Begin typing your search above and press return to search.

కల్యాణ్ రామ్ చేస్తున్నది కచ్చితంగా సాహసమే!

By:  Tupaki Desk   |   3 July 2021 9:30 AM GMT
కల్యాణ్ రామ్ చేస్తున్నది కచ్చితంగా సాహసమే!
X
సాంఘిక చిత్రాలను తెరకెక్కించడమే చాలా కష్టమైన విషయం అనుకుంటే, చారిత్రక నేపథ్యం కలిగిన కథలను తెరపైకి తీసుకురావడం మరింత కష్టమైన విషయం. అందుకు ఎంతో సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది .. ఖర్చును భరించవలసి వస్తుంది. కల్పిత కథలను ఎలాగైనా మార్చుకునే .. మలుచుకునే స్వేచ్ఛ ఉంటుంది. అదే చారిత్రక నేపథ్యం కలిగిన కథలను ఎంచుకుంటే, యధార్థ సంఘటనలకు కట్టుబడి ముందుకు వెళ్లవలసి ఉంటుంది. కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది .. వాటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది.

రాజులు .. రాజ్యాలు .. కోటలు .. యుద్ధాలు .. గుర్రాలు .. కత్తులు .. డాళ్లు .. ఇలా ఒకదానికి మరొకటి ముడిపడి ఉంటాయి. అంతేకాదు పాత్రలు వెంటనే ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికీ .. పాత్రల వేషధారణ విషయంలో ప్రత్యేకతలను పాటించవలసి ఉంటుంది. ఆనాటి వాతావరణం నేపథ్యంలో సాగే చిత్రీకరణ అంతా ఒక ఎత్తయితే .. ఆయా సన్నివేశాలను ఒక రేంజ్ కి తీసుకువెళ్లడానికి అవసరమయ్యే విఎఫెక్స్ ఒక ఎత్తు. ఇది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పనే. వీఎఫెక్స్ పనితీరు సక్రమంగా లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది.

ఇలా ఒక చారిత్రక చిత్రం తీయడం ఎంతో శ్రమతోను .. డబ్బుతోను కూడుకుని కనిపిస్తుంది. పైగా ప్రతి విభాగానికి సంబంధించిన నిపుణులు పనిచేసినప్పుడే అవుట్ పుట్ అనుకున్నట్టుగా వస్తుంది. అలాంటి ఒక బాధ్యతను కల్యాణ్ రామ్ తన భుజాలకెత్తుకోవడం నిజంగా విశేషమే. ఒక కొత్త దర్శకుడికి ఆయన ఇంతటి బాధ్యతను అప్పగించడం సాహసంతో కూడుకున్నదే. కథానాయికగా ఆయన సరసన కనిపించనున్న సంయుక్త మీనన్ కూడా కొత్త అమ్మాయినే. ఇలా కల్యాణ్ రామ్ చేస్తున్న సాహసంతో కూడిన ప్రయోగం, ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.