Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: వినోద పరిశ్ర‌మ‌కు మంచి రోజులు ఎప్ప‌టికి?

By:  Tupaki Desk   |   19 Nov 2020 9:45 AM IST
టాప్ స్టోరి: వినోద పరిశ్ర‌మ‌కు మంచి రోజులు ఎప్ప‌టికి?
X
కరోనావైరస్ మహమ్మారి సినీరంగాన్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర రంగాల‌తో పోలిస్తే ఈ రంఘంపై ఘోర‌మైన దెబ్బ కొట్టింద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. వైర‌స్ కారణంగా టాలీవుడ్ నిర్మాతలు పంపిణీదారులు ప్రస్తుతం కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. థియేటర్లు మూసివేయబడటంతో పంపిణీదారులకు ఎగ్జిబిట‌ర్ల‌కు టోట‌ల్ సిస్ట‌మ్ కి పెద్ద దెబ్బ త‌గిలింది. పరిమిత ఆక్యుపెన్సీ గురించి కొత్త నిబంధనల మధ్య కొత్త సినిమాలను విడుదల చేయమని నిర్మాతలు పంపిణీదారులను ఒప్పించడం అంత సులువేమీ కాదు.

కార‌ణం ఏదైనా ఇక‌పై సినిమా వీక్ష‌ణ విధానం మారాల‌ని వాణిజ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక‌పై సినిమా వ్యాపారం ఒకేలా ఉండదని అంతా అంచ‌నా వేస్తున్నారు. కనీసం ఒకటి నుండి రెండేళ్ల వరకు థియేట్రికల్ వ్యాపారానికి సంబంధించి కొన్ని మార్పులు ఉంటాయి. కానీ మిగతా అన్ని ఫిల్మ్ బిజినెస్ మోడ‌ళ్ల‌లో ఎటువంటి మార్పు కనిపించదు.

పెద్ద బడ్జెట్ సినిమాలు ఇక‌పై తీయ‌లేరు. వీటిపై ఇప్ప‌ట్లో స్పష్టత లేదు. థియేటర్లలో ఆక్యుపెన్సీ 75 శాతం మించినప్పుడు మాత్రమే నిర్మాతలు భారీ చిత్రాల్ని థియేట్రికల్ విడుదలలు ఎంచుకుంటారు. అదే సమయంలో కొత్త ప్రాజెక్టులను చేపట్టడంలో పంపిణీదారులు ఆసక్తి చూపేందుకు ఆస్కారం క‌నిపించ‌డం లేదు. ఇప్పటికే కొన్ని పెద్ద చిత్రాల నుండి అడ్వాన్స్ ఇచ్చిన చాలా మంది పంపిణీదారులు థియేటర్ హక్కులు కొనేందుకు అధిక ధరలను నిర్ణయించడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. కరోనా మహమ్మారి ప్రాంతీయ సినిమా వ్యాపారంపై భారీ ప్రభావాన్ని చూపుతోంద‌న్న అంచ‌నా ఉంది.

చిన్న లోక‌ల్ సినిమాల సంగ‌తి అటుంచితే.. నిర్మాతలు పాన్-ఇండియా స్థాయిలో సినిమాలు విడుదల చేయడం కష్టత‌ర‌మవుతుంది. తెలుగు రాష్ట్రాల వెలుపల మార్కెట్ ని గెలుచుకోవ‌డం అంత సులువేమీ కాదు. పాన్-ఇండియా విడుదల చాలా సినిమాలకు అసాధ్యం. కరోనావైరస్ మ‌హ‌మ్మారీ స‌న్నివేశం ఏమిటో ఇంకా పూర్తి స్ప‌ష్ఠ‌త లేదు. వ్యాక్సిన్ అంటూ గ‌డ‌బిడ మిన‌హా ఇప్ప‌టికీ దానికి ఠికాణా లేదు. దీంతో ఎగ్జిబిష‌న్ స‌హా వినోద ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర‌మైన సంక్షోభం నెల‌కొన‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రో ఆర్నెళ్లు ఏడాది త‌ర్వాత‌నే ప్ర‌తిదీ క్లారిటీ వ‌స్తుంద‌ని ఓ సెక్ష‌న్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌ట్లో అయితే క్లారిటీ రావ‌డం క‌ష్ట‌మే.