Begin typing your search above and press return to search.

భ‌ర్త బోనీ‌తో 8నెల‌లు శ్రీ‌దేవి మాట్లాడ‌లేదా?

By:  Tupaki Desk   |   13 Jun 2020 6:30 AM GMT
భ‌ర్త బోనీ‌తో 8నెల‌లు శ్రీ‌దేవి మాట్లాడ‌లేదా?
X
అతిలోక సుంద‌రి శ్రీదేవి.. స్టార్ ప్రొడ్యూస‌ర్ బోనీ కపూర్ లవ్ స్టోరీ అందరికీ తెలిసిన‌దే. బోనీ ప్ర‌పోజ్ చేసిన స‌మ‌యంలో శ్రీ‌దేవి ఎంతో క‌ల‌త‌కు గురయ్యారు. ఆ త‌ర్వాత వ‌రుస ఘ‌ట‌న‌లు తెలిసిన‌దే. ఆ జంట పెళ్లి బోనీ మొద‌టి భార్య‌లో ఆమె కుమారుడు అర్జున్ క‌పూర్ లో కోపం నింపింది. ఆ కోపం క‌క్ష‌గా మారింద‌ని బాలీవుడ్ లో క‌థ‌నాలొచ్చాయి. ఇక రెండేళ్ల క్రితం దుబాయ్ లో శ్రీ‌దేవి మిస్టీరియ‌స్ డెత్ గురించి విధిత‌మే. అయితే శ్రీదేవి బోనీ కపూర్‌తో ఎనిమిది నెలల పాటు మాట్లాడలేదు! అన్న‌ది ఓ క‌థ‌నం. దానికి కార‌ణ‌మేమిటి? అన్న‌ది తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌క‌ర‌మే.

శ్రీదేవి - బోనీ కపూర్ సుదీర్ఘ‌ ప్రేమాయ‌ణం.. అటుపై వివాహం.. కెరీర్ జ‌ర్నీ.. ఇవ‌న్నీ ఒక చలనచిత్ర కథ కంటే తక్కువేమీ కాదు! 2018 లో శ్రీ‌దేవి మరణించిన తరువాత బోనీ క‌పూర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బోనీ ప‌లుమార్లు శ్రీదేవితో తన అపురూప‌ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ జంట‌ ఎట‌ర్న‌ల్ ప్రేమకథకు సంబంధించిన వాస్తవం తెలిసింది త‌క్కువే. బాలీవుడ్ లో `మిస్టర్ ఇండియా` సినిమా తీసేప్పుడు బోనీ .. శ్రీదేవికి ప్ర‌పోజ్ చేశారు. ఆ ప్ర‌పోజల్ తో శ్రీ‌దేవి తీవ్రంగా కలత చెందార‌ట‌.

ఎందుకంటే.. బోనీ త‌న‌తో ప్రేమలో పడే స‌మ‌యానికే అత‌డు వివాహితుడు. శ్రీదేవిని చాలా కాలం ప్రేమించాడు. కానీ మొదట్లో అది ఏకపక్ష ప్రేమ. ఒకసారి శ్రీదేవి ఆమె తల్లి బోనీ కపూర్ .. అతని స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళవలసి ఉంది. అయితే, తన తల్లి అకస్మాత్తుగా అనారోగ్యానికి గుర‌వ్వ‌డంతో శ్రీ‌దేవి ఒంటరిగా ఆ విహారానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ క్ర‌మంలోనే టూర్ ముగించాక‌ శ్రీదేవిని తన నివాసంలో దించేందుకు వచ్చినప్పుడు బోనీ ఆమెకు ప్రతిపాదించాడు.

అయితే అత‌డి ప్ర‌పోజ‌ల్ కి శ్రీ‌దేవి అమ్మ గారు స‌సేమిరా అన్నారు. శ్రీ‌దేవి త‌న అభిప్రాయాన్ని అదేవిధంగా వ్య‌క్త‌ప‌రిచారు. అంతే కాదు తీవ్ర మ‌న‌స్థాపంతో దాదాపు ఎనిమిది నెలలు అతనితో మాట్లాడలేదుట‌. మనందరికీ తెలిసినట్లుగా.. చివరకు బోనీ కపూర్‌తో ముడిపడి, చివరి శ్వాస వరకు ఆయ‌న‌ను విడిచి ఉండ‌నేలేదు. శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24 న దుబాయ్‌లో కన్నుమూశారు. ఆమె ఆకస్మిక మరణం సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ బాధపెట్టింది. ముఖ్యంగా అభిమానులు న‌మ్మ‌లేక‌పోయారు. ఇప్ప‌టికి శ్రీ‌దేవి దుర్మ‌ర‌ణాన్ని అనుమానాస్ప‌ద మృతిగానే భావిస్తారు.