Begin typing your search above and press return to search.

మాస్ మహారాజా సక్సెస్ ట్రాక్ ఎక్కేనా...?

By:  Tupaki Desk   |   20 Jun 2020 6:15 AM GMT
మాస్ మహారాజా సక్సెస్ ట్రాక్ ఎక్కేనా...?
X
మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2017లో వచ్చిన 'రాజా ది గ్రేట్' సినిమా తర్వాత రవితేజకు ఒక్క హిట్ కూడా లేదు. 'టచ్ చేసి చూడు' 'నేల టికెట్' 'అమర్ అక్బర్ ఆంటోనీ' 'డిస్కో రాజా' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో ఎలాగైనా రేస్ లో నిలబడాలని రవితేజ ప్రస్తుతం 'క్రాక్' అనే మూవీలో నటిస్తున్నాడు. మాస్ మహారాజా కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తునారు. ఇంతకముందు 'డాన్‌ శీను' 'బలుపు' లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రవితేజ - గోపిచంద్‌ మలినేని కాంబో హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతున్నారు. దీంతోపాటు రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీని లైన్ లో పెట్టాడు రవితేజ. ఈ చిత్రాన్ని యువ హీరో కోనేరు హవీష్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో రవితేజ గురించి ఒక ర్యూమర్ వినిపిస్తూ ఉంటుంది. మాస్ మహారాజాకి ఎన్ని ప్లాపులొచ్చినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కాంఫ్రమైజ్ కాడని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ తగ్గించుకున్నా సినిమాకు జ‌రిగే ప్ర‌తి బిజినెస్ లో 30 శాతం వాటా ఇవ్వాలి మరియు 5 కోట్లు అడ్వాన్స్ ఇవ్వాలని రవితేజ డీల్ కుదుర్చుకుంటాడట. ఇప్పుడు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న 'క్రాక్' సినిమాకి ర‌వితేజ‌కు అందాల్సిన అమౌంట్ కూడా అందిందట. అవుతే ఇప్పుడు రవితేజ రెమ్యూనరేషన్ మరియు అతని సినిమాలకి పెట్టే పెట్టుబడి చూసుకుంటే నిర్మాతలకి గిట్టుబాటు అయ్యేలా కనిపించడం లేదట. ఆల్రేడి థియేట‌ర్ రిటర్న్స్ ప‌డిపోయాయట. హిందీ మార్కెట్ కూడా ముందున్నంత స్థాయిలో లేదట.

'డిస్కోరాజా' పరాజయం తర్వాత రవితేజ హిందీ రైట్స్ చాలా దారుణంగా పడిపోయాయంట. కాకపోతే శాటిలైట్ రైట్స్ మాత్రం స్టడీగా ఉన్నాయట. మ‌రి ర‌వితేజ నుంచి రాబోతున్న 'క్రాక్' బ్లాక్ బ‌స్టర్ అయితే త‌ప్ప రవితేజ మార్కెట్ మళ్ళీ గాడిలో పడే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. 'క్రాక్' సినిమా కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా విజ‌య్ సేతుపతి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'సేతుప‌తి' సినిమాని పోలి ఉంటుందట. మరి ఈ సినిమా ఇక్కడ ఏమాత్రం వర్కౌట్ అవుద్దో చూడాలి. ఇక ర‌వితేజ పోలీస్ గా న‌టించిన 'విక్ర‌మార్కుడు' త‌ప్ప మ‌రే సినిమా ఇంత‌వ‌ర‌కు హిట్ అవ్వ‌లేదనే సెంటిమెంట్ ఉంది. 'క్రాక్' సినిమాతో ర‌వితేజ ఈ సెంటిమెంట్ కి బ్రేక్ వేస్తాడేమో చూడాలి.