Begin typing your search above and press return to search.

'అన్ స్టాపబుల్' సీజన్ 2లో మెరిసే స్టార్స్ వీరే!

By:  Tupaki Desk   |   30 April 2022 1:30 AM GMT
అన్ స్టాపబుల్ సీజన్ 2లో మెరిసే స్టార్స్ వీరే!
X
మొదటి నుంచి కూడా బాలకృష్ణ రూట్ వేరు. ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఆయన వెనకడుగు మాత్రం వేయరు. తనకి అలవాటు లేని పనంటూ పక్కకి తప్పుకోరు. చిరంజీవి .. నాగార్జునలకు ఇంతకుముందు హోస్టుగా చేసిన అనుభవం ఉంది. బాలకృష్ణ అలాంటి కార్యక్రమాలు చేయలేదు .. ఆ దిశగా ఆయన దృష్టి పెట్టింది లేదు. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తారని కూడా ఎవరూ అనుకోలేదు. అలాంటి సమయంలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' అంటూ 'ఆహా' ఓటీటీ వారు ఒక టాక్ షోకు తెరలేపారు.

టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతలలో అల్లు అరవింద్ గారు ఒకరుగా కొనసాగుతున్నారు. ఆయనకి గల పేరు ప్రతిష్ఠలను గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన పనిలేదు. ఎంతటి స్టార్ డమ్ ఉన్న హీరోలైనా .. ఎంత బిజీగా ఉండే హీరోలైనా ఆయన పిలిస్తే కాదనరు. అందువలన ఈ షో స్టార్ హీరోలతో కళకళలాడిపోయింది. మోహన్ బాబు గెస్టుగా మొదలైన ఈ టాక్ షో మహేశ్ బాబుతో ముగిసింది. మధ్యలో రాజమౌళి .. సుకుమార్ .. బోయపాటి వంటి దర్శకులు కూడా ఈ టాక్ షోలో సందడి చేశారు.

చూస్తుండగానే ఈ టాక్ షో కోసం వెయిట్ చేసే వీక్షకుల సంఖ్య పెరుగుపోతూ వచ్చింది. ఎందుకంటే ఒక ఎపిసోడ్ కి మించి మరో ఎపిసోడ్ ఉండేలా చూసుకుంటూ వెళ్లారు. ఏ టీవీ షోలోను ఎవరూ బయటికి చెప్పని విషయాలు ఈ వేడుక ద్వారా వీక్షకులకు తెలిశాయి. బాలయ్య ముక్కుసూటితనం ఈ షోకి మైనస్ అవుతుందని అంతా అనుకున్నారు.

కానీ ఆశ్చర్యంగా అదే ప్లస్ అవుతూ వచ్చింది. ఈ కారణంగానే ఆదరణ పెరిగిపోతూ వచ్చింది. దేశంలోని టాక్ షోలలో నెంబర్ వన్ గా నిలిచింది. బాలయ్య హోస్ట్ చేయగలరా? అనుకున్న వాళ్లంతా ఆ షోకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయారు.

అలాంటి ఈ టాక్ షో .. సీజన్ 2కి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఫస్టు సీజన్ కి మించి .. సీజన్ 2 ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. సీజన్ 2 రెడీ అవుతుందట అనే టాక్ బయటికి రాగానే ఈ సీజన్ లో ఏ స్టార్ హీరోలు హాజరు కానున్నారు? అనే కుతూహలం అందరిలో పెరిగిపోవడం సహజం.

ఇంతవరకూ అయితే చిరంజీవి .. వెంకటేశ్ .. ప్రభాస్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో మిగతా స్టార్స్ వివరాలు తెలిసే అవకాశం ఉంది. కొత్తదనం పేరుతో సీజన్ 2లో ఏయే అంశాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి!