Begin typing your search above and press return to search.

నిఖిల్ '18 పేజెస్‌'కి మోక్షం ఎప్పుడో?

By:  Tupaki Desk   |   11 Jun 2022 1:30 PM GMT
నిఖిల్ 18 పేజెస్‌కి మోక్షం ఎప్పుడో?
X
ప‌రిస్థితులు అనుకూలంగా వున్నా కొన్ని సినిమాల‌కు మాత్రం ఇంకా ప్ర‌తికూల వాతావ‌ర‌ణ‌మే ఎదుర‌వుతూ వుంటుంది. భారీ స్టార్ కాస్టింగ్ వున్న సినిమాల నుంచి పేరు లేని హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నా స‌రే కొన్నింటికి మాత్రం ఇంకా కాలం క‌లిసి రాదు. దీంతో అవి ఎప్పుడు బ‌య‌టికి వ‌స్తాయో తెలియ‌ని అయోమ‌య స్థితి ప్రేక్ష‌కుల్లో.. ఆ సినిమాలో న‌టించిన హీరో అభిమానుల్లోనూ నెల‌కొంటుంది. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి '18 పేజెస్‌' సినిమా విష‌యంలోనూ ఎదుర‌వుతోందా? అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి.

నిఖిల్ హీరోగా న‌టించిన చిత్రం '18 పేజెస్‌'. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌థ అందించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మించారు. 'కుమారి 21 ఎఫ్‌' ఫేమ్, సుకుమార్ శిష్యుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన ఈ మూవీ ఎంత‌కూ బ‌య‌టికి రావ‌డం లేదు. క‌రోనా త‌గ్గి పెద్ద చిత్రాలు.. మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్నా ఈ మూవీ మాత్రం రిలీజ్ కు నోచుకోవ‌డం లేదు.

షూటింగ్ పూర్త‌యి రిలీజ్ కి రెడీగా వున్నా ఈ మూవీ రిలీజ్ పై మేక‌ర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ బ‌య‌టికి రావ‌డం లేదు. ఈ మూవీ కంటే ఆల‌స్యంగా మొద‌లైన 'కార్తికేయ 2' జూలైలో రిలీజ్ కి రెడీ అయిపోతోంది. ఇప్ప‌టికే టీజ‌ర్ ని కూడా విడుద‌ల చేశారు. కీల‌క పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేస్తూ తాజాగా ఓ మోష‌న్ వీడియోని కూడా విడుద‌ల చేశారు. హీరోగా త‌న‌కు పేరు తెచ్చిన సినిమా కావ‌డంతో 'కార్తికేయ‌2' పై హీరో నిఖిల్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ తొలిసారి న‌టించిన తెలుగు సినిమా ఇది. అంతే కాకుండా ద్వార‌క నేప‌థ్యంలో కృష్ణుడి ర‌హ‌స్యాన్ని చేధించే క‌థ‌గా ఈమూవీని రూపొందించ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి.

పైగా ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ కార‌ణంగా నిఖిల్ ఈ మూవీపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌ని చూపిస్తున్నారు. నిఖిల్ న‌టించిన సినిమాకు ఇంత జ‌రుగుతున్నా అత‌నితో నిర్మించిన '18 పేజెస్‌' గురించి మాత్రం గీతార్ట్స్ 2 నుంచి ఎలాంటి అప్ డేట్ లేక‌పోవ‌డం ప‌లువురిని విస్మ‌యానికి గురిచేస్తోంది.

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌థ‌, గోపీ సుంద‌ర్ సంగీతం, స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌, బ‌న్నీ వాసు నిర్మాత‌గా ..ఇలా ఇంత మంది వున్న ఈ ప్రాజెక్ట్ ఎందుకు రిలీజ్ ఆల‌స్యం అవుతోందో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఇప్ప‌టికైనా మేక‌ర్స్ ఈ స‌స్పెన్స్ కు తెర‌దించుతారేమోన‌ని నిఖిల్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.