Begin typing your search above and press return to search.

నాలుగు సినిమాలూ అడ్రస్ లేవు

By:  Tupaki Desk   |   24 July 2018 8:31 AM GMT
నాలుగు సినిమాలూ అడ్రస్ లేవు
X
ముందు వారం వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ ఇప్పటికీ జోరు కొనసాగిస్తోంది. కానీ గత వారాంతంలో వచ్చిన కొత్త సినిమాలు మాత్రం అడ్రస్ లేకుండా పోయాయి. ఒకటికి నాలుగు సినిమాలు రిలీజ్ చేశారు ఈ వీకెండ్లో. కానీ అందులో ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయింది. అసలు ఇందులో వేటికీ ప్రి రిలీజ్ బజ్ లేదు. ఉన్నంతలో రాజ్ తరుణ్ సినిమా ‘లవర్’ కొంచెం మెరుగ్గా కనిపించింది. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత.. ‘అలా ఎలా’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన అనీష్ కృష్ణ కలిసి తీసిన సినిమా కావడంతో ‘లవర్’లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే అనుకున్నారంతా. కానీ అది పాత చింతకాయ పచ్చడిలా ఉండటంతో జనాలు తొలి షోతోనే పెదవి విరిచేశారు. తొలి రోజు మ్యాట్నీ నుంచే వసూళ్లు పడిపోయాయి. దిల్ రాజు ప్రొడక్షన్లో ఏ చిత్రానికీ లేనంత పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి ఈ చిత్రానికి. తర్వాత ఏ దశలోనూ సినిమా కోలుకోలేదు. వీకెండ్ తర్వాత దయనీయంగా ఉంది ఈ సినిమా పరిస్థితి.

ఇక మంచు లక్ష్మి సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’ కంటెంట్ పరంగా ఓకే అయినా.. అది కూడా జనరంజకంగా లేకపోయింది. మంచు ఫ్యామిలీ వాళ్ల సినిమాలంటేనే జనాలు ఆసక్తి చూపించని పరిస్థితి. వాళ్ల ట్రాక్ రికార్డు అంత దారుణంగా ఉంది. ఈ ఫ్యామిలీ హీరోల పరిస్థితి దయనీయంగా ఉండగా.. ఇక మంచు లక్ష్మి సంగతి చెప్పేదేముంది? కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ లేవు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కినప్పటికీ పెట్టుబడిలో సగం కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. చంద్రసిద్దార్థ సినిమా ‘ఆటగదరా శివ’ పరిస్థితి మరింత ఘోరం. ఇందులో చెప్పుకోదగ్గ కాస్టింగ్ కూడా లేకపోవడంతో దీనిపై జనాలు అసలేమాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. దీన్ని రిలీజ్ చేయడమే నామమాత్రంగా చేశారు. చంద్ర సిద్దార్థ మీద అభిమానంతో సినిమా చూసిన వాళ్లు కూడా దీని గురించి పాజిటివ్ గా మాట్లాడట్లేదు. ఇక అందరూ కొత్తవాళ్లతో లక్ష్మీకాంత్ చెన్నా తీసిన ‘పరిచయం’ పరిస్థితీ ఘోరమే. ప్రోమోల్లో ఉన్న కళ సినిమాలో లేకపోవడంతో ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించట్లేదు. మొత్తంగా గత వారాంతంలో విడుదలైన సినిమాలన్నింటికీ పరాభవం తప్పలేదు బాక్సాఫీస్ దగ్గర.