Begin typing your search above and press return to search.

రెమ్యూనరేషన్స్ విష‌యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు...?

By:  Tupaki Desk   |   30 Sept 2020 2:20 PM IST
రెమ్యూనరేషన్స్ విష‌యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు...?
X
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ మధ్య సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవుతుండటంతో కాస్త ఊరట చెందుతున్నారు. ఇక క్రైసిస్ లో బాగా నష్టపోయింది ప్రొడ్యూసర్స్ అనే చెప్పాలి. థియేటర్స్ రీ ఓపెనింగ్ పై ఇంకా డెసిషన్స్ తీసుకోకపోవడంతో మరికొన్ని నెలలు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం లేదు. దీంతో కొంతకాలం పాటు రెవెన్యూ నామమాత్రంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లతో సహా నటీనటులు టెక్నీషియ‌న్లు అందరూ తమ రెమ్యూనరేషన్ కొంతమేర తగ్గించుకోవాల్సిందే అని టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ గిల్డ్ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే గిల్డ్ లో స‌భ్య‌త్వం ఉన్న కొంద‌రు నిర్మాత‌లు ఈ వార్తలను ఖండించారని తెలుస్తోంది.

సినిమా రంగంలోని మేనేజర్లతో సమావేశం ఏర్పాటు చేసి పారితోషకాల్లో కోతలు విధించాల్సిన అవసరాన్ని వివరించినట్లు వస్తున్న వార్తలను గిల్డ్ ప్ర‌తినిధులు కొట్టేశారు. వాస్త‌వానికి ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్లు టెక్నీషియ‌న్లు.. నిర్మాత‌ల శ్రేయ‌స్సు కోరి స్వ‌చ్ఛందంగా త‌మ పారితోషికాల‌ను తగ్గించుకోడానికి ముందుకొస్తున్నారని తెలుస్తోంది. కొంద‌రైతే లాక్ డౌన్ కి ముందు తీసుకున్న అడ్వాన్సులు కూడా తిరిగి వెన‌క్కి ఇచ్చేస్తున్నారని సమాచారం. కాకపోతే ప్రొడ్యూసర్ గిల్డ్ మరియు కౌన్సిల్ లోని కొంతమంది మాత్రం హీరో హీరోయిన్లు త‌గ్గించిన దానికంటే ఇంకొంత త‌గ్గించ‌మ‌ని అడుగుతున్నారని బోగట్టా. అయితే స్టార్స్ పై పారితోషకాల విష‌యంలో ఎలాంటి ఆంక్ష‌లు పెట్ట‌వ‌ద్ద‌ని.. పొలైట్ గానే ముందుకు సాగాల‌ని తెలియ‌జేసిన‌ట్లు సమాచారం. ఏదేమైనా క్రైసిస్ టైంలో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగితేనే ఇండస్ట్రీకి మంచిందని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.