Begin typing your search above and press return to search.

న‌ల్గొండ‌, యాదాద్రిల‌పై జ‌క్క‌న్న ప్రత్యేక ప్రేమ కార‌ణం?

By:  Tupaki Desk   |   30 March 2022 2:30 AM GMT
న‌ల్గొండ‌, యాదాద్రిల‌పై జ‌క్క‌న్న ప్రత్యేక ప్రేమ కార‌ణం?
X
`బాహుబ‌లి` చిత్రంతో రాజ‌మౌళి పాన్ ఇండియా స్థాయి ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయారు. ఈ మూవీ టు సిరీస్ లు జ‌క్క‌న్న‌కు తెచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఆయ‌న పేరు మారు మ్రోగిపోయింది. ద‌ర్శ‌కుడిగా త‌న స్థాయి పెరిగింది. బాలీవుడ్ హీరోలు సైతం జ‌క్క‌న్న సై అంటే డేట్స్ ఇవ్వ‌డానికి రెడీ అయిపోతున్నారు. ఉత్త‌రాది ప్రేక్ష‌కులు కూడా రాజ‌మౌళి సినిమా అంటే ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వంద‌ల కోట్లు సాధించేలా జ‌క్క‌న్న‌ సినిమాల‌పై కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

తాజాగా విడుద‌ల లైన ట్రిపుల్ ఆర్ పై కూడా ఇంత‌కు మించిన క్రేజ్ దేశ వ్యాప్తంగా క‌నిపిస్తోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం కావ‌డంతో స‌హ‌జంగానే ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుండ‌టంతో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

ద‌క్షిణాదిలో ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. అంతే స్థాయిలో ఉత్త‌రాదిలోనూ ఈ మూవీ అక్క‌డి ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

ఇప్ప‌డు ఎక్క‌డా విన్నా.. చూసినా ట్రిపుల్ ఆర్ ముచ్చట్లే.. ఈమూవీపై చర్చే ప్ర‌ధానంగా జ‌రుగుతోంది. దేశ వ్యాప్తంగా వున్న క్రేజీ స్టార్లు, డైరెక్ట‌ర్లు రాజ‌మౌళిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. శంక‌ర్ అయితే రాజ‌మౌళిని ఆకాశానికి ఎత్తేశారు. మ‌హారాజ మౌళి అంటూ సంబోధించారు. ఇక వ‌ర్మ విడుద‌ల చేసిన ఆడియో, ట్వీట్ ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.. రాజ‌మౌళి మ‌నకు ద‌క్కిన బంగారం అంటూ ఎన్న‌డూ లేని విధంగా పొగ‌డ్త‌ల పురాణం అందుకున్నారు వ‌ర్మ‌..

ఇదిలా వుంటే రాజ‌మౌళి గురించి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. రాజ‌మౌళి, కీర‌వాణి కుటుంబాలు న‌ల్ల‌గొండ జిల్లా.. నార్కెట్ ప‌ల్లికి స‌మీపంలో వున్న ఎదులూరు గ్రామంలో ప్ర‌త్యేకంగా కొన్ని ఫార్మ్‌ లాండ్స్ ని కొన్నారు. కోవిడ్ టైమ్ లో అక్క‌డే ఏర్పాటు చేసిన ఫామ్ హౌస్ ల‌లో సిటీకి దూరంగా కొన్నాళ్ల పాటు వున్నారు. తాజాగా జ‌క్క‌న్న క‌న్ను న‌ల్ల‌గొండ జిల్లాలోని యాదాద్రిపై ప‌డింద‌ట‌.

దీంతో రాజ‌మౌళి, కీర‌వాణి కుటుంబాలు యాదాద్రి సమీపంలో ఫార్మ్‌ లాండ్స్ ని భారీ స్థాయిలో కొనుగోలు చేశారని తెలిసింది. ఈ సోమ‌వారం యాదాద్రి ఆయ‌న సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగిన విష‌యం తెలిసిందే. రానున్న రోజుల్లో చుట్టుప‌క్కల యాదాద్రి కార‌ణంగా అభివృద్ధి జ‌ర‌గ‌నుంద‌ని గ్రహించిన రాజ‌మౌళి, కీర‌వాణి కుటుంబాలు ఈ ఏరియాలో పెద్ద ఎత్తున వ్య‌వ‌సాయ భూములు కొన్న‌ట్టుగా తెలుస్తోంది.