Begin typing your search above and press return to search.

ఆ బుక్కేంటి దగ్గుబాటి ?

By:  Tupaki Desk   |   22 Dec 2018 9:36 AM GMT
ఆ బుక్కేంటి దగ్గుబాటి ?
X
నిన్న గ్రాండ్ గా జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ కం ట్రైలర్ లాంచ్ అభిమానులకు కనులవిందైన వినోదాన్ని ఇచ్చింది. వచ్చిన అతిరధ మహారధులు ఓ రేంజ్ లో బాలయ్యను ఎన్టీఆర్ కీర్తిని పొగడటం అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ ఓ రేంజ్ లో కట్ చేయడం వెరసి ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వచ్చిన మాట నిజం. వచ్చిన అతిధులు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో మాటల్లో కొందరు చేతల్లో కొందరు తమ ప్రత్యేకతను నిరూపించుకునే ప్రయత్నం చేసారు. ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చేలా ప్లాన్ చేసుకున్న బాలయ్య రాజకీయంగా తనతో విభేదాలు ఉన్నా సరే సోదరి పురందరేశ్వరి రావడంలో విజయవంతం అయ్యాడు.

అదే ఆశ్చర్యం అనుకుంటే ఆవిడ భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్రావు హాజరు కావడం మరో షాక్. అంతే కాదు అందరికి కనిపించేలా మీడియా కెమెరాకు దొరికేలా దగ్గుబాటి పట్టుకున్న ఒక పుస్తకం ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేమ్ అందరి దృష్టిని ఆకర్షించింది. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలో సినిమా నుంచి రాజకీయాల వైపు రావాలి అనుకున్నప్పుడు జరిగిన సంఘటలను సవాళ్లు అన్ని ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కథ కూడా ఇదే కాబట్టి ఇందులో నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు అని చెప్పడానికి దగ్గుబాటి ఆ పుస్తకం తీసుకువచ్చారేమో అన్న కామెంట్స్ వచ్చాయి.

అయితే చాలా ఏళ్ళ క్రితం దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు ఎన్టీఆర్ మీద ఒక పుస్తకాన్ని ఒక చరిత్ర కొన్ని నిజాలు పేరుతో రాసారు. వైస్రాయ్ ఉదంతం మొదలుకుని ఎన్టీఆర్ పదవీచ్యుతులు కావడం వరకు చంద్రబాబునాయుడు పాత్రతో సహా అన్ని అందులో కూలంకుశంగా రాసారు. ఇది వివాదం అయ్యింది కూడా. మరి ఎన్టీఆర్ వేడుకకు వచ్చేటప్పుడు ఆ పుస్తకాన్ని కూడా తెచ్చి ఉంటె బాగుండేదని కామెంట్స్ చేసినవాళ్లు లేకపోలేదు. ఏమైనా ఎన్టీఆర్ ఫంక్షన్ ఎన్నో విశేషాలకు వేదికగా నిలిచిందన్నది మాత్రం నిజం.