Begin typing your search above and press return to search.

అగ్ర నిర్మాత‌లో డైల‌మాకి కార‌ణం ఏమై ఉంటుంది?

By:  Tupaki Desk   |   6 July 2021 1:30 PM GMT
అగ్ర నిర్మాత‌లో డైల‌మాకి కార‌ణం ఏమై ఉంటుంది?
X
తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం ఆక్యుపెన్సీ.. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తులు ల‌భించినా...ఇంకా యాజ‌మాన్యాలు థియేట‌ర్ల‌ను ఓపెన్ చేయ‌లేదు. ఇటీవ‌లే తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వ అధికారుల‌తో నిర్మాత‌లు స‌మావేశ‌మైన త‌మ‌ స‌మ‌స్య‌ల్ని చెప్పుకున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ పూర్త‌యి రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు విడుద‌ల కాలేదు. ఏడాది కాలంగా నిర్మాత‌లంతా ఓటీటీ ల్లోనే త‌మ చిత్రాల్ని రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఓటీటీల్లో రిలీజ్ పైనా ఇప్పుడు నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. చిన్న సినిమాలు మాత్ర‌మే ఓటీటీల్లో రిలీజ్ చేయాల‌ని..అగ్ర హీరోల చిత్రాలు మాత్రం థియేట‌ర్లో మాత్ర‌మే రిలీజ్ చేయాల‌ని ఎగ్జిబిట‌ర్లు ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో నిర్మాత‌లు..ఎగ్జిబిట‌ర్లు మ‌ధ్య కొంత భిన్నాభిప్రాయాల‌తో సందిగ్ధ‌త నెల‌కొంది. ఈ స‌మావేశంలో కొంత మంది ఎగ్జిబిట‌ర్లు ఈ కొత్త‌ నిబంధ‌న‌కు అంగీక‌రించారు. ఇంకొంద‌రు అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. అయితే అగ్ర నిర్మాత సురేష్ బాబు వెర్ష‌న్ ఎలా ఉంది? అన్న‌దానిపై స‌రైన క్లారిటీ లేదు. ఆయ‌న నిర్మాతగా.. ఎగ్జిబిట‌ర్ కం పంపిణీదారుగా సుప‌రిచితం. స్టూడియో య‌జ‌మానిగానూ ప‌రిశ్ర‌మ‌లో గొప్ప గౌర‌వం అందుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎగ్జిబిట‌ర్ కోణంలో ఆలోచిస్తే ఆయ‌న చేతిలో ఉన్న సినిమాలను థియేట్రిక‌ల్ రిలీజ్ చేస్తారా లేదా? అన్న‌దానిపై ర‌క‌ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. `దృశ్యం-2`.. `నార‌ప్ప‌` చిత్రాలు ఓటీటీల్లోకి వెళుతున్నాయ‌న్న సందిగ్ధ‌త అలానే ఉంది. ఇప్ప‌టికే `దృశ్యం-2` చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయ‌డానికి ఒప్పందం చేసుకోగా.. నార‌ప్ప‌ను కూడా అదే తీరున రిలీజ్ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. అయితే ఇంకా ఈ సినిమాకి సంబంధిచి డీల్ కుద‌ర‌లేదు. మంచి ఆఫ‌ర్ వస్తే అమ్ముదామ‌ని ఎదురు చూస్తున్నారు.

కానీ ఇప్పుడు స‌న్నివేశం మారింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో నారప్పను అయినా నేరుగా థియేట‌ర్లో రిలీజ్ చేస్తారా? లేక ఓటీటీ లో రిలీజ్ తో స‌రిపుచ్చుతారా? అన్న‌దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే సురేష్ బాబు మ‌న‌సులో మాత్రం ఓటీటీ రిలీజ్ అయితేనే మంచిద‌నే అభిప్రాయం ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి క‌రోనా తెచ్చిన ముప్పు అంతా ఇంతా కాదు. దిగ్గ‌జాల్ని సైతం ఏం ఆలోచించాలో అర్థం కాని గంద‌ర‌గోళం సృష్టించింది. ఈ పరిస్థితి నుంచి వినోద ప‌రిశ్ర‌మ త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాల‌నే ఆకాంక్షిద్దాం. సినిమాల‌న్నీ థియేట‌ర్ల‌లో రిలీజై ఆ త‌ర్వాతే ఓటీటీలోకి రావాల‌ని ఆశిస్తే త‌ప్పు కాదు.