Begin typing your search above and press return to search.

కొన్ని వెబ్ సైట్స్ తీరు మారాలా ?

By:  Tupaki Desk   |   9 Oct 2017 5:10 AM GMT
కొన్ని వెబ్ సైట్స్ తీరు మారాలా ?
X
ఎన్నడు లేనంత విస్తృతంగా వెబ్ సైట్స్ - సోషల్ మీడియాలో సినిమాలపై వస్తున్న రివ్యూలు. - కామెంట్స్ గురించి తీవ్ర చర్చ జరుగుతున్న తీరుని గమనిస్తూనే ఉన్నాం. స్టార్ హీరోలు మొదలుకొని చోటా మోటా ఆర్టిస్ట్ దాకా - బడా నిర్మాత మొదలుకొని ఇప్పుడిప్పుడే పైకొస్తున్న దర్శకుల దాకా ప్రతి ఒక్కరు వీటి గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఫేస్ బుక్ - ట్విట్టర్ లాంటి సామాజిక అనుసంధాన వేదికలపై కూడా ఒకరికి ఒకరు ఏమాత్రం ముఖ పరిచయం లేని వ్యక్తులు సైతం రివ్యూల విషయంలో గొడవలు పడి యుద్ధాలు చేసుకుంటున్నంత పని చేస్తున్నారు. అసలు దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయి, దీన్ని ఎలా రూపుమాపాలి అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు కాని దర్శక నిర్మాతల కోణం నుంచి మాత్రం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు సినిమాకు అందులోనూ ప్రత్యేకంగా ప్రాంతీయ సినిమాకు చాలా పరిమితమైన మార్కెట్ ఉండేది. ఓవర్సీస్ అనేది కలలో మాట. సినిమా చూపించే ప్రక్రియ డిజిటలైజేషన్ కాక ముందు - టెక్నాలజీ ఈ స్థాయిలో అందుబాటులోకి రాక ముందు సదరు మూవీ బాగుందా లేదా అని సామాన్య ప్రజానీకానికి తెలియడానికి చాలా టైం పట్టేది. అప్పట్లో సితార - జ్యోతిచిత్ర - విజయచిత్ర - సినిమారంగం లాంటి పత్రికలు కేవలం సినిమా వార్తలు మీదే నడిచేవి. వీటిలో రివ్యూలు చాలా నిష్పక్షపాతంగా ఉండటమే కాక ఒక వారం ఆలస్యంగా వచ్చినా జనం ఫీల్ కాకుండా వాటిని ఆసక్తిగా చదివే వారు. రివ్యూ రాయడం గొప్ప కళగా భావించేవారు.

కాని మారుతున్న టెక్నాలజీలో ప్రతి ఒక్కరు రివ్యూ రైటర్ గా మారుతున్నారు. వెబ్ సైట్స్ పెరిగాయి. విజిట్స్ కోసం పోటీ పెరిగింది. లైవ్ అప్ డేట్స్ పేరుతో సినిమా చాలా కేంద్రాల్లో టైటిల్ కూడా పడకుండానే నిమిషనిమిషానికి తెర మీద ఏం జరుగుతుందో నగ్నంగా చూపించే ధోరణి బాగా పెరిగిపోయింది. నిర్మాతలు ఇక్కడే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాను పూర్తిగా ఆస్వాదించకుండా కేవలం సైట్ కు సమాచారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందో చేరవేయడంలోనే శ్రద్ధ పెట్టడం వల్ల అసలు సినిమా నిజంగా బాగుందా లేదా అనే నిర్ణయం ఎలా తీసుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అన్ని వెబ్ సైట్స్ తీరు ఒకేలా లేదు. కొన్ని సైట్స్ విలువలకు కట్టుబడి సినిమా మీద నిజమైన అభిప్రాయం వ్యక్త పరుస్తుండగా కొన్ని మాత్రం ఎక్కడ రీడర్స్ మిస్ అవుతారో అని హడావుడిగా రివ్యూలు రాయించి పోస్ట్ చేయిస్తున్న వారు లేకపోలేదు. లైవ్ అప్ డేట్స్ గురించి నిర్మాతలు వ్యక్తం చేస్తున్న ఆవేదన అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన నిర్మాతకు ఆ సినిమా పోతే వచ్చే శుక్రవారానికి మరో ఆప్షన్ ఉండదు. కాని కేవలం రేటింగ్స్ కోసమే లైవ్ అప్ డేట్స్ ఇస్తున్న సదరు వెబ్ సైట్స్ కి మాత్రం మరో సినిమా సిద్ధంగా ఉంటుంది.

నిజానికి రివ్యూ అనేది సినిమా చూడాలి అనుకున్న ప్రేక్షకుడికి దిక్సూచి లాంటిది. అంతే తప్ప చూడాలా వద్దా అని నిర్దాక్షిణ్యంగా డిసైడ్ చేసే గైడ్ కాదు. కంటెంట్ బాగుండి - పబ్లిసిటీ పరంగా వెనుకబడి ఇబ్బంది పడుతున్న సినిమాలకు వెబ్ మీడియా తమ రివ్యూస్ అండ్ ఆర్టికల్స్ రూపంలో ఇతోధికంగా సహాయం చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పెళ్లి చూపులు - అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు మార్కెట్లో అంత బలంగా తమ ప్రభావం చూపడానికి ఇవి కూడా కారణమే. వీక్ గా ఉన్న సినిమాని తమ వ్యక్తిగత ప్రాధాన్యతలను ఆధారం చేసుకుంది ఎంత బాగుందని రాసినా ఆడకుండా టపా కట్టేసిన ఉదాహరణలు ఇంతకు రెట్టింపు ఉన్నాయి. ఇది రెండు వైపులా బొమ్మ ఉన్న కాయిన్ లాంటిది. ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో గాల్లోకి ఎగరేసాక చెప్పడం ఎవరి తరం కాదు. అలా అని చెప్పి గతంలో కూడా ఇలాంటి ధోరణి లేదు అని వాళ్ళ వెర్షన్ కూడా తప్పే. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే పుష్కర కాలం క్రితం వరకు ఆంధ్రభూమి డైలీ న్యూస్ పేపర్ తో పాటు ప్రతి శుక్రవారం వెన్నెల అనే సప్లిమెంట్ ఒకటి వచ్చేది(ఇప్పుడు కూడా వస్తోంది). వారం వరం విడుదలైన కొత్త సినిమాల గురించి డిటైల్డ్ రివ్యూ ఆ తర్వాతి వారం ఇచ్చేవాళ్ళు. కేవలం ఇది చదవడానికే ఆ ఒక్క రోజు పేపర్ కొనే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండేది. అంత నమ్మకం ఏర్పరుచుకున్న వెన్నెల శీర్షిక సైతం మురారి - ఇంద్ర లాంటి సినిమాల గురించి నెగటివ్ రివ్యూ ఇచ్చింది. కాని అవి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దాని ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా వాటి మీద దాని ఎఫెక్ట్ పడలేదు.

సినిమా బాగుంటే ఎవరు ఎంత రాసినా - ఏమన్నా ఆడకుండా ఆపలేరు. కాని కంటెంట్ మీద డివైడ్ టాక్ ఉన్న సినిమాల విషయంలో లైవ్ అప్ డేట్స్ గురించి ఆ కొన్ని వెబ్ సైట్స్ చూపించే అత్యుత్సాహం వల్ల నష్టపోతున్న నిర్మాతలు ఉన్నారు. సినిమా ఎలా ఉన్నా మొదటి రోజు కనీస వసూళ్లు కూడా ఇలాంటి పోకడ వల్ల దెబ్బ తింటున్నాయి. అసలు సినిమా అయ్యాక పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్క ఎంజాయ్ చేస్తున్నారు, వేటికి రెస్పాన్స్ బాగా వస్తోంది అని గమనించి తర్వాత డిటైల్డ్ రివ్యూ ఇస్తే బాగుంటుంది కాని మరీ లేచిందే లేడికి పరుగు తరహాలో వ్యవహరిస్తున్న లైవ్ అప్ డేట్స్ సైట్స్ ఇకనైనా మారాలని నిర్మాతలు కోరుతున్నారు.

వెబ్ సైట్స్ లో ఇచ్చే లైవ్ అప్ డేట్స్ కావొచ్చు - ఫాస్ట్ గా ఇచ్చే ఎర్లీ రివ్యూస్ కావొచ్చు. ఎంతో కొంత సినిమా మీద ఆధారపడుతున్న నిర్మాతలు - దర్శకులు - నటీనటులు - సాంకేతిక వర్గం మీద ప్రభావం చూపుతున్న విషయాన్నీ మరిచిపోకూడదు. సక్సెస్ ఉంటేనే పలకరింపు - గుర్తింపు ఉన్న పరిశ్రమలో ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకునే సినిమాలు తీస్తున్నారు. అయినా కూడా సక్సెస్ పర్సెంటేజ్ తక్కువగా ఉండడానికి కారణాల గురించి కూడా మేకర్స్ ఫోకస్ పెంచితే మంచిది. ప్రేక్షకులు సైతం తెలివితో వ్యవహరిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా మాటలనో కొన్ని వెబ్ సైట్స్ రాతలనో ఆధారంగా చేసుకుని ప్రతి సినిమా చూడటం లేదు. నిజాయితీగా వ్యవహరించే సైట్స్ కి కూడా కొదవ లేదు. వాటిని నమ్మి తమ నిర్ణయం తీసుకునే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అలాంటి బాద్యత కలిగిన సైట్స్ మీద తమకు గౌరవం కూడా ఉందని మా అసోసియేషన్ ఒక లైవ్ చాట్ లో చెప్పింది కూడా. సో ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని రాసుకున్నా ఇక్కడ చివరికి గెలిచేది, ఓడేది సినిమానే. కాబట్టి ఎవరికి వారు బాధ్యతగా తమ పరిధిలో తాము చేయాల్సింది సరిగ్గా చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. మంచి కథలతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు, వాటిని చక్కగా జడ్జ్ చేసే తమ బాధ్యతను రివ్యూస్ రూపంలో ప్రజలకు అందించే వెబ్ సైట్స్ మధ్య బంధం ఎన్నటికి మాసిపోదు. తాత్కాలిక ప్రయోజనాల మీద దృష్టి మరల్చినప్పుడే సమస్య మొదలవుతుంది. సినిమా అందరి కంటే గొప్పది. అందరి కంటే ఉన్నతమైనది.