Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ.. రానిదెవరో

By:  Tupaki Desk   |   26 Jan 2018 12:03 PM IST
ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ.. రానిదెవరో
X
నాగశౌర్య మూవీ చలో ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ ఓ ఆసక్తికరమైన వార్త చెప్పారు. కుర్రాళ్లను ప్రోత్సహించేందుకే వచ్చానని.. తన కెరీర్ ప్రారంభంలో ఓ శతదినోత్సవానికి స్టార్ హీరోని పిలిస్తే ఆయన రాలేదని అన్నారు. ఇంతకీ అప్పుడు రాని ఆ స్టార్ హీరో ఎవరు అనేదే ఆసక్తికరమైన విషయం.

చిరంజీవికి తొలి శత దినోత్సవ చిత్రం అంటే.. ఇది కథ కాదు మూవీ సక్సెస్ సాధించినా.. అందులో చిరు విలన్. ఈయనకు లభించిన మొదటి సాలిడ్ హిట్ గా పున్నమి నాగు చిత్రాన్ని చెప్పుకోవచ్చు. అందులో నరసింహరాజు హీరో అయినా.. లీడ్ రోల్ చిరంజీవిదే. బహుశా చిరంజీవి ఈ సినిమా గురించే చెప్పి ఉంటారని అంతా అనుకుంటున్నారు. అయితే.. ఆ సమయంలో అంటే 1980ల నాటి కాలంలో పెద్ద స్టార్ అంటే.. ఎన్టీఆర్.. ఏఎన్నాఆర్ లతో పాటు కృష్ణ.. శోభన్ బాబు వంటి హీరోలను చెప్పుకోవచ్చు. మరి వీరిలో ఎవరిని పిలిచి ఉంటారో అని పరిశీలిస్తే.. నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ కు అక్కినేని నాగేశ్వరరావు.. ఎస్వీ రంగారావు సన్నిహితంగా ఉండేవారు. వీరిద్దరిలో ఎవరైనా అయి ఉండవచ్చని అనుకుంటున్నారు.

మరోవైపు బాగా బిజీగా ఉండడంతో ఆ స్టార్ హీరో రాలేదు అని చిరంజీవి చెప్పారు. ఆ సమయంలో అత్యంత బిజీ హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ. ఏడాదికి కనీసం 10-12 సినిమాలు చొప్పున చేసేసేవారాయన. ఆయన ఎదుగుదల కూడా సినీరంగంలో చాలామందికి స్ఫూర్తి. అయినా సరే బిజీ సమయంలో అడగడంతోనే.. కృష్ణ రాలేకపోయి ఉంటారని అంటున్నారు.

అప్పటి స్టార్ లలో ఇప్పుడు కొంత మంది లేరు.. మరికొందరు కురువృద్ధులు అయిపోయి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పజిల్ ని వారు చెప్పరు.. చిరు విప్పరు. సో.. ఆ సస్పెన్స్ అలా కంటిన్యూ అవాల్సిందే.