Begin typing your search above and press return to search.

ఇంత‌కీ బ‌న్ని స్మ‌గ్ల‌రా? పోలీసా సుక్కూ?

By:  Tupaki Desk   |   2 Aug 2019 10:27 AM IST
ఇంత‌కీ బ‌న్ని స్మ‌గ్ల‌రా? పోలీసా సుక్కూ?
X
న‌క్స‌లైట్లు తిరిగే చోట ద‌ర్శ‌కుడు కూంబింగ్ కి వెళ్ల‌డ‌మేంటి? మ‌రీ చాద‌స్తం కాక‌పోతేనూ.. అది కూడా పోలీసుల‌తో క‌లిసి.. కాస్త వింతే అయినా ఇలాంటి వింతాట‌లు సాహ‌సాలు ఆయ‌న‌కు కొత్తేమీ కాదు. ప‌ల్లెటూరికి వెళితే అక్క‌డ ఎంకి రూపం ఎలా ఉంటుందో.. నాయుడు మామ వెట‌కారం ఎలా ఉంటుందో కూడా ఇట్టే ప‌సిగట్ట‌గ‌ల‌డు. ఎంకి రూపం.. ఆ చీర‌క‌ట్టు.. ప‌విట స‌రిచేసుకునే విధానం.. చెవిటి కుర్రాడి పాట్లు.. ప‌క్కా ప‌ల్లెటూరి మాస్ కుర్రాడి ఆహార్యం.. ఆడి స్నేహితుల య‌వ్వారం.. ప్ర‌తిదీ ఎలా ఉంటుందో ఇట్టే క‌నిపెట్టేస్తాడు. అవ‌సరం అనుకుంటే ఆ రూపాన్ని రంగ‌మ్మ‌త్త‌గానో సిట్టిబాబులాగానో మార్చుకుని త‌న సినిమాల‌కు వాడుకుంటాడు. ప్రతి మ‌ట్టి మ‌నిషి జీవితంలోని ఎమోష‌న్ ని ఇట్టే ప‌ట్టేసుకుంటాడు.

ప‌ల్లెటూళ్లు .. మ‌ట్టి వాస‌న తెలిసిన వాడిగా అత‌డు అలాంటి క‌థ‌ల్ని ఎంచుకుని మ్యాజిక్ చేయ‌గ‌ల‌డ‌ని నిరూప‌ణ అయ్యింది. ప‌ట్నాల‌కు దూరంగా విసిరేసిన ఊళ్ల‌లోకి వెళితే.. గోదారి నేల‌లో అడుగు పెడితే.. గ‌ల్లీలో గోళీలు ఆడుకునే రోజుల్ని గుర్తు చేసుకుంటాడు. ప‌లుగు పార ప‌ట్టి పొలంలో పంట కాలువ త‌వ్విన వైనాన్ని గుర్తు చేసుకుంటాడు. మిర‌ప‌తోట కాడ రంగ‌మ్మ‌త్త‌తో య‌వ్వారాన్ని అనుభ‌వించి ఫల‌వ‌రిస్తాడు. కొబ్బ‌రాకుల స్నానాల గ‌దిలో కొంటె కోనంగి తో మోటు స‌రసం ఆడ‌గ‌ల‌డు. అందుకే అత‌డు తెర‌కెక్కించిన `రంగ‌స్థ‌లం` చిత్రంలో అలాంటివి కూడా ఎంతో అందంగా క‌నిపిస్తాయి. నేటివిటీ క‌థ‌ల్ని చూపించాల‌ని నేటివిటీ యాస‌ను వినిపించాలని సుకుమార్ త‌పించిన తీరు రంగ‌స్థ‌లంలో క‌నిపించింది. ఎన్ని ప‌ట్నం క‌థ‌లు, క్యారెక్ట‌ర్ల‌తో సినిమాలు తీసినా ప‌ల్లెటూరి నేటివిటీ సినిమా తీస్తే ఎలా ఉంటుందో రుచి చూశాడు.

అందుకే ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. అయితే ఈసారి అత‌డు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ ఇంకాస్త రా అండ్ ర‌గ్గ్ డ్ కంటెంట్ తో ఉంటుందిట‌. అది కూడా అడ‌వులు .. కొండ‌లు కోన‌లు.. గుట్టలు .. అక్క‌డ తిరిగే న‌క్స‌లైట్లు.. అడ‌వుల్లో కొండ‌ల్లో కోన‌ల్లోని ప‌ల్లెల్లో మ‌ట్టి మ‌నుషుల క‌థ‌ని ఈసారి ట‌చ్ చేస్తున్నాడు. ఎర్ర‌చంద‌నం త‌ర‌లించ‌డం ప్ర‌భుత్వం దృష్టిలో నేరం. అయితే ఉపాధి కోసం వెళ్లే కూలీలు నేరం చేసిన‌ట్టా కాదా? స్మ‌గ్ల‌ర్ అని పోలీసులు- ప్ర‌భుత్వాధినేత‌లు నింద‌లు వేసి అరెస్టులు చేసి.. వెంటాడి వేటాడి హ‌త‌మార్చి చాలానే నాట‌కాలు ఆడ‌తారు. స్మ‌గ్ల‌ర్ల విష‌యంలో సింప‌థీ కాదు కానీ.. అస‌లు ఉపాధి లేక ఆ మురికిలో అడుగు పెట్టేవాళ్ల క‌థ‌లు కూడా ఉంటాయి క‌దా? మ‌రి సుకుమార్ వేటిని ఎంచుకున్నాడో కానీ అత‌డు చిత్తూరు-క‌డ‌ప ఏరియాల్లో అడ‌వుల్ని జ‌ల్లెడ ప‌ట్టాడ‌ని.. అందుకోసం ఏకంగా పోలీసుల‌తో క‌లిసి అడ‌వుల్లో కూంబింగుకే వెళ్లాడ‌ని ప్ర‌చారం అవుతోంది. చిత్తూరు రాయ‌ల‌సీమ యాస‌లో త‌దుప‌రి చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్నాడు. స్క్రిప్టు రెడీ చేసి డైలాగులు రాశాడు. వాటిని చిత్తూరు- సీమ యాస‌లోకి మార్చాల్సిందిగా రైట‌ర్ల‌ను కోరాడ‌ట‌. మొత్తానికి ఈసారి కూడా భారీ ప్ర‌య‌త్న‌మే. రంగ‌స్థ‌లాన్ని మించి రికార్డుల్ని కొట్టే తాప‌త్ర‌య‌మే కాబోలు. అప్పుడు సిట్టిబాబుగా చ‌ర‌ణ్ చేసిన మ్యాజిక్ చిర‌స్థాయిగా టాలీవుడ్ హిస్ట‌రిలో నిలిచిపోయింది. ఇప్పుడు బ‌న్నిని ఇంకెంత కొత్త‌గా చూపించ‌బోతున్నాడో చూడాలి. అన్న‌ట్టు ఎర్ర‌చంద‌నం దుంగ‌ల స్మ‌గ్ల‌ర్ల క‌థ‌లో బ‌న్ని పాత్ర ఏంటి? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ఇంత‌కీ బ‌న్ని స్మ‌గ్ల‌రా? పోలీసా? ఈ సినిమా సెప్టెంబ‌ర్ చివ‌రిలో ప్రారంభం అవుతుంద‌ని వార్త‌లు వ‌చ్చినా మైత్రి వాళ్లు న‌వంబ‌ర్ లో ప్రారంభిస్తామ‌ని చెబుతున్నారు.