Begin typing your search above and press return to search.

నిర్మాతల కీల‌క భేటికి రంగం సిద్ధం

By:  Tupaki Desk   |   18 July 2022 10:55 AM GMT
నిర్మాతల కీల‌క భేటికి రంగం సిద్ధం
X
క‌రోనా త‌రువాత టాలీవుడ్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. నిర్మాణ వ్య‌యం పెరిగిపోవ‌డం, సినిమాల నిర్మాణం నెల‌ల త‌ర‌బ‌డి వాయిదా ప‌డ‌టం వంటి కార‌ణాల‌తో నిర్మాత‌లు చాలా వ‌ర‌కు ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అయితే ఇటీవ‌ల వ‌రుస‌గా పాన్ ఇండియా మూవీస్ తో పాటు క్రేజీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వ‌ద్ద ఆక‌ట్టుకుంటూ విజ‌యాల్ని సొంతం చేసుకోవ‌డంతో మ‌ళ్లీ టాలీవుడ్ క్ర‌మ క్ర‌మంగా క‌ళ‌క‌ళ‌లాడ‌టం మొద‌లు పెట్టింది.

పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచల‌నం సృష్టించాయి. దీంతో మ‌న హీరోలు అత్య‌ధిక శాతం భారీ బ‌డ్జెట్ సినిమాలకు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఒక్క‌సారిగా నిర్మాణ వ్య‌యం రికార్డు స్థాయిలో పెర‌గ‌డం మొద‌లు పెట్టింది. ఇది ఇప్ప‌డు నిర్మాత‌ల‌కు భారంగా మారిపోయింది. దీనికి తోడు స‌గ‌టు ప్రేక్ష‌కుడు టాక్ బాగున్న సినిమాల కోసం మాత్రం థియేట‌ర్ల‌కు రావ‌డం మొద‌లు పెట్టాడు.

పెరిగిన రేట్ల‌ని దృష్టిలో పెట్టుకుని సూప‌ర్ హిట్ టాక్ వినిపించిన సినిమాల‌కు మాత్రమే థియేట‌ర్ల‌కు రావ‌డం మొద‌లు పెట్టాడు. పెరిగిన టికెట్ ధ‌ర‌లు కూడా ఇందుకు ఓ కార‌ణంగా నిలుస్తున్నాయి. దీంతో చాలా వ‌ర‌కు సినిమాలు రెండు వారాల‌కు మించి థియేట‌ర్ల‌లో నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితులు మొద‌ల‌య్యాయి.

ఇదిలా వుంటే పెరిగిన నిర్మాణ వ్య‌యం, ఆర్టిస్ట్ ల రికార్డు స్థాయి రెమ్యూన‌రేష‌న్ లు, టెక్నీషియ‌న్ ల పారితోషికాలు కూడా ఇప్ప‌డు నిర్మాత‌ల‌కు భారంగా మారాయి. దీనిపై నిర్మాత‌లంతా ప్ర‌త్యేకంగా ఓ భేటీని ఏర్పాటు చేసుకుని కూలంక‌షంగా చ‌ర్చించి ఓ నిర్ణ‌యానికి రావాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌.

ఇప్ప‌టికే యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ లో దీనిపై గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా దీనిపైనే జూలై 21న తెలుగు చల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ప్ర‌త్యేకంగా జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం నిర్వ‌హించ బోతోంది.

ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ సోమ‌వారం ప‌త్రికా ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఈ భేటీలో ఓటీటీ, వీపీఫ్ ఛార్జీలు, టికెట్ ధ‌ర‌లు, నిర్మాణ వ్య‌యం, ప‌ని ప‌రిస్థితులు, ఫైట‌ర్స్ యూనియ‌న్, ఫెడరేష‌న్ స‌మ‌స్య‌లు, న‌టీన‌టుల రెమ్యూన‌రేష‌న్ ల‌పై చ‌ర్చ జ‌ర‌ప‌నున్నార‌ట‌. గిల్డ్ , నిర్మాత‌ల మండ‌లి 21న జ‌ర‌గ‌నున్న కీల‌క భేటీ లో ఎలాంటి నిర్ణ‌యాల్ని వెల్ల‌డించ‌నున్నార‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.