'కింగ్' అక్కినేని నాగార్జున హోస్ట్ చేసి అలరించారు. అప్పటికే ఈ షో ప్రేక్షకాదరణ తెచ్చుకోవడంతో.. తెలుగు 'బిగ్ బాస్ 3' మంచి టీఆర్పీతో నడిచింది. అప్పటికి బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ సాధించిన రియాలిటీ షో గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్' 4వ సీజన్ కి నాగార్జుననే హోస్ట్ గా కంటిన్యూ చేశారు.

నాల్గవ సీజన్ ను కూడా నాగ్ హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా కొనసాగించగలిగారు. టెలివిజన్ స్క్రీన్ పై 'బిగ్ బాస్ 4' సంచలనాలు సృష్టించిందనే చెప్పాలి. దీంతో 'బిగ్ బాస్ 5' కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కంటెస్టెంట్స్ ఎవరొచ్చినా 'బిగ్ బాస్' కు హోస్ట్ మాత్రం నాగ్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సీజన్ నుంచి నాగార్జున తప్పుకున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు సినిమా చేస్తున్న నాగ్.. త్వరలోనే 'బంగార్రాజు' సినిమాని ప్రారంభించాలని చేస్తున్నారు. దీంతో పాటుగా తనయుడు అఖిల్ తో ఓ మల్టీస్టారర్ కథను రెడీ చేయించే పనిలో ఉన్నారు. వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టడంతో 'కింగ్' 5వ సీజన్ కోసం డేట్స్ కేటాయించడం కష్టంగా మారిపోయిందట. అందుకే ఈ ఒక్క సీజన్‌ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో దగ్గుబాటి రానా పేరుని నిర్వాహకులకు సూచించారని అంటున్నారు.

హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి కి టీవీ హోస్టుగా చేసిన అనుభవం ఉంది. అందుకే నాగ్ సలహా మేరకు రానా అయితే 'బిగ్ బాస్-5' తెలుగును బాగా లీడ్ చేయగలడని నిర్వాహకులు భావిస్తున్నారట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలానే హోస్టుగా ఐదో సీజన్ కు ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందనే విషయంపై చర్చలు జరుగుతోంది. మరి త్వరలోనే 'బిగ్ బాస్ 5' హోస్ట్ ఎవరనేది నిర్వాహకులు అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

ఇదిలా ఉంటే 'బిగ్‌ బాస్' తెలుగు రియాలిటీ షోకు అటు ప్రేక్షకుల్లో ఇటు సెలబ్రిటీస్ లోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే 'బిగ్ బాస్ 5' కోసం కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. జూలై నెలలోనే ఈ షో స్టార్ట్ అవుతుందని ఇప్పటి వరకు ప్రచారం జరిగినా.. ఆగస్ట్ నెలాఖరున షో ను ప్రారంభించాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తెలుగు 'బిగ్ బాస్-1' లో హీరో శివ బాలాజీ విన్నర్ గా నిలిచారు. రెండో సీజన్ లో యాక్టర్ కౌశల్ మండా.. 'బిగ్ బాస్ 3' లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుపొందారు. నాల్గవ సీజన్ లో యువ హీరో అభిజిత్ 'బిగ్ బాస్' టైటిల్ అందుకున్నాడు.