Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఔట్! నిన్న నాగార్జున.. నేడు క‌మ‌ల్ హాస‌న్!?

By:  Tupaki Desk   |   22 Dec 2022 4:49 AM GMT
బిగ్ బాస్ ఔట్! నిన్న నాగార్జున.. నేడు క‌మ‌ల్ హాస‌న్!?
X
ఈ బిగ్ బాస్ కి ఏమైంది? నిన్న కింగ్.. నేడు లోక నాయ‌కుడు! షో నుంచి త‌ప్పుకుంటున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇక‌పై కింగ్ నాగార్జున‌.. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ల‌ను బిగ్ బాస్ హోస్ట్ లుగా చూడ‌లేమా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ కి ఆరు సీజ‌న్లు పూర్త‌యితే అందులో నాలుగు సీజ‌న్ల‌ను నాగార్జున‌నే హోస్ట్ గా న‌డిపించేశారు. కానీ ఇప్పుడు నాగ్ ఎగ్జిట్ కి బాల‌య్య ఎంట్రీకి డోర్స్ ఓపెన‌వుతున్నాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. నాగార్జున అక్కినేని స్థానంలో నందమూరి బాలకృష్ణ బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా అల‌రిస్తారని క‌థ‌నాలొచ్చాయి.

చాలా సంవత్సరాలుగా షోను న‌డిపిస్తున్న‌ నాగార్జున ఈసారి బిగ్ బాస్ నుండి నిష్క్రమించ‌డం కొంత బాధాక‌ర‌మే అయినా కింగ్ అభిమానులు దీనిని ఆహ్వానించాల్సి ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే తెలుగు బిగ్ బాస్ తదుపరి సీజన్ కి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. మరి అసలు నాగ్ స్థానంలో బాలకృష్ణ వస్తారో లేదో చూడాలి. నందమూరి న‌ట‌సింహం ఇప్పటికే 'అన్ స్టాపబుల్'తో ఆహా ఓటీటీలో సమర్థుడైన హోస్ట్ గా నిరూపించుకున్నారు. మ‌రోవైపు అఖండ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో దూకుడుమీదున్నారు.

ఈ క‌థ ఇలా ఉండ‌గానే ఇప్పుడు త‌మిళంలో అజేయంగా కొన‌సాగుతున్న బిగ్ బాస్ షో నుంచి హోస్ట్ క‌మ‌ల్ హాస‌న్ కూడా నిష్కృమిస్తున్నార‌ని బ‌ల‌మైన క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. లెజెండరీ న‌టుడు తిరిగి సినిమాల‌తో పూర్తి స‌మ‌యం గ‌డిపేందుకు ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని కూడా తెలిసింది. 2022- బ్లాక్ బస్టర్ 'విక్రమ్‌'తో క‌మ‌ల్ పునరారంగేట్రం అదిరింది. అత‌డు అప్పులు అన్నీ తీర్చేశాడు. ఇప్పుడు ఏమాత్రం టెన్ష‌న్ లేదు. ఇక‌ తన రాజకీయ కెరీర్ పై దృష్టి పెడ‌తాడా లేదా? అన్న‌ది అప్ర‌స్తుతం. కానీ ఇటీవ‌ల‌ సినీ పరిశ్రమకు దూరంగా ఉండ‌టం లెజెండ‌రీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కి అస్స‌లు న‌చ్చ‌డం లేదట‌. అందుకే ఇటీవ‌ల‌ కొన్ని ప్రామిసింగ్ ప్రాజెక్ట్ లతో దూసుకు రావాల‌నే ప్ర‌ణాళిక‌తో ఉన్నాడ‌ని స‌మాచారం.

బిగ్ బాస్ తమిళ్ షో హోస్ట్ గా క‌మ‌ల్ ఎదురే లేని వాడిగా కొన‌సాగుతున్నాడు. టెలివిజన్ పరిశ్రమలో లోక‌నాయ‌కుడు చాలా చురుగ్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ షో నుంచి తప్పుకోవాలని పూర్తి నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు గుస‌గుస‌లు త‌మిళ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. త‌మిళంలోను బిగ్ బాస్ ఆరవ సీజన్ కొనసాగుతోంది. జనవరి 2023లో బిగ్ బాస్ తమిళ గ్రాండ్ ఫినాలే తర్వాత హోస్ట్ క‌మ‌ల్ హాస‌న్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. బిగ్ బాస్ ఏడవ సీజన్ కోసం మేకర్స్ అతనికి భారీ మొత్తాన్ని ప్యాకేజీ అందించినా దానికి అత‌డు ఆస‌క్తిగా లేడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే ప్ర‌స్తుత స‌న్నివేశంలో కమల్ హాసన్ నిర్ణయం వెనుక కారణాలు స‌హేతుకం. ఇక హోస్ట్ ని రిపీటెడ్ గా చూడ‌టం ఆడియెన్ కి కూడా బోరింగ్ అంశం. పైగా ఆ పాత్ర రొటీన్ గానే ఉంటుంది. తాజా త‌మిళ బిగ్ బాస్ సీజన్ లో టీఆర్పీ తక్కువగా ఉండటం కూడా కమల్ హాసన్ ను బాగా నిరాశపరిచింద‌ని తెలిసింది. కాబట్టి ఉలగనయన్ హోస్టింగ్ కి బ్రేకిచ్చి తన నటనా వృత్తికి పూర్తి సమయాన్ని కేటాయించాలని యోచిస్తున్నాడు. తన త‌దుప‌రి ప్రాజెక్ట్ లపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాడు.

కమల్ హాసన్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రస్తుతం 'భారతీయుడు 2' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ భార‌తీయుడు (ఇండియన్‌)కి ఇది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ గా తెర‌కెక్కుతోంది. ఎస్ శంకర్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సీక్వెల్లో స్వాతంత్య్ర‌ సమరయోధుడు సేనాపతిగా.. న‌డి వ‌య‌స్కుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఇండియన్ 2 టీజర్ ను న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. మార్చి 2023 నాటికి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి నిర్మాణానంత‌ర ప‌నుల్లోకి వెళ‌తార‌ని తెలిసింది.

కమల్ హాసన్ పరిశ్రమలో త‌న కెరీర్ 234వ సినిమా కోసం మణిరత్నంతో క‌లిసి ప‌ని చేస్తార‌ని కూడా తెలిసింది. #KH 234 అని తాత్కాలికంగా ఈ సినిమాని పిలుస్తున్నారు. ఈ చిత్రం 2023 ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఆ త‌ర్వాత 'విక్రమ్ 2' కోసం లోకేష్ కనగరాజ్ తో మళ్లీ క‌మ‌ల్ బ‌రిలో దిగుతారు. యువ ద‌ర్శ‌కుడు హెచ్ వినోద్ తోను సినిమా చేయాల‌ని భావిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.