Begin typing your search above and press return to search.

లత పాట కోసం...నెహ్రూ ఏం చేశారంటే...?

By:  Tupaki Desk   |   6 Feb 2022 1:37 PM GMT
లత పాట కోసం...నెహ్రూ ఏం చేశారంటే...?
X
ఆయన దేశానికి మొదటి ప్రధాన మంత్రి. సర్వ శక్తిమంతుడు. ఆయనలో కళాభినివేశం ఉంది. సంగీతం పట్ల మక్కువ ఉంది. ఎందరో ఉద్ధండులు ఆయన సమక్షంలో చాలా సార్లు కచేరీలు నిర్వహించేవారు. అయితే నాటికి మూడు పదుల వయసులో ఉన్న లత అపుడే సినీ కెరీర్ లో తన కంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు. ఆమె గొంతు అపుడే శ్రోతలను కట్టి పడేస్తోంది.

అలాంటి టైమ్ లో నెహ్రూకు లతను పరిచయం చేసింది బాలీవుడ్ దర్శక నిర్మాత మెహబూబ్‌ ఖాన్‌. ఆయన నెహ్రూ వీరాభిమాని. నెహ్రూ అప్పట్లో అంటే 1962లో చైనా దురాక్రమణ చేసి భారత్ మీద దాడికి పాల్పడిన నేపధ్యంలో బాగా కలత చెంది ఉన్నారు. భారత్ చీనీ భాయీ భాయీ అని నెహ్రూ నాడు అందమైన స్లోగన్ ఇచ్చేవారు. చైనా పొరుగుదేశం కాదు, మిత్ర దేశమని నమ్మేవారు. అలాంటిది నెహ్రూని చైనా పెద్దలు మోసం చేశారు. దురాక్రమ‌ణకు దిగి టిబెట్ ని ఆక్రమించారు. కొంత భారత్ భూ భాగాన్ని కూడా లాగేసుకున్నారు.

దీంతో నెహ్రూ పడిన మధన అంతా ఇంతా కాదు, ఆ బాధలోనే ఆయన 1964 మే 27న మరణించారు అని చెబుతారు. సరే దానికి ఒక ఏడాది ముందు అంటే 1963 జనవరి 26న గణతంత్ర వేడుకల వేళ నెహ్రూ సమక్షంలో లతా మంగేష్కర్ ఈ పాటను పాడినప్పుడు నెహ్రూకే కన్నీళ్లు వచ్చాయి. నాడు లత పాడినది ఒక ప్రైవేట్ గీతం. కవి-గీత రచయిత ప్రదీప్ రాసిన ఐ మేరే వతన్ కే లోగోన్ కి లత స్వరం సమకూర్చారు. ఇది చైనా యుద్ధంతో పోరాడి అమరులైన సైనికుల కొరకు, వారు చేసిన త్యాగాల కోసం రాసిన గీతం.

ఈ పాట వినగానే నెహ్రూకి కళ్లమ్మట నీళ్ళు అలా వచ్చేశాయట. ఈ అమ్మాయి నన్ను ఏడిపించేసింది అని దర్శక నిర్మాత మెహబూబ్‌ ఖాన్ తో చెప్పారుట. ఆ తరువాత అంటే 27వ తేదీన సినిమా కళాకారులందరికీ నెహ్రూ తేనీటి విందును ఇచ్చారు. ఆ కార్యక్రమానికి వచ్చిన లత ఒక మూలన ఉంటే లత ఎక్కడ అంటూ నెహ్రూ వాకబు చేసి ఆమెను పిలిపించుకోవడం ఒక ముచ్చట.

అంతే కాదు ఆమెతో తాను తీయించుకున్న ఫోటోను బహుమతిగా ఇచ్చారు. ఇక ఆ తరువాత మరి కొన్నాళ్ళకు ముంబైలో జరిగిన మరో కార్యక్రమానికి సడెన్ గా నెహ్రూ వచ్చేశారు. అలా వచ్చిన నెహ్రూ కార్యక్రమంలో లేని ఒక పాట అంటే ఐ మేరే వతన్ కే లోగోన్ పాటను పాడమని ఒక సందేశాన్ని లతకు పంపించారు. ఆమె ఆ పాట పాడగానే నెహ్రూ తన్మ‌యత్వానికి లోను అయ్యారు.

ఆ పాట అయిపోతూనే నెహ్రూ కూడా వెళ్లిపోయారు. అయితే ఆయన కారు దగ్గరకు లతను పిలిపించుకుని నీవు ఐ మేరే వతన్ కే లోగోన్ పాట పాడావు, చాలా సంతోసహంగా ఉంది. ఒక వేళ నీవు పాడకపోతే నేను నిరాశ చెందేవాడిని అన్నారుట. ప్రత్యేకించి నీ పాట కోసమే వచ్చాను అని నెహ్రూ పండితుడు లత గురించి చెప్పడం అంటే అంతకంటే ఆమె కీర్తి కిరీటంలో కొత్త బిరుదు ఇంకేం కావాలి. దటీజ్ లత. అంతే.