Begin typing your search above and press return to search.

స్కూలు.. ఇల్లు.. గుడి కంటే సెట్లే సౌక‌ర్య‌మ‌న్న క‌ళాత్మ‌క ద‌ర్శ‌కుడు!

By:  Tupaki Desk   |   28 Sept 2021 7:00 AM IST
స్కూలు.. ఇల్లు.. గుడి కంటే సెట్లే సౌక‌ర్య‌మ‌న్న క‌ళాత్మ‌క ద‌ర్శ‌కుడు!
X
బాలీవుడ్ స్టార్ మేక‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ క్రియేటివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చారిత్ర‌క‌ నేప‌థ్యంతో భారీ చిత్రాలు తెర‌కెక్కిచ‌డంలో భ‌న్సాలీ బాలీవుడ్ లోనే ఓ బ్రాండ్. త‌నదైన శైలి క‌ళాత్మ‌క మేకింగ్ తో విజువ‌ల్ ట్రీట్ ఇవ్వ‌డం ఆయ‌నకే చెల్లింది. చ‌రిత్ర పై ఆయ‌న‌కున్న అపార‌మైన నాలెడ్జ్... ఎనాల‌సిస్... దాన్ని తెలివిగా క‌మ‌ర్శిలైజ్డ్ చేసి తెర‌కెక్కించ‌డం భ‌న్సాలీ ప్ర‌త్యేక‌త‌. అందుకు హిస్ట‌రీ నేప‌థ్యం ఉన్న చిత్రాలు తెర‌కెక్కించాలంటే సంజ‌య్ లీలా బ‌రిలోకి రావాల్సిందే. ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి అక్క‌డి అగ్ర హీరోలు పోటీ ప‌డుతుంటారు. అలా బాలీవుడ్ వెండి తెర‌ను భ‌న్సాలీ ద‌శాబ్ధాలుగా ఏల్తున్నారు.

అయితే ఇప్పుడు ఆయ‌న వెబ్ -ఓటీటీలోనూ త‌న‌దైన‌ మార్క్ ని వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. వెబ్ సిరీస్ ల ద్వారా త‌న కంటెంట్ ని స్మార్ట్ ప్రేక్ష‌కుల‌కు అందించడానికి రెడీ అవుతున్నారు. దిగ్గ‌జ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ తో `హీర‌మండి `అనే వెబ్ సిరీస్ చేయ‌డానికి ఆయ‌న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వెబ్ సిరీస్ కూడా ఓ సంచ‌ల‌నాత్మ క‌థాంశ‌మే. అందుకోసం మ‌రోసారి చ‌రిత్ర పుస్త‌కాల్ని తిర‌గేసిన‌ట్లు తెలుస్తోంది. నెట్ ప్లిక్స్ గ్లోబ‌ల్ ఫ్యాన్ ఈవెంట్ టుడుమ్ వేదిక‌గా త‌న విజ‌న్ ని భ‌న్సాలీ పంచుకున్నారు. ప్రేమ..ద్రోహం..వార‌సత్వం ..రాజ‌కీయం అనే నాలుగు అంశాల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఇది ఈనాటి స్టోరీ కాదు. ఆ క‌థ తెలియాలంటే స్వ‌తంత్ర భార‌త‌దేశం చ‌రిత్ర తెలుసుకోవాల్సిందే.

ఇది పురాత‌న భార‌త‌దేశ చ‌రిత్ర‌లో కొంత మంది వేశ్య‌ల క‌థ‌. స్వాతంత్ర్యానికి ముందు హీరామండి అనే ప్రాంతంలో వేశ్య‌ల జీవితాలు ఎలా ఉండేవి? అనే సంచ‌ల‌నా పాయింట్ ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్క‌బోతుంది. `హీరామండి `అనేది ఈ వెబ్ సిరీస్ టైటిల్. వాళ్ల జీవితాల్లో భాగ‌మైన ప్రేమ‌..ద్రోహం..రాజ‌కీయం..వార‌స‌త్వం అనే అంశాల్ని ప్ర‌ధానం చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక త‌న‌పై ఇంత‌గా సినిమాల ప్ర‌భావం ప‌డ‌టానికి త‌న తండ్రి గారు కార‌ణ‌మ‌ని చెప్పారు. త‌న నాలుగేళ్ల వ‌య‌సులో త‌న తండ్రి ఓ సినిమా సెట్ లో కూర్చోబెట్టి త‌న స్నేహితుడ్ని క‌లిసి వ‌స్తాన‌ని చెప్పి వెళ్లారుట‌.

అలాంటి ప్లేస్ కి వెళ్ల‌డం చాలా కొత్త‌గా అనిపించ‌డంతో పాటు ఎంతో సౌక‌ర్య‌వంతంగా అనిపించిందిట‌. స్కూలు..ఇల్లు..దేవాల‌యా లు ఇలా ఏవీ ఇవ్వ‌ని సంతోషాన్ని సినిమా సెట్ ఇచ్చిందిట‌. అందుకే సినిమా సెట్ నే త‌న దేవాల‌యంగా..స‌ర్వ‌స్వంగా ఆ వ‌య‌సు నుంచే భావించ‌డం మొద‌లుపెట్టారుట‌. అదీ భ‌న్సాలీ సినిమా ఇన్ ప్లూయెన్స్ వెనుక క‌థ‌.

ఆయ‌న కోసం ఉచితంగానే..

క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజయ్ లీలా భన్సాలీ తెర‌కెక్కించిన రామ్ లీలా-భాజీరావ్ మ‌స్తానీ- ప‌ద్మావ‌త్- గుజారిష్ వంటివి ప్ర‌జ‌ల మ‌న‌సు దోచి క్రిటిక్స్ ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకున్న‌ సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్ లాంటి క్లాసిక్ ని.. ఐశ్వ‌ర్యారాయ్- షారూక్ ద్వ‌యంతో దేవ‌దాస్ లాంటి గొప్ప ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇవ‌న్నీ క్రిటిక్స్ తో పాటు ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకున్నాయి. ఇటీవ‌ల బాలీవుడ్ లో 25 సంవత్సరాల కెరీర్ ని పూర్తి చేసుకున్నారు భ‌న్సాలీ.

గ‌త కొంత‌కాలంగా నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ హీరమండితో డిజిటల్ అరంగేట్రం చేయడానికి క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు భ‌న్సాలీ సిద్ధంగా ఉన్నార‌న్న ప్ర‌చారం హీటెక్కిస్తోంది. ఈ భారీ సిరీస్ లాహోర్ (ప్ర‌స్తుత పాకిస్తాన్)లో స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోంది. హీరా మండి సిరీస్ కోసం భన్సాలీ కొంద‌రు అగ్ర క‌థానాయిక‌ల‌ను ఎంపిక చేయ‌నున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఐశ్వర్యరాయ్ బచ్చన్- మాధురీ దీక్షిత్- దీపికా పదుకొణె- పరిణీతి చోప్రా- మనీషా కొయిరాలా- విద్యాబాలన్ త‌దిత‌ర పేర్లు జాబితాలో వినిపిస్తున్నాయి.

అయితే హీరామండిలో అవ‌కాశం ఇస్తే తాను ఉచితంగా న‌టిస్తాన‌ని ఆలియా భ‌ట్ ద‌ర్శ‌కుడు భ‌న్సాలీని కోర‌గా ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. గంగూభాయిగా త‌న‌ని ఆవిష్క‌రించిన గురూజీకి ఉచిత ఆఫ‌ర్ ఇచ్చింది ఆలియా. అయితే ఆలియా ఆఫర్ ను భన్సాలీ వెంటనే తిరస్కరించ‌డ‌మే గాక‌.. త‌న‌ మార్కెట్ రేంజుకు త‌గ్గ పారితోషికం చెల్లిస్తానని త‌న‌కు ఓ రోల్ ఉంటుంద‌ని ఆమెకు హామీ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ నిర్మాతలు ఆలియాకు అలాగే ఇత‌ర తార‌ల‌కు అందాల్సిన పారితోషికాన్ని చెల్లిస్తార‌ని వెల్ల‌డించార‌ట‌.

హీర‌మండి వెబ్ సిరీస్ లో ఏడు ఎపిసోడ్ లు ఉంటాయి. భన్సాలీ మొదటి ఎపిసోడ్‌కు దర్శకత్వం వహిస్తారు. మిగిలిన ఆరు ఎపిసోడ్ లకు భసాలి పర్యవేక్షణలో విభూ పూరి దర్శకత్వం వహించనున్నారు. నెట్ ఫ్లిక్స్ ఇండియా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది.

ప్ర‌స్తుతం ఆలియా ప్ర‌ధాన పాత్ర‌లో గంగూభాయి క‌తియావాడీ అనే చిత్రాన్ని భ‌న్సాలీ తెర‌కెక్కించారు. క్లాసిక్ డేస్ లో ఒక వేశ్యా గృహ నిర్వాహ‌కురాలి క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్క‌గా ఆలియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు.