Begin typing your search above and press return to search.

అరె.. శివాజీరాజాకు ఏమంది? అలా అయిపోయారు?

By:  Tupaki Desk   |   5 July 2021 3:30 AM GMT
అరె.. శివాజీరాజాకు ఏమంది? అలా అయిపోయారు?
X
తెలుగుసినిమా ఇండస్ట్రీలో సుపరిచితుడు.. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటుల్లో శివాజీరాజా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. కమెడియన్ గా.. విలన్ గా.. చివరకు హీరోగా కూడా నటించి మెప్పించిన ఆయన్ను గుర్తుకు తెచ్చుకున్నంతనే కాస్తంత బొద్దుగా గుర్తుకు వస్తారు. దాదాపు 400 పైనే సినిమాలు చేసిన ఆయన.. తాజాగా తన కుమారుడు నటిస్తున్న సినిమాకు సంబంధించిన కార్యక్రమానికి హాజరై అందరికి షాకిచ్చారు. తన రూపంతో ఆయనిప్పుడు చర్చనీయాంశంగా మారారు.

కాస్తంత బొద్దుగా ఉండే శివాజీరాజా.. సన్నగా పీలగా.. వయసు మరింత మీద పడినట్లుగా.. కాసింత బలహీనంగా కనిపించారు. కాకుంటే.. ఎప్పటిలానే ఆయనలో ఉత్సాహం మాత్రం తగ్గింది లేదు. ఇటీవల కాలంలో మీడియాకు దూరంగా..ఆ మాటకు వస్తే ఇండస్ట్రీలో జరిగే ప్రోగ్రాంలో పాల్గొనని ఆయన.. తన కొడుకు వినయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘వేయు శుభములు కలుగు నీకు’ మూవీలోని ఒక పాట విడుదల చేసే కార్యక్రమానికి తాజాగా హాజరయ్యారు.

రోటీన్ కు భిన్నంగా.. ఆయన రూపం చూసిన వారంతా ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యారు. అదేంటి శివాజీరాజా అలా అయిపోయారు? ఆయనకేమైంది? ఇప్పుడెలా ఉన్నారు? చూసినంతనే కంగారు పడేంత సన్నగా ఉన్న ఆయన ప్రోగ్రాం మొత్తంగా హాట్ టాపిక్ గా మారారు. శివాజీరాజా కొడుకు సినిమా గురించి.. తాజాగా విడుదల చేసిన పాట గురించి కంటే కూడా.. శివాజీరాజా హెల్త్ మీద.. ఆయన రూపం మీదనే ఎక్కువగా ఫోకస్ కావటం గమనార్హం.

అయితే.. ఆయన సన్నిహితులు అందిస్తున్న సమాచారం ప్రకారం కొంతకాలం క్రితం శివాజీరాజాకు తీవ్రమైన గుండెపోటు రావటం.. ఆసుపత్రిలో చేరటం.. అక్కడ కొంతకాలంగా చికిత్స పొందారని చెబుతున్నారు. అనంతరం ఆరోగ్యం మీదనే పూర్తిగా ఫోకస్ పెట్టిన ఆయన.. ఇంటినుంచి బయటకు వచ్చింది లేదని చెబుతారు. ఆరోగ్య కారణాలతో బరువు తగ్గినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన బాగున్నారని.. ఆరోగ్య సమస్య లేదని చెబుతున్నారు. దాదాపు 35 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పని చేసిన ఆయన కొద్దికాలం పాటు ‘మా’ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా వ్యవహరించటం తెలిసిందే. ఏమైనా.. శివాజీరాజా తాజా లుక్ మాత్రం జీర్ణించుకోలేనంత షాకింగ్ గా మారింది.