Begin typing your search above and press return to search.

గురూజీ 'కథ'కు ఏమైంది..?

By:  Tupaki Desk   |   14 Nov 2022 11:30 AM GMT
గురూజీ కథకు ఏమైంది..?
X
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. కేవలం తన మాటలలోనే ఎన్నో చిత్రాలను నిలబెట్టారు. ఇదే క్రమంలో దర్శకుడిగా మారి వరుస విజయాలు అందుకున్నారు. అయితే త్రివిక్రమ్ తదుపరి సినిమా విషయంలో ఏదీ ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది

2020 లో 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ రెండేళ్లలో మరో చిత్రాన్ని ప్రేక్షకులకు అందించలేదు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో సెట్స్ మీదకి తీసుకొచ్చిన SSMB28 ప్రాజెక్ట్ ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమే జరిగింది.

రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం అవుతుందని అనుకుంటుండగా.. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా 'మహేశ్-త్రివిక్రమ్' సినిమాపై అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా అనుకున్న కథలో మార్పులు చేసి సెట్స్ మీదకు వెళ్తున్నారని.. దీని కారణంగా కాస్ట్ అండ్ క్రూలో కూడా మార్పులు ఉంటాయని అంటున్నారు.

మహేశ్ బాబుతో ఓ హై ఆక్టెన్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు. దీనికి తగ్గట్టుగానే కేజీయఫ్ ఫైట్ మాస్టర్స్ ని తీసుకొచ్చి ఫస్ట్ షెడ్యూల్ లో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఇప్పుడు స్క్రిప్టు మారినట్లుగా చెబుతున్నారు.

మహేశ్ తో మొదట అనుకున్న సబ్జెక్ట్ ఫుల్ యాక్షన్ టచ్ తో ఉండగా.. ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ ఇటీవలి చిత్రాల టెంప్లేట్ లోనే ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎమోషన్ - రొమాన్స్ కలబోసిన ఫ్యామిలీ డ్రామా అవుతుందని.. కథలో ఫైట్లు వుంటాయి కానీ అవే కీలకం కాదని అంటున్నారు.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ పుకార్లలో నిరాశ చెందుతున్నారు. అంతా అనుకొని సెట్స్ మీదకి తీసుకొచ్చి, ఒక షెడ్యూల్ షూటింగ్ చేసిన తర్వాత.. మళ్ళీ స్క్రిప్ట్ లో చేంజెస్ చేయటం ఏంటని ఆలోచిస్తున్నారు. మరి ఇన్నాళ్లూ త్రివిక్రమ్ ఏం చేసినట్లు అని ప్రశ్నిస్తున్నారు.

మహేశ్ తో త్రివిక్రమ్ చిత్రాన్ని 2021 సమ్మర్ లో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న దర్శకుడు.. 2022 ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాకు త్రివిక్రమ్ కథ స్క్రీన్ ప్లేతో పాటుగా.. అన్ని పనులు దగ్గరుండి చూసుకోవడంతో మహేష్ మూవీ లేట్ అవుతుందనే టాక్ వచ్చింది. ఏదైతేనేం పూజ చేశారుగా అనుకుంటుండగా.. సెట్స్ మీదకి వెళ్ళడానికి మరో తొమ్మిది నెలలు వేచి చూడాల్సి వచ్చింది.

ఎట్టకేలకు రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేశారు అనుకుండగా.. మళ్ళీ షూటింగ్ కు విరామం ఇచ్చారు. మహేశ్ బాబు తల్లి మరణంతో ఆలస్యం అవుతోందని అనుకుంటుడగా.. స్టోరీ విషయంలో వచ్చిన డిస్కషన్లు అన్నీ SSMB28 సినిమాకు హర్డిల్స్ గా మారాయని అంటున్నారు.

ఇప్పుడు పూర్తిగా కొత్త కథను ఫిక్స్ చేసుకొని.. డిసెంబర్ మొదటి వారంలో మహేష్-త్రివిక్రమ్ సినిమా సెట్ మీదకు రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ముందుగా ప్రకటించినట్లుగా 2023 ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం లేదు.

నిజానికి మహేశ్ బాబు సినిమా కంటే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తలపెట్టిన సినిమా విషయంలోనూ ఇలానే జరిగింది.' అల వైకుంఠపురములో' సినిమా రిలీజైన తర్వాత.. హారిక అండ్ హాసిని బ్యానర్ లో ఓ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు.

మరికొన్ని రోజుల్లో మొదలవుతుందని భావిస్తున్న తరుణంలో.. తారక్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు మేకర్స్ నుంచి మరో ప్రకటన వచ్చింది. పవన్ సినిమా మీద దృష్టి పెట్టి, స్క్రిప్ట్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి చేయకపోవడం వల్లనే ఎన్టీఆర్ మూవీ క్యాన్షిల్ అయిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. వాటిల్లో నిజమెంతో తెలియదు కానీ.. త్రివిక్రమ్ వెంటనే మహేష్ బాబుతో హ్యాట్రిక్ సినిమాని ప్రకటించారు.

ఇప్పుడు మహేష్ 28వ చిత్రం కూడా ఆశించిన విధంగా సాగడం లేదు. ఏడాదిన్నరగా వార్తల్లోనే ఉంటోంది. త్రివిక్రమ్ స్క్రిప్టులో ఇంకా రిపేర్లు చేస్తున్నాడని అంటున్నారు. మహేశ్ సూచనలతో ఈ మార్పులు జరిగాయని చెబుతున్నారు కానీ.. అసలు ఇప్పటి వరకు ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేయకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. డిసెంబరు నుంచైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్ సజావుగా సాగాలని కోరుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.