Begin typing your search above and press return to search.

సుక్కూకి ఏమైంది..? ఎందుకు సైలెంట్ అయిపోయాడు..?

By:  Tupaki Desk   |   19 July 2022 4:30 AM GMT
సుక్కూకి ఏమైంది..? ఎందుకు సైలెంట్ అయిపోయాడు..?
X
టాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఓవైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు నిర్మాతగా మీడియం రేంజ్ చిత్రాలను నిర్మిస్తున్నారు. కొత్త టాలెంట్ ను పరిశ్రమకు అందిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా తన అప్ కమింగ్ సినిమాల విషయాలు గానీ మరియు తన ప్రొడక్షన్ లో రూపొందే చిత్రాలకు సంబంధించి కానీ ఎలాంటి రెగ్యులర్ అప్డేట్స్ రావడం లేదు. దీంతో ఇప్పుడు సుక్కూ తన కింద ఉన్న అన్ని ప్రాజెక్ట్లను ఆపివేశాడనే కామెంట్స్ వస్తున్నాయి.

'ఆర్య' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సుక్కూ.. తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత వచ్చిన 'జగడం' మూవీ ప్లాప్ అయినప్పటికీ.. డైరెక్టర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో '100% లవ్' 'ఆర్య 2' '1 నేనొక్కడినే' 'నాన్నకు ప్రేమతో' వంటి వేటికవే ప్రత్యేకమైన సినిమాలు అందించాడు.

విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్.. 'రంగస్థలం' చిత్రంతో టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న దర్శకుడు.. మళ్లీ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచనలం సృష్టించాడు. దీంతో ఇప్పుడు 'పుష్ప 2' మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు నిర్మాతగానూ సుక్కూ జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో 'కుమారి 21ఎఫ్' మూవీ చేసి లాభాలు అందుకున్న దర్శకుడు.. 'ఉప్పెన' చిత్ర నిర్మాణంలో భాగం పంచుకొని మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలో '18 పేజెస్' తో పాటుగా మరో మూడు సినిమాల బాధ్యత తీసుకున్నారు. అయితే ఈ సినిమాలన్నీ ఏ దశలో ఉన్నాయనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

'పుష్ప: ది రైజ్' సినిమా రిలీజైన మూడు నెలల్లోనే రెండో భాగాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా వచ్చి ఏడు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. దీనికి కారణం 'పుష్ప 2' స్క్రిప్టును సుక్కూ త్వరితగతిన పూర్తి చేయకపోవడమే అనే టాక్ ఉంది.

ఇక 'పుష్ప' రెండో భాగం కంటే ముందు మరో మూవీ చేయాలనే ఆలోచనతో.. విజయ్ దేవరకొండ తో సుకుమార్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకమే. దీనిపై ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. సుక్కూ నిర్మాణ భాగస్వామ్యంతో రూపొందే సినిమాలు మరియు కథ అందించే చిత్రాల విషయాలు కూడా ఇలానే ఉన్నాయి.

నిఖిల్ తో చేసిన '18 పేజెస్' సినిమా గురించి పూర్తిగా మర్చిపోయాడేమో అనిపిస్తోంది. అప్పుడెప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ మూవీ రిలీజ్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలానే కార్తికేయతో అనౌన్స్ చేసిన చిత్రం మరియు దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ కు స్క్రిప్టు అందిస్తున్న 'సెల్ఫిష్' సినిమా గురించి కూడా ఎలాంటి అప్డేట్స్ లేవు. సాయి తేజ్ తో చేస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ కూడా ఈ లిస్టులో ఉంది.

ఇలా సుకుమార్ ఆధ్వర్యంలో నడిచే ఏ ప్రాజెక్ట్ కూడా యాక్టీవ్ మోడ్ లో కనిపించడం లేదు. అల్లు అర్జున్ తో చేయబోయే 'పుష్ప 2' సినిమా ఆగష్టు రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్తుందని వార్తలు వస్తున్నాయి కానీ.. దానిపై నిర్మాతల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. మరి సుక్కూ రానున్న రోజుల్లో అయినా తన కింద ఉన్న సినిమాలకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి.