Begin typing your search above and press return to search.

బాలయ్య హ్యాండ్ కు ఏమైంది..?

By:  Tupaki Desk   |   20 Nov 2021 2:30 PM GMT
బాలయ్య హ్యాండ్ కు ఏమైంది..?
X
నందమూరి బాలకృష్ణ భుజానికి ఇటీవల సర్జరీ జరిగిందనే సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.. అక్టోబర్ 31న బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అప్పుడే తెలిపారు. సీనియర్ హీరోకి ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో అప్పటి నుంచి షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకొని బాలయ్య ఇంటికే పరిమితమయ్యారు.

బాలకృష్ణ భుజానికి చేసిన సర్జరీ విజయవంతం అయ్యిందని తెలిసినప్పటికీ.. ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందని అభిమానులు కలవరపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య బయటకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ముఖంగా బోరున విలపించిన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం నందమూరి కుటుంబం స్పందించింది.

భువనేశ్వరి సోదరుడు, వియ్యంకుడు కూడా అయిన హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఈరోజు నందమూరి కుటుంబానికి చెందిన ఇతర సభ్యులతో కలిసి తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. తన అక్క జోలికి వస్తే మెడలు విరిచేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. ఈ సందర్భంగా ఆయన హ్యాండ్ కి కట్టుకట్టి ఉండటాన్ని గమనించవచ్చు. ఇటీవల భుజానికి ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో చేయి కదలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య ను ఈ విధంగా చూసిన అభిమానులు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

కాగా, 2018లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడ్డారు.అప్పటి నుంచి బాలయ్య రొటేటర్ కఫ్ టియర్స్ ఆఫ్ షోల్డర్ సమస్యతో బాధపడుతున్నారు. గతంలోనే కాంటినెంటల్ హాస్పిటల్ లో దీనికి సర్జరీ కూడా చేశారు. అయితే గత కొన్ని నెలలుగా భుజం నొప్పి ఇబ్బంది పెడుతుండటంతో కేర్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్ రెడ్డి - డాక్టర్ బీ.ఎన్.ప్రసాద్ ల బృందం దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఇకపోతే 'అఖండ' సినిమాని విడుదలకు సిద్ధం చేసిన బాలకృష్ణ.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు ఓటీటీలో అడుగుపెట్టి ‘అన్ స్టాపబుల్’ విత్ ఎన్బీకే అనే టాక్ షో లో సందడి చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవ్వగా.. బాలకృష్ణ ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవడంతో తదుపరి ఎపిసోడ్ షూటింగ్ నిలిచిపోయింది. పూర్తిగా కోలుకున్న తర్వాత బాలయ్య తిరిగి సెట్ లో అడుగుపెట్టనున్నారు.